కొత్తగా పెళ్లై.. హ్యాపీగా హనీమూన్ కు వెళ్లిన వైద్య దంపతులు.. టూర్ ప్లాన్ చేసిన ట్రావెల్ సంస్థ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయినట్లుగా వినియోగదారుల హక్కుల కమిషన్ గుర్తించింది. అప్పట్లో అందరిని కదిలించిన ఈ హనీమూన్ జంట దుర్మరణానికి సంబంధించి తాజాగా చెన్నై వినియోగదారుల కమిషన్ ఆసక్తికర తీర్పును వెలువరించింది. ట్రావెల్ సంస్థ నిర్లక్ష్యాన్ని తప్పు పడుతూ.. వారికి భారీగా ఫైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అసలేం జరిగిందంటే..
2023 జూన్ లో తమిళనాడుకు చెందిన డాక్టర్ విభూష్ణియా.. డాక్టర్ లోకేశ్వరన్ కు పెళ్లైంది. జీటీ హాలిడేస్ సంస్థ నిర్వహించే హాలీడే ప్యాకేజ్ తో వారు హనీమూన్ కోసం ఇండోనేషియా వెళ్లారు. అక్కడి సముద్రంలో మోటారు బోట్ లో వారిద్దరూ ఫోటోషూట్ పాల్గొన్న వేళలో అకస్మాత్తుగా నీట మునిగి చనిపోయారు. వీరి మరణం వెనుక ట్రావెల్ సంస్థ నిర్లక్ష్యం ఉందన్నది బాధితుల కుటుంబాల ఆరోపణ. తన కుమార్తె.. అల్లుడు మరణానికి కారణం ట్రావెల్ సంస్థ నిర్లక్ష్యంగా పేర్కొంటూ చెన్నై పూందమల్లికి చెందిన విభూష్ణియా తండ్రి వినియోగదారుల కమిషన్ లో కంప్లైంట్ చేశారు. గతంలోనూ ఆ ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగాయని.. అయినప్పటికీ సంబంధిత సంస్థ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు. ట్రావెల్ సంస్థ సేవా లోపం కారణంగా తన కుమార్తె.. అల్లుడు సముద్ర అలల్లో కొట్టుకుపోయి చనిపోయినట్లుగా పేర్కొన్నారు.
సంస్థ చేసిన సేవాలోపానికి రూ.1.50 కోట్ల నష్టపరిహారం ఇప్పించాలని.. తన కుమార్తెను.. అల్లుడ్ని కోల్పోవటంతో తనకు ఏర్పడిన మానసిక ఒత్తికి రూ50 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై విచారణ జరిపిన చెన్నై వినియోగదారుల కమిషన్ ట్రావెల్ సంస్థ నిర్లక్ష్యాన్ని గుర్తించింది. వారి సేవాలోపం కారణంగానే హనీమూన్ జంట మరణించినట్లుగా తేల్చింది. బాధిత కుటుంబానికి రూ.1.50 కోట్ల పరిహారం ఇవ్వాలని.. కంప్లైంట్ చేసిన బాధితురాలి తండ్రి అనుభవించిన మానసిక ఒత్తిడికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది.