మార్కెట్ దగ్గర చిన్న స్కూటర్ పార్కింగ్ వివాదం.. ఆఖరికి హీరోయిన్ తమ్ముడి హత్యకు దారితీసింది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న హుమా ఖురేషీ కజిన్ బ్రదర్ ఇప్పుడు హత్యకు గురయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జంగ్పురా భోగల్ మార్కెట్ లేన్ లో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి 11 గంటల సమయం లో గేట్ వద్ద ఒక వ్యక్తి స్కూటర్ పార్క్ చేసి ఉంచారు. దానిని తొలగించమని హుమా ఖురేషి బంధువైన ఆసిఫ్ ఖురేషీ కోరారు. దీంతో ఈ విషయంలో కొందరు వ్యక్తులు ఆసిఫ్ ఖురేషీతో వాగ్వాదానికి దిగారు. దీంతో మాటా మాటా పెరగడంతో వారు పదునైన ఆయుధాలతో ఆసిఫ్ ఖురేషీ పై దాడి చేశారు.
దాడిలో ఆసిఫ్ ఖురేషీకి తీవ్రంగా గాయాలవడంతో చుట్టుపక్కల వారు వెంటనే అప్రమత్తమయ్యి ఆసిఫ్ ఖురేషీను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఈ ఘటనతో ఆసిఫ్ ఖురేషీ భార్య కన్నీటి పర్యంతమవుతోంది. చిన్న పార్కింగ్ విషయం కారణంగా తన భర్తను దారుణంగా హత్య చేశారు అని ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. ఆమె మాట్లాడుతూ.. ఆసిఫ్ పొరుగువారి స్కూటీని తీసివేయాలని కోరారు. కానీ వారు మాత్రం గొడవకు దిగారు.. ఇంత చిన్న విషయానికి హత్య చేయాల్సిన అవసరం ఏముంది?” అంటూ ఆమె మండిపడ్డారు. ఇకపోతే ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అందులో గౌతం, ఉజ్వల్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. ఇక హీరోయిన్ హుమా ఖురేషికి ఆసిఫ్ ఖురేషి కజిన్ బ్రదర్ కావడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది.
హుమా ఖురేషీ కెరియర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సౌత్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘కాలా’ అనే సినిమా ద్వారా తమిళ్ ప్రేక్షకులను పలకరించింది. ప్రముఖ డైరెక్టర్ పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ధనుష్ నిర్మించారు.. బాక్స్ ఆఫీస్ వద్ద సుమారుగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తువులు చేసి, రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత అజిత్ హీరోగా వచ్చిన ‘వలిమై’ అనే సినిమాలో కూడా హుమా ఖురేషి నటించింది. రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.240 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి మరో రికార్డు అందుకుంది. అలా రెండు చిత్రాలతో తమిళ్ హీరోలకు లక్కీ లేడీగా మారింది ఈ ముద్దుగుమ్మ.
ఇక హుమా ఖురేషి ‘ గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ ‘ అనే చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత పలు భాష సినిమాలలో అవకాశాలు అందుకుంది.. అలా బాలీవుడ్ తో పాటు తమిళ్, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ చిత్రాలలో నటించి మెప్పించింది.