పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల కోసం జమ్మూకశ్మీర్‌లో వేట కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం భద్రతా సిబ్బంది, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ మేరకు అనుమానితుల నివాసాల్లో పోలీసులు ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. పహల్గాం దాడి అనంతరం ఇప్పటివరకు 100కు పైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు చెప్పారు. పహల్గాం ఘటన అనంతరం జమ్మూకశ్మీర్ లో పోలీసులు సోదాలు ప్రారంభించారు. కాగా ఇప్పటివరకు 100కు పైగా ఉగ్రవాదుల అనుచరులు, అనుమానితుల ఇళ్లల్లో సోదాలు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
‘‘ఉగ్రవాదులకు మద్దతిచ్చి దాడులకు సహకరిస్తున్న వారిని పట్టుకోవడంలో రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు చేసేవారి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. దీనిలో భాగంగానే 100కు పైగా ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు. ఉగ్రదాడిలో భాగమైన ప్రతి ఒక్కరికీ శిక్ష పడాల్సిందే’’ అని పోలీసు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు సంబంధించిన 31 ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేసి ఆయుధాలు, డిజిటల్ పరికరాలు, సంబంధిత పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్, సాక్షుల సమక్షంలో ఈ సోదాలు నిర్వహించారు. ఉగ్రవాదులకు పరికరాలను సమకూర్చిన కేసులో నిందితుడు అమిర్ అహ్మద్ గోర్జీ ఇంట్లో కూడా పోలీసులు తనిఖీలు చేశారు. 2021లోనే ఎన్‌ఐఏ అతడిని అరెస్ట్ చేసింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’తో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ మెరుపు దాడుల తర్వాత నుంచి సరిహద్దుల్లో పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. గురువారం కూడా దాయాది సైన్యం కవ్వింపులు కొనసాగాయి. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్ కు పాల్పడుతున్నాయి. ఈ కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతోంది. నివాస ప్రాంతాలే లక్ష్యంగా పాక్ కాల్పులు జరుపుతోంది. దీనితో సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.
ఇదిలాఉండగా.. బుధవారం అర్ధరాత్రి శత్రు సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ జవాను మృతి చెందినట్లు తెలుస్తోంది. పాక్ షెల్లింగ్ లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్‌కు చెందిన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అమరుడైనట్లు వైట్ నైట్ కోర్ ధ్రువీకరించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పూంఛ్, తంగ్ధర్ సెక్టార్లలో పాక్ బలగాల కాల్పులు కొనసాగాయి. ఈ ప్రాంతాల్లో 13 మంది భారత పౌరులు మృతిచెందగా… 57 మంది గాయపడినట్లు సైన్యం వెల్లడించింది. మరణించిన వారిలో నలుగురు చిన్నారులున్నారు. పహల్గాం దాడి తర్వాత నుంచి సరిహద్దుల్లో అలజడి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. గత 14 రోజులుగా పాక్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి.
పహాల్గాం ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ లో ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. ఇద్దరు మహిళా అధికారులు ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు నాయకత్వంలో నిర్వహించిన ఆపరేషన్ లో నామ రూపాల్లేకుండా పోయింది. ‘ఆపరేషన్ సింధూర్’ లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. భారతీయ క్షిపణుల దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబలో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
బహావల్పూర్ లోని జామియా మసీద్ సుభాన్ అల్లాహ్ శిబిరం సముదాయంపై భారత్ జరిపిన క్షిపణి దాడిలో అజార్ సోదరి, ఆమె భర్త, అజార్ మేనల్లుడు, అతని భార్య, మరో మేనల్లుడు, ఉమ్మడి కుటుంబంలోని ఐదుగురు చిన్నారులు చనిపోయారు. వీరితోపాటే అజార్ కు అత్యంత సన్నిహితమైన వ్యక్తి, అతని తల్లి, మరో ఇద్దరు వ్యక్తులూ మరణించారు. ఈ దాడిలో గాయపడిన వారిని దగ్గర్లోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఈ వివరాలను స్వయంగా ఆయనే పాకిస్తాన్ మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది‘ఆపరేషన్ సింధూర్’ పై జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్ పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్ ను నాశనం చేస్తానంటూ లేఖలో పేర్కొన్నారు.
1999లో ఐసీ–814 విమానాన్ని హైజాక్ చేశాక దానిని విడిచిపెట్టాలంటే అజార్‌ను వదిలేయాలని హైజాకర్లు డిమాండ్‌చేయడం, తప్పని పరిస్థితుల్లో అజార్ ను జైలు నుంచి వదిలిపెట్టిన విషయం తెలిసిందే. విడుదలైన నాటి నుంచి అజార్ పాకిస్తాన్ కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలను ఉధృతం చేశాడు. సుభాన్ శిబిరం అలియాస్ ఉస్మానో అలీ క్యాంపస్ గా పిలుచుకునే ఈ ప్రాంగణాన్ని జైషే ఉగ్రసంస్థ ప్రధాన కార్యాలయంగా అజార్ వినియోగించుకుంటున్నాడు. 18 ఎకరాల ఈ ప్రాంతం నుంచే జైషే ఉగ్రసంస్థలోకి కొత్త వాళ్ల రిక్రూట్‌మెంట్లు, విద్వేష బోధన, శిక్షణ, నిధుల సేకరణ తదితర కార్యకలాపాలు కొనసా గుతుంటాయి. దీనితో 2019 మేలో అజార్ ను ఐక్య రాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో 2019 ఏప్రిల్ తర్వాత అజార్ పెద్దగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు. బహావల్పూర్ లోనే ఉంటున్నట్లు గతంలోనే నిఘా సమాచారం భారత్ కు అందింది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడి, 2000లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీపై దాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి, 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడులకు అజార్ సూత్రధారి అని తెలుస్తోంది.
ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. బవహల్పూర్ లోని జైష్-ఎ-మహమ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కర్-ఎ-తొయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం. ఇదులో జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత సైనిక రైళ్ల కదలికలను తెలుసుకునేందుకు పాక్ నిఘా సంస్థలు ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని రైల్వే శాఖ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించిన నిఘా వర్గాల సమాచారం కూడా ఉండటంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. సైనిక రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని అనధికార వ్యక్తులతో పంచుకోవద్దని రైల్వే ఉద్యోగులను హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన అడ్వయిజరీ ఈ నెల 6న జారీ చేసింది.”పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థలు రైల్వే అధికారులకు ఫోన్ చేసి మిలటరీ ప్రత్యేక రైళ్ల సమాచారం అడగవచ్చు. మిలటరీ వింగ్ ఆఫ్ రైల్వేస్ కు మినహా అనధికార వ్యక్తులెవరితోనైనా ఈ సమాచారం పంచుకుంటే దానిని భద్రతా ఉల్లంఘన కింద భావించాల్సి ఉంటుంది. ఇందువల్ల జాతి భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుంది” అని రైల్వే జోన్ల ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్లకు రైల్వే బోర్టు సందేశం పంపింది.
మిల్ రైల్ అనేది భారతీయ రైల్వేలో ప్రత్యేక విభాగం. సైనిక వ్యూహాత్మక ప్రణాళికల్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, యుద్ధం వంటి పరిస్థితుల్లో జవాన్లతోపాటు ట్యాంకులు, పరికరాలు, ఇతర వస్తువుల రవాణా వీటి ద్వారానే కొనసాగుతుంది. ఇందుకు అవసరమైన సంప్రదింపులు రైల్వేబోర్డు ద్వారా కాకుండా ఈ సైనిక విభాగం ద్వారానే జరుగుతాయి. ఢిల్లీలోని సేనా భవన్ లో దీని కార్యాలయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇండియన్ రైల్వేస్ మిల్ రైల్ విషయంలో హై ఎలర్ట్ ప్రకటించిది.