యూరియా కొరత అన్నది ఇపుడు దేశవ్యాప్తంగా సమస్యగా ఉంది. అక్కడా ఇక్కడా అన్నది లేదు అన్ని చోట్లా రైతులు యూరియా కోసం క్యూలు కడుతున్నారు. అయితే ఇంతలా యూరియా కోసం రైతాంగం ఆందోళన వ్యక్తం చేయడం అన్నది ఇటీవల కాలంలో అయితే ఎక్కడా ఎవరూ చూసినది లేదు. సగటు జనాలకు యూరియా అన్నది ఏమిటో కూడా తెలియదు. వ్యవసాయం మీద అవగాహన ఉన్న వారు మాత్రమే ఈ ఇష్యూ మీద అటెన్షన్ పెడుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు దీనిని తమకు అనుకూలంగా చేసుకుని అధికార పక్షం మీద విమర్శల దాడి చేస్తున్నాయి.
ఈ ప్రశ్న ఇపుడు చాలా మందిలో ఉంది. యూరియా మాంసకృత్తులు విచ్ఛిన్నం వల్ల ఏర్పడే నైట్రోజన్ సంబంధమయిన సమ్మేళనంగా శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ సేంద్రీయ మిశ్రమం రసాయనిక శాస్త్రంలో ఒక మైలురాయిగా వందల ఏళ్ళ క్రితం కనుగొన్నారు. యూరియా అన్నది నీటిలో బాగా కరుగుతుంది. వ్యవసాయంలో ఎరువుగా యూరియా ఉపయోగిస్తారు. ఆయా ప్రాంతాలు మట్టిని ఆధారంగా చేసుకొని ఒక హెక్టారుకు 40 నుండి 300 కిలోల దాకా యూరియాను పొలలలో వెదజల్లుతారు. అయితే దీనిని ఎక్కువ మోతాదులో ఉపయోగించడం ప్రమాదకరమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతే కాదు వ్యవసాయ అభివృద్ధి శాఖ అధికారులు ప్రతిపాదించిన మోతాదులోనే దీనిని వినియోగించడం వల్లనే ప్రయోజనం ఉంటుంది.
అయితే పంట ఎక్కువగా పండాలని యూరియాను ఎక్కువగా వాడడం ఇటీవల కాలంలో అధికం అయింది సేంద్రియ ఎరువుల స్థానంలో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడంతో గిరాకీ అంతకంతకు పెరిగిపోతోంది దాంతో యూరియా ఇపుడు అందరికీ ఒక నిత్యావసరంగా మారింది. దాంతో పాటు ఈసారి అనుకున్న డిమాండ్ కి తగినట్లుగా సరఫరా లేకపోవడంతో దేశవ్యాప్తంగా యూరియా కొరత ఉంది అని అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ యూరియా అధిక వినియోగం మీద కీలక వ్యాఖ్యలు చేశారు. తగిన మోతాదులోనే యూరియా వాడాలని ఆయన అన్నారు. ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ మహమ్మారి బారిన పడతారు అని అన్నారు. పంజాబ్ దీనికి ఒక ఉదాహరణ చెప్పారు. ఆ రాష్ట్రంలో ప్రతీ రోజూ రెండు ప్రత్యేక రైళ్ళు క్యాన్సర్ రోగులను తీసుకుని ఢిల్లీకి వెళ్తాయని బాబు చెప్పారు. ఏపీలో కూడా టాప్ ఫైవ్ లో క్యాన్సర్ కేసులు ఉన్నాయని ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే యూరియా వాడకం తగ్గించడం ముఖ్యమని అన్నారు.
అంతే కాదు వచ్చే ఏడాది నుంచి రైతులు ప్రస్తుతం వాడుతున్న యూరియాను బాగా తగ్గించేలా చూస్తామని అన్నారు. అలా ఎవరైతే యూరియాను తగ్గించి వ్యవసాయం చేస్తారో వారికి ప్రతి కట్టకు 800 రూపాయలు నేరుగా రైతులకే అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రకటించడం విశేషం. ఇక చూస్తే కనుక చాలా మంది రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఈ విధంగా అధికంగా ఎరువులు వాడడం వల్ల మన మిరపను చైనా నుంచి తిప్పి పంపారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అతే కాదు కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తులకు ఇచ్చే ధరలను బాగా తగ్గిస్తున్నాయని చంద్రబాబు వివరించారు. అందువల్ల రైతులు యూరియా వాడకాన్ని బాగా తగ్గించేలా చూడాలని బాబు కలెక్టర్ల సమావేశంలో కోరారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విషయాలు చాలా మంచివే అని అంతా అంటున్నారు. మనం పండించే పంట విష తుల్యం కాకూడు, అధిక దిగుబడి కోసం చేసే ప్రయత్నాలు అసలుకే ఎసరు తీసుకుని రాకూడదు కానీ ఇది ఇవాళా నిన్నా జరగడం లేదు ఎన్నో ఏళ్ళుగానే ఎరువుల వాడకం అధికంగా ఉంది. మరి బాబు చెప్పిన ఈ విషయాలను రైతులు ఎంత వరకూ పాటిస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఆ విధంగా వారికి అవగాహన కల్పించి సేంద్రీయ ఎరువుల వైపుగా మళ్ళిస్తే మాత్రం ఆరోగ్యవంతమైన పంటలతో బలవర్ధకమైన సమాజం ఏర్పాటుకు వీలు అవుతుంది. చూడాలి మరి బాబు ప్రకటనలు ఆచరణలో ఎంతవరకూ రిసీవ్ చేసుకుంటారో.
 
			



















