హాంగ్‌కాంగ్‌లోని తైపో డిస్ట్రిక్ట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 44 మందికిపైగా మృతి చెందారు. మరో 45 మంది పరిస్థితి విషమంగా ఉండగా, 279 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.ఈ కేసులో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఇద్దరు ఒక నిర్మాణ సంస్థ డైరెక్టర్లు కాగా, మరొకరు ఇంజినీరింగ్ కన్సల్టెంట్.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరమ్మత్తులు జరుగుతున్న ప్రదేశంలో పాలీస్టైరీన్ బోర్డులు కిటికీలకు అడ్డుగా ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.పనుల కోసం వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన నిర్మాణం(పరంజా) కారణంగా మంటలు మరింత వేగంగా పొరుగున ఉన్న భవనాలకు కూడా వ్యాపించినట్లు అధికారులు చెబుతున్నారు.
గురువారం ఉదయం కూడా కొన్ని టవర్ బ్లాక్‌ల నుంచి పొగ ఇంకా వెలువడుతోంది. మొత్తం 8 టవర్లలో నాలుగు భవనాల్లో మంటలు అదుపులోకి వచ్చాయి.700 మందికి పైగా అగ్నిమాపకసిబ్బంది భారీ మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.మంటలను ఆర్పేందుకు శ్రమిస్తూ అగ్నిమాపక సిబ్బంది ఒకరు ప్రమాదంలో మరణించారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ అపార్ట్‌మెంట్ సముదాయాన్ని ‘వాంగ్ ఫు కోర్ట్’గా పిలుస్తారు.
మరణాలకు కారణమని భావిస్తున్న నిందితుల అరెస్టు గురించి పోలీసులు (Police)వివరాలు వెల్లడించారు.నిర్మాణ సంస్థకు చెందిన 52 ఏళ్ల నుంచి 68 ఏళ్ల వయసున్న ముగ్గురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు సంస్థ డైరెక్టర్లు కాగా, మరొకరు ఇంజినీరింగ్ కన్సల్టెంట్.”కంపెనీ బాధ్యతలు చూస్తున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు, అదే ఈ ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది” అని పోలీస్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మంటలు ఎలా చెలరేగాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.హాంకాంగ్‌లోని తైపో జిల్లాలోని వాంగ్ ఫుక్ కోర్ట్ హౌసింగ్ కాంప్లెక్స్‌లో, 8 బ్లాక్స్ మంటల్లో చిక్కుకున్న ప్రదేశానికి చేరుకున్న వారిలో థామస్ లియూ కూడా ఒకరు. ఆయన ఒక విద్యార్థి.థామస్ ఈ ప్రమాదం గురించి మాట్లాడుతూ, “ఇదొక విపత్తు” అని అన్నారు. ఇక్కడి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లడం తాను చూశానని ఆయన తో చెప్పారు.”మా బంధువులు ఇంకా లోపలే ఉన్నారంటూ చాలామంది మాకు ఫోన్ చేశారు, వాట్సాప్ మెసేజ్‌లు చేశారు. కొంతమంది ఆచూకీ కూడా తెలియడం లేదని కొందరు చెప్పారు” అని తైపో జిల్లా కౌన్సిలర్, ముయి సియు ఫంగ్ చైనీస్‌తో చెప్పారు.
వాంగ్ ఫుక్ కోర్ట్ కాంప్లెక్స్‌లోని రెండో బ్లాక్‌లో 40 ఏళ్లకు పైగా నివసిస్తున్న హ్యారీ చియుంగ్ వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, భారీ శబ్దం వచ్చిందని, దగ్గర్లోనే ఉన్న బ్లాక్స్‌లో మంటలు చెలరేగడం చూశానని చెప్పారు కామ్ అనే ఇంటిపేరున్న 60 ఏళ్ల మహిళ ఒకరు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (ఎస్‌సీఎంపీ)తో మాట్లాడుతూ, వాంగ్ ఫుక్ కోర్టులో నివసిస్తున్న తన స్నేహితుల్లో చాలామంది ఈ ప్రమాదంలో చిక్కుకున్నారని చెప్పారు.తన స్నేహితురాలొకరు ప్రతిరోజూ మధ్యాహ్నం సమయంలో నిద్రపోతారని, మంటలు చెలరేగిన సమయంలో (మధ్యాహ్నం 14.51) ఆమె నిద్రపోతూ ఉండవచ్చని ఆమె అన్నారు. ఆమె కుమార్తెలు ఇంకా ఆమెను సంప్రదించలేకపోయారని, ఆమె వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
మరో స్థానికుడు, 65 ఏళ్ల జాసన్ కాంగ్ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. “మాకు దగ్గర్లోని ఒక బ్లాక్‌లో నివాసముండే ఒక వ్యక్తి ఫోన్ చేసి, మంటలు వ్యాపించిన టవర్ బ్లాక్‌లలో ఒకదానిలో చిక్కుకున్నానని చెప్పారు” అని అన్నారు.” నా హృదయం బద్ధలైంది. చాలామంది స్నేహితులు, ఇరుగుపొరుగువారు అందులో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలీడం లేదు. చూడండి, అన్ని అపార్ట్‌మెంట్లూ కాలిపోతున్నాయి. ఏం చేయాలో తెలీడం లేదు. మేం మళ్లీ సాధారణ జీవితానికి వచ్చేందుకు ప్రభుత్వం సాయం చేస్తుందని ఆశిస్తున్నాం” అన్నారాయన.
