నటీనటులు: ధనుష్- నిత్య మీనన్- షాలిని పాండే- రాజ్ కిరణ్- సత్యరాజ్- అరుణ్ విజయ్- సముద్రఖని తదితరులు సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్ ఛాయాగ్రహణం: కిరణ్ కౌశిక్ నిర్మాతలు: ధనుష్- ఆకాష్ భాస్కరన్ రచన- దర్శకత్వం: ధనుష్ నటుడిగా తమిళ కథానాయకుడు ధనుష్ కు ఎంత గొప్ప పేరుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతను దర్శకుడిగానూ సత్తా చాటుకున్నాడు. పవర్ పాండి.. రాయన్.. జాబిలమ్మ నీకు అంత కోపమా లాంటి విజయవంతమైన చిత్రాలను అందించాడు. ఇప్పుడతను స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కొట్టు’ అనే సినిమాలో నటించాడు. దసరా కానుకగా ఈ రోజే తమిళ-తెలుగు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. దీని విశేషాలేంటో చూద్దాం పదండి. కథ: మురళి (ధనుష్) తన ఊరిలో ఉంటే భవిష్యత్ లేదని భావించి.. వారసత్వంగా వచ్చిన ఇడ్లీ కొట్టును చూసుకోవాలన్న తన తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా బ్యాంకాక్ కు వెళ్లి స్థిరపడతాడు. విష్ణువర్ధన్ (సత్యరాజ్) అనే పెద్ద వ్యాపారవేత్త కంపెనీలో ఉద్యోగిగా ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. మురళి వచ్చాక తన కంపెనీ లాభాలు 50 శాతం పెరగడం.. తన కూతురు మీరా (షాలిని పాండే) కూడా ఇష్టపడడంతో అతడిని అల్లుడిని చేసుకోవడానికి సిద్ధపడతాడు విష్ణు. మీరాతో తన పెళ్లికి అంతా సిద్ధమైన సమయంలో మురళి తండ్రి చనిపోవడంతో అతను సొంత గ్రామానికి రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక అతణ్ని తండ్రికి సంబంధించిన జ్ఞాపకాలు వెంటాడుతాయి. ఆ వెంటనే మరో విషాదాన్ని చూసి మురళి.. తిరిగి వెళ్లాలా వద్దా అన్న మీమాంసలో పడతాడు. మీరాతో తన పెళ్లి కూడా డోలాయమానంలో పడుతుంది. ఇంతకీ మురళిని వెనక్కి లాగిందేంటి? ఇక్కడే ఉండి అతనేం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? ఈ ప్రశ్నలన్నింటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి
కథనం-విశ్లేషణ: కొన్ని ఆదర్శాలు మాట్లాడుకోవడానికి బాగుంటాయి. కానీ వాస్తవంలో వాటిని అనుసరించడమే కష్టం. ఆర్థికంగా ఇబ్బందులున్నా సొంత ఊర్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నదాంతో సంతృప్తి ఉండడం ఒకవైపు.. ఉపాధి.. మెరుగైన జీవనం కోసం విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడడం ఇంకోవైపు. ఆదర్శంగా చెప్పుకోవడానికి మొదటిది బాగుంటుంది. కానీ రియాలిటీలో ఎక్కువమంది కోరుకునేది రెండోదే. కానీ ఈ రెండో వర్గం వాళ్లంతా పరమ దుర్మార్గులన్నట్లు.. మొదటి వర్గం ఉన్నతులన్నట్లు చూపించే సినిమాల ఒరవడి ఈ మధ్య బాగా పెరిగింది. కొంచెం సమతూకంతో ఇలాంటి కథలను చెబితే అవి ‘శతమానం భవతి’లా అందంగా.. హృద్యంగా రూపుదిద్దుకుని ప్రేక్షకులను మెప్పిస్తాయి. కానీ ధనుష్ చేసిన ‘ఇడ్లీ కొట్టు’ మాత్రం టూమచ్ మెలోడ్రామాతో ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేసి మిశ్రమానుభూతినే కలిగిస్తుంది. నటుడిగా ఎంతో వైవిధ్యమైన కథలు, పాత్రలను ట్రై చేసే