ఐ బొమ్మ, బప్పం టీవీ వెబ్ సైట్ల నిర్వాహకుడు ఇమంది రవి అరెస్టుపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్ జరుగుతోంది. పోలీసులకు సవాల్ విసిరిన రవిని అరెస్టు చేయడాన్ని అభినందిస్తూనే.. పలు ప్రశ్నలు సంధిస్తూ ఇన్ స్టా, ఫేస్ బక్ తోపాటు పలు సోషల్ మీడియాల్లో ప్రత్యేకంగా వీడియోలు చేస్తున్నారు. సినీ పెద్దలకు కష్టం వస్తే ఆఘమేఘాలపై స్పందించి ఐ బొమ్మ రవిని అరెస్టు చేశారని, కానీ బెట్టింగ్ యాప్స్ ద్వారా సామాన్యులను దోచుకున్న దొంగలను అరెస్టు చేయడంపై ఎందుకంత స్పీడ్ చూపడం లేదని నిలదీస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫొటోలను కూడా పెట్టి కొందరు వీడియో రూపంలో తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. అయితే ఇక్కడ పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని గుర్తించాలి. ఎందుకంటే ఐబొమ్మ రవి కోసం చాలా రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. అతడి రాకపోకలపై నిఘా వేశారు. రవి అరెస్టు కన్నా ముందే సినిమాలను పైరసీ చేస్తున్న బిహార్ గ్యాంగ్ ను కూడా అరెస్టు చేశారు. కానీ, రవి అరెస్టు చేసిన తర్వాతే ఈ అంశంపై ఎక్కువగా చర్చ జరగడంతో పోలీసులు ఆఘమేఘాలపై స్పందించారన్న టాపిక్ తెరపైకి వచ్చినట్లు విశ్లేషిస్తున్నారు.
కాగా, ఐబొమ్మ రవి అరెస్టుపై సోషల్ మీడియా స్పందనను ఎలా అర్థం చేసుకోవాలన్న అంశంపై తర్జనభర్జన సాగుతోంది. సినిమా టికెట్ల ధరలు పెంచేసి సామాన్యులకు వినోదాన్ని దూరం చేసినందునే ఐబొమ్మలో తాము సినిమాలు చూడాల్సివచ్చిందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఐబొమ్మ రవి చేసిన పనిపై వారిలో సానుభూతి వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో డేటా చోరీ చేయడంతోపాటు సినీ పరిశ్రమకు నష్టం చేయడం ఆయన చేసిన తప్పుగా వ్యాఖ్యానిస్తున్నారు. సినిమా టికెట్ల ధరలు విపరీతంగా పెంచేసిన నిర్మాతలు ఏమైనా సమాజ సేవ చేస్తున్నారా? అంటూ కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
మరోవైపు ఐ బొమ్మ రవి అరెస్టుతో హైదరాబాద్ పోలీసుల టాలెంట్ ప్రపంచానికి తెలిసిందని కొందరు అభినందిస్తున్నారు. ఇదే సమయంలో సినీ పెద్దల జేబులకు చిల్లు పెట్టాడని రవిని అరెస్టు చేశారు.. మరి బెట్టింగు యాప్స్ తో సామాన్యులను దోచుకున్న వారి సగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సామాన్యులను మోసం చేసిన వారిని అలా వదిలేస్తారా? అంటూ నిలదీస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ పై తొలి నుంచి పోరాటం చేస్తున్న హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఫొటోలను ప్రదర్శిస్తూ.. పరోక్షంగా ఆయనపై ఒత్తిడి పెంచేలా ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఐ బొమ్మ రవి అరెస్టు తర్వాత సినిమా టికెట్లపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. ధరలు ఎక్కువగా ఉండటం వల్లే ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోతోందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైనా సినిమాను చూడాలంటే రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు ఖర్చు చేయాల్సివస్తున్నందున ఐబొమ్మ వంటి ప్లాట్ ఫాంల్లో సినిమాలను చూస్తున్నామని ఎక్కువ మంది వాపోతున్నారు. ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా ఐ బొమ్మలో సినిమాలను చూడటాన్ని ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, అతడు డేటా చోరీని చేసి ఎక్కువ ప్రమాదం చేస్తున్నాడనే విషయాన్ని సామాన్యులు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.
