కాలం కలిసి రావటం అంటే ఇదేనేమో. ప్రతికూల పరిస్థితుల్లో అధికార పగ్గాలు చేపట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు అన్ని మంచి శకునములే అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అరకొర మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయనకు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. మంత్రులు ఉత్తమ్.. పొంగులేటి మొదలుకొని చాలామంది నుంచి తిప్పలే ఎదుర్కొన్న పరిస్థితి. అయినప్పటికి కాస్తంత తగ్గి మరీ పాలన మీద ఫోకస్ చేసిన రేవంత్ కు.. గులాబీ బాస్ తీరుతో మరింత వెసులుబాటు లభించిందని చెప్పాలి.
ఎన్నికల వేళ తనను తిరస్కరించిన తెలంగాణ ప్రజల మీద కోపంతో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం కావటమే కాదు.. ఏది ఏమైనా.. ఎవరెన్ని అన్నా పట్టకుండా అక్కడే ఉండిపోవటం.. ప్రజాక్షేత్రంలోకి రాకపోవటం లాంటివి సీఎం రేవంత్ కు ప్లస్ అయ్యాయి. తనకు తానుగా ఎన్నిసార్లు అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి కోరినా కేసీఆర్ వచ్చింది లేదు. అదే సమయంలో కేసులు.. ప్రతీకార రాజకీయాలకు వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న రేవంత్ కు గులాబీ గూట్లో కుటుంబ కలహాలు అనుకోని వరంగా మారాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. అంతకంతకూ తెలంగాణలో బలపడుతున్న బీజేపీ నుంచి రేవంత్ కు తిప్పలు తప్పవన్న మాట బలంగా వినిపించేది. అందుకు తగ్గట్లే.. కేంద్రం నుంచి సహాయ నిరాకరణ కూడా ఉంటుందని ఆశించారు. అయితే.. కేంద్రం మీదా.. ప్రధానమంత్రి మీదా రాజకీయంగా మాటల దాడి చేసే ముఖ్యమంత్రి రేవంత్.. అదే సమయంలో పాలనాపరంగా కేంద్ర సహకారం రాష్ట్రానికి అవసరమంటూ అదే పనిగా దేశ రాజధానికి వెళ్లి రాష్ట్ర పనులను స్వయంగా కేంద్రానికి తీసుకెళుతున్న పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. వినాయక నిమజ్జనాల వేళ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కేంద్ర హోం మంత్రి నిమజ్జన ఉత్సవాలకు హాజరు కానున్నట్లుగా ప్రకటనలు వచ్చాయి. దీంతో.. రేవంత్ సర్కారుకు తిప్పలు తప్పవన్న మాట బలంగా వినిపించింది. కేంద్ర హోం మంత్రే స్వయంగా నిమజ్జన వేళ హైదరాబాద్ కు వస్తే.. ఆయన ఊరికే ఉండరు కదా? రేవంత్ ప్రభుత్వం మీద ఘాటు వ్యాఖ్యలు ఖాయంగా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే.. దానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగే మాటల యుద్దం చివరకు ఎక్కడివరకైనా వెళ్లొచ్చు. అదే జరిగితే.. ఇప్పుడు వెళ్లినంత తరచూ ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాయాన్ని అడిగే పరిస్థితి రేవంత్ కు ఉండేది కాదు. మరి.. ఇలాంటి వేళ అనూహ్య రీతిలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయినట్లుగా ప్రకటన విడుదలైంది. గణేష్ నిమజ్జన వేళ అమిత్ షా నోటి నుంచి విమర్శల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న వారికి నిరాశ కలిగించే పరిస్థితి. ఉపరాష్ట్రపతి.. ఎంపీలతో సమావేశాల కారణంగా అమిత్ షా తన పర్యటనను రద్దు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. షా టూర్ రద్దు సీఎం రేవంత్ కు బిగ్ రిలీఫ్ గా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.