కొత్త సినిమాలు.. ఓటీటీల్లోని కంటెంట్ ను పైరసీ చేస్తూ.. పైరేటెట్ కంటెంట్ చూసే ప్రతి ఒక్కరికి సుపరిచితం ఐబొమ్మ వెబ్ సైట్. దీని నిర్వాహకుడు ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవి. ఆయనకు చెందిన బప్పం.. ఐ విన్.. బప్పం టీవీ పేర్లతో వెబ్ సైట్ లను రూపొందించి.. ఏడెనిమిదేళ్లుగా పైరసీ సినిమాల్ని.. వెబ్ సీరిస్ లను తన వెబ్ సైట్ లో స్ట్రీమ్ అయ్యేలా చేసే 40 ఏళ్ల ఇమ్మడి రవిపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. చివరకు తెలుగు చిత్ర పరిశ్రమ సైతం అతడిపై కంప్లైంట్ చేసిన పరిస్థితి.
తాజాగా అతను కూకట్ పల్లిలో ఉండగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. నిందితుడ్ని బషీర్ బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు తరలించి విచారించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చి.. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు పంపారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నాడు.
ఏపీలోని విశాఖకు చెందిన ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడే కాదు.. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ అయినా.. ఎంతటి సెక్యూరిటీ ఉన్నా హ్యాక్ చేయటంలో దిట్ట అని చెబుతున్నారు. ఇంతటి మేధావి.. తప్పు దారి పట్టాడు. పైరసీ వైపునకు మళ్లిన అతను కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్.. ఓటీటీ వేదికల సర్వర్లను ఇట్టే హ్యాక్ చేసి హెచ్ డీ క్వాలిటీతో సినిమాలు.. వెబ్ సిరీస్ లను డౌన్ లోడ్ చేసేవాడు. కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేసి తన వెబ్ సైట్ల ద్వారా ఉచితంగా చూసే వీలు కల్పించాడు. దీంతో.. అతి తక్కు వ సమయంలో అతని వెబ్ సైట్ పాపులర్ అయ్యింది.
తెలుగు సినిమాలు.. వెబ్ సిరీస్ లతో పాటు కన్నడ.. తమిళం.. హిందీ.. మలయాళం తదితర భాషలకు చెంిన తెలుగు డబ్బింగ్ తో విడుదలైన వాటిని తన ఐబొమ్మ.. బప్పంలో ఉంచాడు. తానెవరో తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్న అతను.. ఈ మధ్యన అతడు రాసినట్లు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో హెచ్చరిక టోన్ లో ఉన్న సందేశాన్ని ఉంచాడు. తన వద్ద కోట్ల మంది డేటా ఉందని.. తన వెబ్ సైట్ మీద ఫోకస్ చేయటం అపాలన్న అతడి తీరు సంచలనంగా మారింది.
ఇదే సమయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్ లోడ్ చేసుకున్న సినిమాలను పైరసీ ముఠాలకు అమ్ముతున్న ఐదుగురు నిందితుల్ని సెప్టెంబరు 29న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఐబొమ్మ నిర్వాహకుడి కోసం వేట షురూ చేశారు.
ఇదిలా ఉండగా తనకున్న సాంకేతిక నైపుణ్యంతో తాను ఎక్కడ ఉన్న విషయాన్ని పోలీసులకు తెలీకుండా జాగ్రత్తలు తీసుకున్న రవి..తనను పోలీసులు పట్టుకోలేరన్న అతి విశ్వాసాన్ని ప్రదర్శించాడు. విదేశాల్లో ఉన్న అతడ్ని ట్రాక్ చేసిన పోలీసులు.. తాను ఉన్న ప్రదేశానికి భిన్నంగా వేర్వేరు దేశాల్లో ఉన్నట్లుగా ఏమారుస్తుండే విషయాన్ని గుర్తించారు. తాను పోలీసుల్ని తప్పు దారి పట్టించటంలో సక్సెస్ అవుతున్నట్లుగా భావించిన అతను తాజాగా హైదరాబాద్ కు వచ్చాడు. అయితే.. అతడి కదలికల్ని నిశితంగా గమనిస్తున్న పోలీసులు అతడ్ని కూకట్ పల్లిలోని నివాసంలో అరెస్టు చేశారు. దీంతో.. ఐబొమ్మ నిర్వాహకుడికి హైదరాబాద్ నగర పోలీసులు రియల్ బొమ్మను చూపించారని చెప్పాలి.
పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు, ఆపరేటర్ అయిన ఇమ్మది రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఫ్రాన్స్ నుండి హైదరాబాద్‌కు వచ్చిన అతడిని కూకట్‌పల్లిలో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడు నిర్వహిస్తున్న ఐ బొమ్మ, బప్పమ్ వెబ్ సైట్లను పూర్తిగా బ్లాక్ చేసారు. ఇక వీటిలో 1ఎక్స్ బెట్టింగ్ అనే యాప్ ను ప్రమోట్ చేసి భారీగా నిధులు సమకూర్చుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. తనను పోలీసులు గుర్తించలేరనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో అతడు కూకట్ పల్లికి వచ్చి దొరికిపోయాడని కూడా వారు విశ్లేషిస్తున్నారు. అతడు ఐబొమ్మ వెబ్ సైట్ ని కరేబియన్ నుంచి ఆపరేట్ చేసాడని చెబుతున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఎప్పటికప్పుడు పైరేటెడ్ తెలుగు సినిమాలు, ఓటీటీ కంటెంట్ ని అప్లోడ్ చేసి, పంపిణీని అతడు పర్యవేక్షించేవాడు. అలాగే సర్వర్లను సులువుగా హ్యాక్ చేసే టెక్నిక్ లోను అతడు నైపుణ్యం సంపాదించాడు. అయితే తెలుగు చిత్రసీమకు కోట్లాది రూపాయల ఆర్థిక నష్టానికి కారకుడైన ఐబొమ్మ నిర్వాహకుడిపై ఇప్పటికే తెలుగు సినిమా యాంటీ పైరసీ సెల్ సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత పోలీసులు అతడి కోసం వేట ప్రారంభించారు. పోలీసులు గతంలో వెబ్‌సైట్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తు మరింత వేగవంతమైంది. దీని ఫలితంగా రవి విదేశాలలో ఉంటున్నాడని అతడి కదలికలపై నిఘా పెట్టారు.
ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడంలో పాల్గొన్న అతని నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యుల కోసం కూడా అధికారులు వెతుకుతున్నారు. డిజిటల్ ఫోరెన్సిక్స్ విశ్లేషణ సహా అతడికి డబ్బు ఎక్కడెక్కడి నుంచి ముడుతోందో పోలీసులు పరిశీలిస్తున్నారు.
సెప్టెంబర్‌లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ, బప్పం సహా 65 మిర్రర్ వెబ్‌సైట్‌లను చట్టవిరుద్ధంగా కంటెంట్‌ను అప్‌లోడ్ చేసి పంపిణీ చేసినందుకు కేసు నమోదు చేశారు. పైరసీ సమస్యపై తెలుగు సినీపరిశ్రమ పెద్దలతో పోలీసులు సమావేశం నిర్వహించి చర్చించారు. తమిళ్ ఎంవి, తమిళ్ బ్లాస్టర్స్, మోవియర్ల్జ్ వంటి పైరేటెడ్ పోర్టల్స్‌ను అధికారులు గుర్తించారు. సైబర్ క్రైమ్ నెట్‌వర్క్ థియేటర్‌లో సినిమాలను రికార్డ్ చేసి, రికార్డింగ్‌లను ఆన్‌లైన్‌లో లీక్ చేసిందని వారు చెప్పారు.
ఐబొమ్మ రవి ప్రస్తుతం భార్యతో విడాకుల కేసులో హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరవుతున్నాడు. అదే క్రమంలో తదుపరి విచారణ కోసం అతడు కూకట్ పల్లిలోని ఒక అపార్ట్ మెంట్ కి వచ్చాడని అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. రవి సమాచారం అతడి వైరి వర్గాల నుంచి పోలీసులకు లీకైందని కూడా ఒక గుసగుస వినిపిస్తోంది. దమ్ముంటే పట్టుకోండి! అని సవాల్ విసిరిన రవి ఇప్పుడు దొరికిపోయాడు. పోలీసు కస్టడీలో విచారణను ఎదుర్కొంటున్నాడని కథనాలొస్తున్నాయి.
ఆన్‌లైన్ బెట్టింగ్ – గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో ప్రకటనల ఒప్పందాల ద్వారా రవి కోట్లు సంపాదించాడని దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కళ్లు గప్పేందుకే అతడు కరేబియన్ ద్వీపం నుండి పనిచేస్తున్నాడని వారు అనుమానిస్తున్నారు. విదేశాల నుండి కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ అతడు హైదరాబాద్‌లో పెద్ద నెట్ వర్క్ ని ఏర్పాటు చేసుకున్నాడని కడా పోలీసులు అనుమానిస్తున్నారు.
రవిని శనివారం నాంపల్లి కోర్టు ముందు హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. అతడి నుంచి చాలా డాక్యుమెంట్లు, మరియు హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారని, అతడి బ్యాంక్ అకౌంట్లలోని 3 కోట్లు సీజ్ చేసారని కూడా తెలుస్తోంది. అతడు పైరసీని విదేశాల నుంచి నడిపిస్తున్నాడు గనుక విచారణలో భాగంగా అక్కడ స్థానిక ఏజెన్సీల సాయం తీసుకుంటారని కూడా తెలుస్తోంది.
పైరసీ వ్యాపారంలో రవి ఒంటరిగానే ఉన్నాడా లేదా డజన్ల కొద్దీ మిర్రర్ సైట్‌లను నడిపే విస్తృత నెట్‌వర్క్‌లో భాగంగా కొనసాగుతున్నాడా? అనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ పైరసీ వల్ల 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు దాదాపు రూ. 3,700 కోట్ల నష్టం వాటిల్లిందని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంచనా వేసింది. కేవలం ఐబొమ్మ వంటి వెబ్ సైట్ల కారణంగా అతి పెద్ద నష్టం వాటిల్లుతోందని ఇప్పటికే ఆందోళనను వ్యక్తం చేస్తోంది.


