మొత్తానికి ఐబొమ్మ రవి చేసింది తప్పే అంటున్న ప్రేక్షకులు.. సినీ పరిశ్రమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన చర్చతో హోరెత్తిస్తున్నారు. ఇక బస్ స్టాపుల్లోను.. టీ షాపుల్లోను ఏ ఇద్దరు కలిసినా రవి అరెస్టు ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులకు కామెంట్లు చూసినా ఉచితంగా సినిమా చూపినందుకు రవిని అభినందిస్తూ రాస్తున్నారు. అదే సమయంలో ఆయన వెళ్లిన విధానం ఎంచుకున్న మార్గం కరెక్టు కాదని అభిప్రాయపడుతున్నారు. చివరికి టికెట్ల ధరలు తగ్గించాలన్న అంశంపై అంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.
అయితే ఐబొమ్మ రవి అరెస్టుపై సోషల్ మీడియా నుంచి ఇటువంటి స్పందన రావడం విస్మయానికి గురిచేస్తోంది. సైబర్ మోసగాళ్లకు రవికి ఎటువంటి తేడా లేదు. పైరసీ సినిమాలను అప్ లోడ్ చేసిన రవి.. అదేసమయంలో డేటా చోరీతో ప్రజలకు నష్టం చేసిన విషయంపై ప్రచారం లేకపోవడం, డేటా చోరీ వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే అంశంపై ఎవరికీ అవగాహన లేకపోవడం వల్లే ఐబొమ్మ రవికి మద్దతు ఇస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో సినీ పెద్దలు, ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ ఎపిసోడ్ ద్వారా అర్థమవుతోందని అంటున్నారు. సినిమా టికెట్లను మరీ ఎక్కువగా పెంచకుండా, సామాన్యులకు భారం కాని విధంగా ధరలు ఉంటే ఇలాంటి వెబ్ సైట్లకు ఆదరణకు అవకాశం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇమండి రవిది విశాఖపట్నం, వయసు 39 ఏళ్లు అని పోలీసులు చెబుతున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ చదివి, కొన్ని కోర్సులు చేశారు.రవి అరెస్టు తర్వాత ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన వివిధ పేర్లతో తిరుగుతున్నారని పోలీసులు గుర్తించారు.ఆయన నుంచి కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వంటివి స్వాధీనం చేసుకున్నారు.ప్రహ్లాద్ కుమార్ వెల్లెల సన్నాఫ్ నర్సింహ వెల్లెల పేరుతో మహారాష్ట్ర నుంచి వీటిని తీసుకున్నట్టుగా ఉందని సజ్జనార్ చెప్పారు.అలాగే, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్టు విభాగం నుంచి డ్రైవింగ్ లైసెన్సు తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు.రవిని నవంబరు 15న అరెస్టు చేసినట్లు మీడియాకు చెప్పారు సజ్జనార్.రవి వద్ద కరీబియన్ దీవులకు చెందిన సెయింట్స్ కీట్స్ అండ్ నెవిస్ దేశం సిటిజన్‌షిప్ ఉన్నట్లు విచారణ సమయంలో పోలీసులు గుర్తించారు.
గతంలోనే భారత్ పౌరసత్వం వదలుకున్న రవి, ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉంటున్నారు.ఇప్పటివరకు ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్ల నిర్వహణ ద్వారా రవి రూ.20 కోట్లు సంపాదించినట్టు చెబుతున్నారు పోలీసులు. వీటిలో రూ.3కోట్లు సీజ్ చేశామని సజ్జనార్ చెప్పారు.అయితే, భారత్‌కు ఇప్పుడే వచ్చారా? లేదా కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నారా?, ఈ మధ్యనే వస్తే ఎందుకు వచ్చారు? అనే ప్రశ్నలకు పోలీసులు స్పష్టత ఇవ్వలేదు.ఇమండి రవి కేసులో అంతర్జాతీయ వ్యవహారాలు ఉన్నందున మరింత విచారణ కోసం సీబీఐ, ఈడీకు లేఖలు రాస్తామన్నారు.
“ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఆయన్ను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోర్టును అడుగుతాం. ఆ తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి” అని సజ్జనార్ చెప్పారు.ఇమండి రవి గురించి ఆయన తండ్రి అప్పారావు విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు.”నాకు, నా కుమారుడు రవికి మాటల్లేవు. తప్పుడు మార్గంలో వెళ్లాడని దూరం పెట్టాను. 15 ఏళ్ల కిందటే ఆయన హైదరాబాద్ వెళ్లిపోయాడు” అని చెప్పారు.రవిని పోలీసులు మీడియా ముందు హాజరుపరచలేదు. జ్యుడీషియల్ రిమాండులో ఉండటంతో రవి వివరణ ఇవ్వలేకపోతున్నాం.
ఐబొమ్మ వెబ్‌సైట్ ఒక యూఆర్ఎల్‌ను బ్లాక్ చేస్తే, మిర్రర్ వెబ్‌సైట్ తయారు చేసి తీసుకువస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.అలా ఇప్పటివరకు 65 మిర్రర్ వెబ్‌సైట్లు తీసుకువచ్చినట్టు గుర్తించామని సజ్జనార్ చెప్పారు. అలాగే మొత్తంగా 110 డొమైన్లు ఉన్నాయని తెలిపారు.”రవి అనే వ్యక్తి బాగా తెలివైనవారు. మాస్టర్ మైండ్. ఆయన వల్ల సినిమా ఇండస్ట్రీకి చాలా నష్టం కలిగింది” అని చెప్పారు.రవిని పూర్తిగా సాంకేతిక ఆధారాల ఆధారంగా అరెస్టు చేసినట్టు చెప్పారు పోలీసులు. ఆయన కదలికలపై మీడియాలో వస్తున్న కథనాలేవీ నమ్మొద్దన్నారు.కేసు విచారణ మొదలుపెట్టినప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై స్పష్టత కూడా లేదని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ డీసీపీ దారా కవిత వివరించారు.
”రవిని అరెస్టు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. వెబ్ సర్వర్ల నిర్వాహకులతో సమావేశమయ్యాం. చాలామంది నుంచి సహకారం లభించలేదు. అయినప్పటికీ ఆయన కదలికలకు సంబంధించి టెక్నికల్ సమాచారం సేకరించి అరెస్టు చేశాం” అని చెప్పారు.పోలీసుల ప్రాథమిక విచారణలో రవి ఒక్కరే భారత్ నుంచి ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లు నిర్వహిస్తున్నట్టు తేలింది.ఆయా సైట్లకు అడ్మిన్లు చాలా మంది ఉన్నారని పోలీసులు గుర్తించారు. వారు వేర్వేరు దేశాల్లో ఉండి ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పారు దారా కవిత.”విచారణ మరింత ముందుకు సాగితే వివరాలు బయటకు వస్తాయి. రవికి ఎంత మంది సహకరిస్తున్నారు? భారత్‌లో ఇంకా ఎవరైనా అడ్మిన్లు ఉన్నారా? ఇవన్నీ తెలియాల్సి ఉంది” అని చెప్పారామె.
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి సమీపంలోని రెయిన్ బో విస్టాస్‌లోని ఇంటి నుంచి రవిని అరెస్టు చేశారు. ఆ సందర్భంలో అక్కడ హార్డ్ డిస్కులు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు మాత్రమే దొరికినట్టుగా చెబుతున్నారు.ఐ బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ప్రధాన సర్వర్లు నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా వంటి దేశాల నుంచి ఆపరేట్ అవుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.రవికి ఎవరెవరు సహకరించారనే విషయంలోనూ లోతుగా విచారణ చేస్తామని వివరించారు పోలీసులు.


















