ప్రపంచ క్రికెట్ లో మేటి ఆల్ రౌండర్.. తన నాయకత్వంతో ప్రపంచ కప్ అందించిన గొప్ప కెప్టెన్.. ఆపై రాజకీయాల్లోకి వచ్చి.. సొంతంగా పార్టీని పెట్టి.. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని… 30 ఏళ్ల పోరాటం అనంతరం పాకిస్థాన్ కు ప్రధానమంత్రి అయిన ఇమ్రాన్ ఖాన్ కు ఏమైంది..? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది..? ఇప్పటికే రెండున్నరేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న 73 ఏళ్ల ఇమ్రాన్ మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చేది ఎప్పుడు? అసలు ఆయన జీవించే ఉన్నారా? ఇలాంటి అనేక ప్రశ్నల నడుమ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇమ్రాన్ ప్రస్తుత అడియాలా జైల్లో ఉన్నారు. కోశాగార కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో జైల్లోనే ఇమ్రాన్ చనిపోయారనే వదంతులు మొదలయ్యాయి.
దీంతో ఆయనను బయటకు చూపించాలంటూ ఇమ్రాన్ స్థాపించిన పార్టీ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు జైలు ఎదుట ఆందోళనకు దిగారు. ఇది కాస్త తీవ్ర రూపం దాల్చింది. జైలు వద్దకు మాజీ ప్రధాని సోదరీమణులు కూడా వచ్చి తమ సోదరుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేయడం.. వారిపై భద్రతా బలగాలు తీవ్రంగా దాడిచేసినట్లు కూడా కథనాలు వస్తున్నాయ. ఇంతకూ వాస్తవంలో ఏం జరిగింది? అనేది బయటకు రావాల్సి ఉంది.
పాకిస్థాన్ నుంచి స్వతంత్ర దేశం కోరుతున్న బలూచిస్థాన్ విదేశాంగ శాఖ చేసిన ఎక్స్ పోస్ట్ మొత్తం వివాదానికి కారణం అవుతోంది. ఇమ్రాన్ ను జైల్లోనే హతమార్చారని, పాకిస్థాన్ సైన్యాధిపతి ఆసిమ్ మునీర్, ఆ దేశ నిఘా విభాగం ఐఎస్ఐ దీనివెనుక ఉన్నాయని బలూచ్ విదేశాంగ శాఖ ఆరోపించింది. దీంతోపాటు పలు మీడియాల్లో వచ్చిన కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. వాస్తవానికి వయసుతో పాటు అనారోగ్య సమస్యలతో ఇమ్రాన్ సతమతం అవుతున్నారు. గతంలోనే ఆయన అనారోగ్యంపై కథనాలు వచ్చాయి. ఇదే రీతిలో ఆయన అనారోగ్యంతో చనిపోయారనే వార్తలు వచ్చాయి. ఇవేవీ ధ్రువీకరణ కాలేదు.
ఇమ్రాన్ కు ఏమైందో అనే ఆందోళనతో ఆయన సోదరీమణులు అడియాలా జైలు వద్దకు వెళ్లి.. కలిసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినట్లుగా కథనాలు వస్తున్నాయి. కానీ, దీనికి భిన్నంగా వారిపై విచక్షణారహితంగా దాడి చేశారని చెబుతున్నారు. ఇది చివరకు ఇమ్రాన్ పార్టీ కార్యకర్తల్లో ఆగ్రహానికి దారితీసింది. పాకిస్థాన్ వ్యాప్తంగా వారు నిరసనలకు దిగారు. ఈ మేరకు వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్ తరఫున 88 టెస్టులు (test)ఆడిన ఇమ్రాన్ 362 వికెట్లు తీశాడు. 3,807 పరుగులు కూడా చేశాడు. 175 వన్డేల్లో (OD)182 వికెట్లు పడగొట్టాడు. 3,709 పరుగులు చేశాడు. అన్నిటికీ మించి తన నాయకత్వంలో 1992లో పాకిస్థాన్ కు వన్డే ప్రపంచ కప్(world cup) అదించాడు. ఆ ప్రపంచ కప్ లో పూర్తిగా ఆశలు లేని స్థితి నుంచి పాకిస్థాన్ ను విజేతగా నిలిపిన ఇమ్రాన్ చరిత్రలో నిలిచిపోయాడు.
-1992 వన్డే ప్రపంచ కప్ రూపం పరంగా అత్యంత అందమైనదిగా చెబుతారు. నాలుగేళ్ల పాటు ప్రపంచ చాంపియన్ జట్టు కెప్టెన్ హోదా అనుభవించిన ఇమ్రాన్ .. ప్రధానమంత్రిగా మాత్రం నాలుగేళ్లు కొనసాగలేకపోయారు. 2018 ఆగస్టు నుంచి 2022 ఏప్రిల్ వరకు మాత్రమే పదవిలో కొనసాగారు. ఉక్రెయిన్ పై యుద్ధం మొదలైన తర్వాత రష్యాలో పర్యటించి, పరోక్షంగా ఆ దేశానికి మద్దతుగా నిలిచినందుకు ఆయన పదవిని కోల్పోయారు.
అదియాలా జైలు(Imran Khan) వద్ద జరిగిన ఈ ఘటన పాకిస్థాన్‌లో(Pakistan) రాజకీయ అస్థిరత మరింత తీవ్రమవుతోందని సూచిస్తుంది. ఇమ్రాన్ ఖాన్ అనుచరులు ప్రభుత్వం తమ నాయకుడిపై ప్రతీకార చర్యలు తీసుకుంటోందని ఆరోపిస్తుండగా, అధికార వర్గాలు మాత్రం భద్రత కారణంగానే సందర్శనలను పరిమితం చేస్తున్నామని వివరణ ఇస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణించినట్లు వచ్చిన వదంతులు ప్రజల్లో ఆందోళన పెంచాయి. ఈ నేపథ్యంలో సోదరీమణులపై దాడి జరగడం పీటీఐ కార్యకర్తలను మరింత ఆగ్రహానికి గురిచేసింది.
సోషల్ మీడియాలో ఇమ్రాన్ ఖాన్‌కు(Imran Khan) మద్దతుగా హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. పలు మానవ హక్కుల సంస్థలు కూడా ఈ దాడిని నిరసిస్తూ, పాకిస్థాన్‌లో మహిళలపై పోలీసుల అప్రామాణిక ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఇమ్రాన్ సోదరి చేసిన ఆరోపణలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయి. పీటీఐ వర్గాల ప్రకారం, ప్రభుత్వం తమ నాయకుడికి మద్దతు తగ్గించేందుకు ఉద్దేశపూర్వకంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత అదియాలా జైలు భద్రతను మరింత పెంచడం కూడా చర్చనీయాంశమైంది.


















