సంచలనంగా మారిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుకు సంబంధించి కొత్త వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు భార్యతో ఆయనకున్న విభేదాల నేపథ్యంలో కూకట్ పల్లిలోని తన ఇంటికి వచ్చిన విషయాన్ని తెలుసుకున్న ఆమె.. పోలీసులకు సమాచారం ఇవ్వటంతోనే పోలీసులు ఆమెను అరెస్టు చేసినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. అయితే.. ఇందుకు భిన్నమైన వాదనను పోలీసు వర్గాల నుంచి వస్తోంది. స్నేహితుడికి పెట్టిన ఒక మెసేజ్ ఐబొమ్మ రవిని పోలీసులకు పట్టించినట్లుగా చెబుతున్నారు.
దీనికి ముందు.. టెక్నికల్ గా ఐబొమ్మ రవి చేసిన ఒక తప్పు అతడ్ని పట్టించిందన్న వాదన వినిపిస్తోంది. పోలీసు వర్గాల నుంచి అనధికారికంగా వస్తున్న వివరాలు రవి అరెస్టుపై కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఐబొమ్మ రవిని పట్టుకునేందుకు సైబర్ పోలీసులు రంగంలోకి దిగి.. అతడి ఆచూకీని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. అతడి ఈ మొయిల్ కు వచ్చిన ఒక లింక్ తోనే ఐబొమ్మ రవి ఆచూకీ దొరికినట్లుగా తెలుస్తోంది.
ఐ బొమ్మ రవి ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో డొమైన్ కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా లభించిన ఫోన్ నంబరు ఆధారంగా రవి ఎవరెవరితో మాట్లాడుతున్నాడో విశ్లేషించారు. ఎక్కువ సమయం విదేశాల్లో గడిపే అతను.. అరుదుగా కూకట్ పల్లికి వస్తుంటాడు. ఇక్కడో స్నేహితుడు ఉండటం.. అతడితో మద్యం తాగే అలవాటున్నరవి.. హైదరాబాద్ కు వచ్చిన ప్రతిసారీ అతడ్ని కలుస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలో ఈ మొయిల్ లింకు ద్వారా సదరు స్నేహితుడ్ని పోలీసులు ట్రాక్ చేశారు. అతడి ఫోన్ నెంబరును సంపాదించిన పోలీసులు.. రవి(ibomma ravi) ఎప్పుడు హైదరాబాద్(Hyderabad) కు వచ్చినా తమకు సమాచారం ఇచ్చేలా ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ నుంచి రాగానే ఎప్పటిలానే తన స్నేహితుడికి ‘మామా హైదరాబాద్ వచ్చా’ అని మెసేజ పెట్టటం.. దీన్ని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు రవిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. పోలీసులకు ఐబొమ్మ రవిని అతడి నుంచి విడిపోయిన భార్యే పట్టించిందన్న వాదనకు భిన్నంగా ఈ వాదన ఉండటం గమనార్హం.













