వైసీపీ అధినేత, మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఆశలు ఇప్పట్లో నెరవేరుతాయా? ఆయనకు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కుతుందా? అంటే.. లేదనే అంటున్నారు న్యాయవాదులు. నిజానికి ఈ మాట ఎవరో చెప్పడం కాదు.. వైసీపీ లీగల్ సెల్ నాయకుల్లోనే అంతర్గతంగా జరుగుతున్న చర్చ. దీనికి కారణం.. సుప్రీంకోర్టేనని కూడా అంటున్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో 11 స్థానాలు మాత్రమే దక్కడంతో జగన్ అసెంబ్లీకి రాకుండా భీష్మించారు.
తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. తద్వారా కేబినెట్ హోదాతోపాటు.. సభ లో ఎక్కువ సేపు.. మాట్లాడే అవకాశం దక్కుతుందని కూడా ఆయన అంచనా వేస్తున్నారు. అయితే.. అనుకున్న విధంగా అయితే ఆశలు నెరవేరడం లేదు. సంఖ్యా బలం లేనందున తాము ఏమీ చేయలేక పోతున్నామని స్పీకర్ చెబుతున్నారు. ఇక, సభానాయకుడిగా చంద్రబాబు కూడా ఈ విషయంపై తేల్చేశారు. ప్రజలే ఇవ్వంది.. తాము ఎలా ఇస్తామని.. ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే రావాలని సవాల్ రువ్వుతున్నారు.
ఇదిలావుంటే.. ఇప్పటికే ఒకసారి హైకోర్టులో తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాలని కోరుతూ.. జగ న్ పిటిషన్ వేశారు. దీనిలో స్పీకర్ ను ప్రతివాదిగా చేర్చారు. అయితే.. హైకోర్టు స్పీకర్ పేరును తీసేసింది. ఇదిలావుంటే.. స్పీకర్ కూడా.. ఈ విషయంలో మౌనంగా ఉన్నారు. తాజాగా మరోసారి జగన్ హైకోర్టు ను ఆశ్రయించి.. మరో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. స్పీకర్‌ను వివరణ కోరింది. ఇదిలావుంటే.. ఈ కేసు హైకోర్టులో తేలేందుకు.. మరింత సమయం పట్టనుంది.
ఎందుకంటే స్పీకర్ వైపు నుంచి నిర్దిష్ట సమయంలో సమాచారం అందినా.. ఇతర వాదనలు పూర్తయ్యే సరికి కాలహరణం తప్పదు. ఒకవేళ.. హైకోర్టులో జగన్‌కు సానుకూలంగా తీర్పు వచ్చినా.. సర్కారు చూస్తూ ఊరుకోదు. పైగా స్పీకర్ కూడా తన హక్కులను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. దీనిలో భాగంగా ఇరు పక్షాలు కూడా.. సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఖాయం. అక్కడ విచారణ జరిగి.. తీర్పు లేదా ఆదేశం వచ్చేసరికి మరింత సమయం పడుతుంది. సో. మొత్తంగా చూస్తే.. ఈ కేసు విచారణ పూర్తయ్యే సరికి మళ్లీ ఎన్నికల సమయం వచ్చేసినా ఆశ్చర్యం లేదన్నది వైసీపీ లీగల్ సెల్ నాయకులు చెబుతున్న మాట. కానీ, జగన్ మాత్రం తీర్పు రేపే వస్తుందన్న ధీమాతో వ్యవహరిస్తుండడం గమనార్హం.