ధనుష్.. దర్శకుడి కుర్చీలోకి వెళ్లినపుడల్లా రొటీన్ కథలనే ప్రయత్నిస్తున్నాడు. ఈసారి పల్లెటూరి నేపథ్యంలో మరీ పాతగా అనిపించే కథను ఎంచుకుని సీరియల్ తరహా నరేషన్ ట్రై చేశాడు. అక్కడక్కడా కొన్ని మంచి మూమెంట్స్ ఉన్నప్పటికీ.. చాలా వరకు రొటీన్ సన్నివేశాలు.. టూమచ్ మెలోడ్రామాతో ప్రేక్షకుల సహనానికి ‘ఇడ్లీ కొట్టు’ పరీక్షే పెడుతుంది. ‘ఇడ్లీ కొట్టు’లో తండ్రీ కొడుకుల బంధం నేపథ్యంలో ఎమోషన్ పండించడమే లక్ష్యంగా సినిమాను నడిపించడానికి ప్రయత్నించాడు ధనుష్. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లి అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడబోయిన కొడుకు.. తండ్రి మరణంతో సొంత గ్రామానికి వచ్చిన క్రమంలో అతడిలో అంతర్మథనం మొదలై ఆ తండ్రి కలను నెరవేర్చడం ఈ కథ. తాను కోరుకున్న విలాసవంతమైన జీవితంలోకి అడుగుపెట్టినప్పటికీ ఏదో అసంతృప్తి హీరోను వెంటాడడం.. సొంత ఊరికి వచ్చాక అతడిలో పరివర్తన కలగడం.. ఈ క్రమంలో అతను ఎంచుకున్న మార్గంలో సవాళ్లు ఎదురుకావడం.. దాన్ని అతను ఛేదించడం.. ఇలా ఒక రొటీన్ టెంప్లేట్లో సాగిపోయే సినిమా ఇది. కాకపోతే తండ్రి-కొడుకు మధ్య ఎమోషన్ ను ధనుష్ బలంగానే చూపించగలిగాడు. ఇడ్లీ కొట్టుకు సంబంధించిన సన్నివేశాలు హృద్యంగా ఉండి ప్రేక్షకుల మనసును తాకుతాయి. కానీ ఇక్కడి వరకు బాగానే అనిపించినా.. అంతకుమించి ఈ కథను ముందుకు నడిపించడంలో బలమైన కాన్ఫ్లిక్ట్ మిస్ అయింది. తన చెల్లికి కాబోయే వరుడు విలన్ కు అస్సలు నచ్చనపుడు.. అతను తిరిగి తమ దేశానికి రానందుకు విలన్ హ్యాపీగా ఫీలై తన పీడ విరగడైంది అనుకోవాలి. కానీ అతను మాత్రం హీరోను తన వెంట తీసుకెళ్దామని అతడి ఊరికి వచ్చి మరీ గొడవ పెట్టుకుంటాడు. దీంతో క్లాష్ మొదలై కథలో మలుపులు చోటు చేసుకుంటాయి. కానీ ఆ మలుపులేవీ ఆసక్తి రేకెత్తించేలా ఉండవు. ఊరికే కథను సాగదీస్తున్నట్లుగా అనిపిస్తుంది తప్ప.. తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి రేకెత్తించేలా సన్నివేశాలు సాగవు. క్లైమాక్సులో విలన్ చేసే పనేదో ముందే చేసేస్తే ఇంత సినిమా చూడాల్సిన అవసరం ఉండేది కాదు కదా అనే ఫీలింగ్ కలిగిందంటే.. అంతకుముందు వ్యవహారమంతా ఎంత సాగతీతగా అనిపిస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరీ సీరియల్ తరహాలో మెలోడ్రమటిగ్గా సాగే సన్నివేశాలు ద్వితీయార్ధాన్ని భారంగా మారుస్తాయి. హీరో విలన్ మధ్య రసవత్తర పోరాటం అంటూ ఏమీ లేకపోవడంతో సెకండాఫ్ పూర్తిగా ‘ఇడ్లీ కొట్టు’ను కిందికి లాగేసింది. ఈ కథతో ధనుష్ అసలేం చెప్పాలనుకున్నదే అర్థం కాదు. ఊరికి వచ్చి అతనేం సాధించాడు.. విలన్ లక్ష్యమేంటి అంటే పెద్దగా ఏమీ కనిపించదు. ప్రథమార్ధంలో ఉన్న ఎమోషన్ ద్వితీయార్ధంలో పూర్తిగా మిస్సయింది. నిడివి ఎక్కువైపోవడంతో ఇంకెప్పుడు సినిమా ముగుస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. కొన్ని నెలల ముందే పరోటాల నేపథ్యంలో ‘సార్ మేడమ’ పేరుతో విజయ్ సేతుపతి-నిత్యా మీనన్ కలిసి ఒక సీరియల్ తరహా సినిమా చేశారు. ‘ఇడ్లీ కొట్టు’ కూడా ఆ కోవలోనే చేరుతుంది.