మంటలు చెలరేగినప్పుడు తాను ఇంట్లో లేనని మంటల్లో చిక్కుకున్న బ్లాక్‌లలో, ఒక ఫ్లాట్‌లో నివసించే ఒక వృద్ధ మహిళ బీబీసీతో చెప్పారు. తన అపార్ట్‌మెంట్‌కు బీమా లేదని ఆమె ఆందోళన చెందుతున్నారు.”ఇంటికి వెళ్లడానికి ఇల్లు లేకపోవడం చాలా బాధగా ఉంది” అని ఆమె అన్నారు.ఈ సముదాయంలో ఎనిమిది బ్లాకుల్లో 2,000 ఫ్లాట్‌లున్నాయి. దాదాపు 4,600మంది నివసిస్తున్నారు.కొంతమంది భవనాల్లో చిక్కుకుని ఉన్నారని భావిస్తున్నారు. అయితే ఎంతమంది చిక్కుకున్నారనేదానిపై అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు.
హాంకాంగ్‌లోని హౌసింగ్ సొసైటీలు చాలా చిన్నగా ఉంటాయి. భవనాల మధ్య దూరం తక్కువ. జనసాంద్రత ఎక్కువ కావడంతో అగ్నిప్రమాదం ప్రభావం ఎక్కువగా ఉంది.ఇది లెవల్ ఫైవ్ అగ్నిప్రమాదంగా గుర్తించారు. హాంకాంగ్‌లో అత్యంత తీవ్రప్రమాదాలను లెవల్ ఫైవ్‌గా పరిగణిస్తారు.హాంకాంగ్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 51నిమిషాలకు మంటలు చెలరేగాయి.
ప్రమాద స్థలంనుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న తైపో రైల్వేస్టేషన్ నుంచి బయటకు వస్తున్నప్పుడు భారీగా పొగ వాసన వచ్చిందని బీబీసీ ప్రతినిధి ఫోబ్ కాంగ్ చెప్పారు.సమీపంలోని భవనాలను పోలీసులు ఖాళీ చేయించారు.ఇక్కడి ఫ్లాట్లు సాధారణంగా 400 నుంచి 500 చదరపు అడుగుల పరిమాణంలో ఉంటాయి.ఈ కాంప్లెక్స్ సముద్ర తీరానికి, ఓ ప్రధాన రహదారికి దగ్గరగా ఉంటుంది.మరమ్మతు పనుల కోసం భవనాల బయట కట్టిన వెదురుబొంగుల వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని భావిస్తున్నారు.ఈ హౌసింగ్ ఎస్టేట్‌లో ఉన్న మొత్తం 8 భవనాల్లో ఏడు భవనాలపై ప్రభావం ఉందని తై పో జిల్లా కౌన్సిలర్ చెప్పారు.వెయ్యిమందికిపైగా ప్రజలను షెల్టర్లకు తరలించామని తెలిపారు.
వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్ ఉపయోగించే వృద్ధులను ముందుగా తాత్కాలిక షెల్టర్లకు తరలించారు.17 ఏళ్ల తర్వాత హాంకాంగ్‌లో ఈ స్థాయి ప్రమాదం జరిగింది.2008లో మాంగ్ కాక్‌లోని కమర్షియల్ జిల్లా కార్న్‌వాల్ కోర్ట్ మంట్లలో చిక్కుకుంది. ఆ ప్రమాదంలో అప్పుడు నలుగురు చనిపోయారు.స్థానిక కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 2.51 గంటల సమయంలో అగ్నిమాపక విభాగానికి కాల్ వచ్చింది. మొదట 32 అంతస్తుల భవనం బయట ఏర్పాటు చేసిన బాంబూ స్కాఫోల్డింగ్ వద్దే మంట అంటుకుంది. అక్కడ ఉన్న ప్లాస్టిక్ నెట్టింగ్, కాన్వాస్ కవర్, నిర్మాణ సామగ్రి ఒక్కసారిగా మంటలను వేగంగా వ్యాపింపజేశాయి. గాలి బలంగా వీయడంతో మంటలు వెంటనే ఇతర టవర్లకు పాకాయి. మొత్తం ఎనిమిది భవనాలు ఉన్న ఈ సముదాయంలో 2,000కు పైగా ఇళ్లు ఉన్నాయి. దాదాపు 4,800 మంది నివసించే ప్రాంతంలో చాలామంది వృద్ధులు కూడా ఉంటారు. ప్రమాదం సంభవించగా ఎంతోమంది పై అంతస్తుల్లో చిక్కుకుపోయారు.
140 ఫైరింజన్లు, 60 అంబులెన్స్‌లు మోహరింపుఅగ్నిమాపక శాఖ ఈ ఘటనను అత్యుత్తమ ఎమర్జెన్సీ అయిన లెవల్ 5 అలారంగా ప్రకటించింది. దీంతో భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టారు. 60కిపైగా అంబులెన్సులు మెహరించారు. వందలాది అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, పారామెడిక్స్ చేరుకున్నారు. అయినా కూడా మంటలు అదుపులోకి రావడం కష్టంగా మారింది. మూడు భవనాల్లో మాత్రమే రాత్రి నాటికి మంటలు నియంత్రణలోకి వచ్చాయని ఫైర్ సర్వీసులు తెలిపాయి. మిగిలిన నాలుగు భవనాల్లో అగ్ని ఇంకా రగులుతూనే ఉంది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా పై అంతస్తులకు చేరుకోవడం ప్రమాదకరంగా మారిందని అధికారులు తెలిపారు. మంటలు వ్యాపించిన బాంబూ స్కాఫోల్డింగ్, కూలిపోతున్న ధ్వంసావశేషాలు రక్షణ చర్యలను అడ్డుకున్నాయి. ఒక 37 ఏళ్ల అగ్నిమాపక సిబ్బంది మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అరెస్ట్‌లు కారణం ఏమిటి?
అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే పోలీసులు మూడు మందిని అరెస్ట్ చేశారు. ఇద్దరు కంపెనీ డైరెక్టర్లు,ఒక కన్‌స్ట్రక్షన్ కన్సల్టెంట్ను అదుపులోకి తీసుకున్నారు. వారి సంస్థ పేరుతో ఉన్న పాలిస్టైరిన్ బోర్డులు కొన్ని అపార్ట్‌మెంట్‌ల కిటికీలను పూర్తిగా మూసివేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇవి అత్యంత త్వరగా మండే పదార్థాలు. ఇవే మంటలు వేగంగా వ్యాపించడానికి ప్రధాన కారణంగా అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా భవనాల బయట ఏర్పాటు చేసిన నెట్టింగ్, ప్లాస్టిక్ కవర్లు వంటి నిర్మాణ పదార్థాలు కూడా ఫైర్ రెసిస్టెన్స్ ప్రమాణాలకు తగ్గట్లు లేవని అనుమానిస్తున్నారు.
అధికారుల స్పందన
ఘటనపైచైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీ మాట్లాడుతూ, భవనాల పునరుద్ధరణ సమయంలో ఉపయోగించిన పదార్థాలన్నింటినీ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మంటలు ఆకాశహర్మ్యాల పై అంతస్తుల నుంచి బయటకు వస్తున్న దృశ్యాలను చూసి అక్కడి ప్రజలు వణికిపోయారు. 900 మందికి పైగా ప్రజుకు తాత్కాలిక నివాసాలకు తరలించారు. ఇంకా చాలా మంది ఆచూకీ తెలియని నేపథ్యంలో రక్షణ బృందాలు మంటలు తగ్గిన వెంటనే లోపల శిథిలాలను తొలగించి సహాయక చర్యలు కొనసాగించనున్నాయి


















