భవిష్యత్తు తరాల కోసం చేపడుతున్న మూసీ నది పునరుజ్జీవం ప్రాజెక్టు విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వమని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ముఖ్యంగా పేదలకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.
మూసీ పునరుజ్జీవం ఫేజ్–1 పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన #MusiInvites సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా మూసీ నది చరిత్ర, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రజాప్రతినిధులు, నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు అందరూ తమ సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు.
ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, అధికారులు, నిపుణులు మరియు వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.
సీఎం మాట్లాడుతూ మూసీ నది వెంట ప్రస్తుతం దాదాపు 10 వేల పేద కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పారు. వారి వివరాలను ఇప్పటికే ప్రభుత్వం సేకరించిందని తెలిపారు. ఈ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిద్ధం చేసి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అయితే దూర ప్రాంతాలకు వెళ్లడం వల్ల చిన్న చిన్న పనులు చేసుకునే వారు ఉపాధి కోల్పోతారనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని సీఎం చెప్పారు. అందుకే వారికి సమీప ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఎవరికీ నష్టం జరగకుండా మానవీయ కోణంతోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు వెనుక ప్రభుత్వ లక్ష్యం నగర అభివృద్ధి మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా ముఖ్య ఉద్దేశమని సీఎం తెలిపారు. ప్రపంచంలోని అనేక నగరాలు నదులను అభివృద్ధి చేసి గొప్ప ఆర్థిక కేంద్రాలుగా మారాయని ఆయన గుర్తు చేశారు. థేమ్స్, హడ్సన్ నదులు, సింగపూర్, సియోల్, దుబాయ్, అహ్మదాబాద్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ వంటి ప్రాజెక్టులను అధ్యయనం చేసిన తర్వాతే మూసీ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు.
1908లో మూసీ నదికి భారీ వరదలు రావడంతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన చరిత్రను సీఎం గుర్తు చేశారు. ఆ సమయంలో నిజాం ప్రభుత్వం వరద నియంత్రణ కోసం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించిందని పేర్కొన్నారు. ఆ కాలంలో తీసుకున్న దూరదృష్టి నిర్ణయాల వల్లే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని తెలిపారు.
ప్రస్తుతం కూడా అదే దూరదృష్టితో భవిష్యత్తు తరాల కోసం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. నగర జనాభా ప్రస్తుతం సుమారు 1.34 కోట్లుగా ఉండగా, మరో 25 సంవత్సరాల్లో అది 2.5 కోట్లకు చేరే అవకాశం ఉందని చెప్పారు. అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, పర్యావరణ పరిరక్షణ చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు.
మూసీ నది కాలుష్యం ప్రస్తుతం తీవ్రమైన సమస్యగా మారిందని సీఎం అన్నారు. నగరంలోని వ్యర్థాలు, పారిశ్రామిక కాలుష్యం కారణంగా మూసీ నది తీవ్రంగా కలుషితమైందని తెలిపారు. ఈ కాలుష్యం వల్ల నల్గొండ జిల్లాలోని ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు.
ఈ పరిస్థితిని మార్చేందుకు మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కీలకమని సీఎం తెలిపారు. నదిని శుభ్రపరచడం, నది తీరాలను అభివృద్ధి చేయడం, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వంటి అనేక అంశాలు ఈ ప్రాజెక్టులో భాగమని చెప్పారు.
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ద్వారా నగరంలో నైట్ ఎకానమీ పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడతాయని తెలిపారు. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలకు ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకువస్తుందని చెప్పారు.
ప్రాజెక్టు ఖర్చుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సీఎం ఖండించారు. గాంధీ విగ్రహం కోసం 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారనే ప్రచారం పూర్తిగా అసత్యమని తెలిపారు. గాంధీ విగ్రహ నిర్మాణానికి సుమారు 75 కోట్ల రూపాయలకే పరిమితం అవుతుందని చెప్పారు. మొత్తం మూసీ ప్రాజెక్టు ఖర్చు సుమారు 6500 నుంచి 7000 కోట్ల మధ్య ఉండవచ్చని తెలిపారు.
మూసీ ప్రాజెక్టుపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ప్రచారం చేయకూడదని, సహకరించకపోయినా కనీసం అడ్డంకులు సృష్టించవద్దని కోరారు.
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై శాసనసభలో కూడా చర్చ నిర్వహిస్తామని సీఎం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పాలని ఆయన కోరారు. ప్రజల సూచనలు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్టు కోట్లాది మంది హైదరాబాద్ ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉందని సీఎం పేర్కొన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దగలమని ఆయన అన్నారు.
ప్రపంచంతో పోటీపడే విధంగా హైదరాబాద్‌ను ఒక అద్భుతమైన నగరంగా అభివృద్ధి చేయడం మన అందరి బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంతో అన్నారు.