నటీనటులు: ధనుష్ నటనకు వంకలు పెట్టేదేముంది? ఎప్పట్లాగే బాగా నటించాడు. మురళి పాత్రలో లవబుల్ గా కనిపించాడు. ఫారిన్లో ఉన్నప్పటి కంటే తన గ్రామానికి వచ్చాక పల్లెటూరి కుర్రాడిగా మారాక అతను బాగా ఇంపాక్ట్ చూపించాడు. తన లుక్.. నటన రెండూ బాగున్నాయి. కానీ మరీ డల్లుగా ఉండే క్యారెక్టర్ కావడం.. హీరోయిజం లేకపోవడం తన ఫ్యాన్సుని నిరాశకు గురి చేయొచ్చు. నిత్యా మీనన్ పల్లెటూరి అమ్మాయిగా జీవించేసింది. ఆమె చక్కగా తెలుగులో డబ్బింగ్ చెప్పి మెప్పించింది. ఐతే తన పాత్రను మరీ డీగ్లామరస్ గా తయారు చేశారు. రిచ్ గర్ల్ పాత్రలో షాలిని పాండే ఓకే అనిపించింది. హీరో తండ్రి పాత్రలో రాజ్ కిరణ్ తక్కువ సన్నివేశాల్లో కనిపించినా ఆ పాత్రకు నిండుదనం తెచ్చారు. తప్పులు చేసు కొడుకుని పిచ్చిగా ప్రేమించే తండ్రి పాత్రలో సత్యరాజ్ బాగా చేశాడు. ఇగోతో రగిలిపోయే క్యారెక్టర్లో అరుణ్ విజయ్ విలనిజాన్ని బాగా పండించాడు. మిగతా నటీనటులంతా ఓకే. సాంకేతిక వర్గం: సినిమా ఎలా ఉన్నా జి.వి.ప్రకాష్ కుమార్ తన పనికి వంద శాతం న్యాయం చేశాడు. అతడి పాటలు మెలోడియస్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి. నేపథ్య సంగీతం కూడా హృద్యంగా సాగింది. కిరణ్ కౌశిక్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. దర్శకుడిగా ధనుష్ ఇప్పటిదాకా తీసిన సినిమాలకు కొంత మిశ్రమ స్పందన వచ్చినా విజయం సాధించాయి. కానీ ‘ఇడ్లీ కొట్టు’లో మాత్రం సానుకూలతల కంటే ప్రతికూలతలే ఎక్కువ. మరీ సాధారణమైన కథను ఎంచుకున్న రొటీన్ స్టయిల్లో నడిపించాడు ధనుష్. సినిమాలో ఎక్కడా షాక్ ఫ్యాక్టర్ అన్నది లేదు. తన నరేషన్ ఓల్డ్ స్టయిల్లో సాగింది. తండ్రీ కొడుకుల ఎమోషన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మినహా ‘ఇడ్లీ కొట్టు’లో చెప్పుకోదగ్గ విశేషాలు కనిపించవు. ధనుష్ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ‘ఇడ్లీ కొట్టు’ కచ్చితంగా అత్యంత దిగువన ఉంటుందనడంలో సందేహం లేదు.
రేటింగ్ – 2. 5/5