థాయ్‌లాండ్ లో సంచలన ఘటన వెలుగు లోకి వచ్చింది. హానీ ట్రాప్ బాగోతాలు ఇప్పటికే ఎన్నో వెలుగులోకి రాగా.. కానీ ఇక్కడ చోటు చేసుకున్న విషయం మాత్రం అందరికీ ఊహించని షాక్ ఇస్తుంది. సామాన్యులు, ప్రముఖులను కాకుండా ఈసారి సన్యాసులను టార్గెట్ చేసిన ౩౦ ఏళ్ల యువతి వారి వద్ద నుంచి ఏకంగా 102 కోట్లు వసూలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.విలావన్ ఎస్మావత్ అనే 30 ఏళ్ల యువతి.. తన అందాన్ని ఆయుధంగా మార్చి 9 మంది బౌద్ధ సన్యాసులను మోసగించింది. సుమారు రూ. 102 కోట్లు వసూలు చేసినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఆమె బ్లాక్‌మెయిల్ చేసిన విధానం, వాడిన పద్ధతులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి.
విలావన్ సోషల్ మీడియాలో ‘మిస్ గోల్ఫ్’ అనే నామంతో బౌద్ధ సన్యాసులతో పరిచయాలు పెంచుకొని.. ఆ తర్వాత వారిని తన వలలో వేసి, వారితో సన్నిహితంగా గడిపేది. వారికి తెలియకుండానే లైంగికంగా కలిసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించింది. ఈ బెదిరింపులు ఓ సన్యాసిని తీవ్ర మనోవేదనకు గురి చేశాయి. చివరకు ఆయన సన్యాస జీవితం కూడా వదిలి సాధారణ జీవితానికి వచ్చారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా ఈ స్కాం బయటపడింది. పోలీసులు విలావన్‌ను అదుపులోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.కాగా విలావన్ ఇంటిపై పోలీసుల సోదాలు చేయగా 80,000కి పైగా బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగించిన ఫోటోలు, వీడియోలు బయటపడ్డాయి. ఇప్పటికే మరికొందరు బాధితుల వివరాలను సేకరించేందుకు పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
2024 మేలో ఒక సన్యాసితో బంధం ఏర్పరచుకున్న ఆమె, ఆ సన్యాసితో ఓ బిడ్డకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. అనంతరం ఆ వ్యక్తిని బిడ్డ పెంపకం ఖర్చుల పేరుతో రూ.1.81 కోట్లు డిమాండ్ చేసింది. ఇలా దక్కించుకున్న డబ్బులో కొంత భాగాన్ని జూదం కోసం వాడినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.ఈ ఘటనపై మనీలాండరింగ్, దోపిడీ, బెదిరింపు వంటి పలు కేసులు నమోదు చేశారు. థాయ్‌లాండ్ బౌద్ధ సంస్థల పరువును మంటగలిపే విధంగా మారిన ఈ వ్యవహారంపై సంఘ సుప్రీం కౌన్సిల్ తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా నిబంధనలు విషయంలో సమీక్షించేందుకు నిర్ణయం తీసుకుంది.