పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులు గత రెండేళ్ల కాలంగా ఎదురు చూస్తున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఆరంభం కాబోతుంది. తెలుగు రాష్ట్రాలు, ఇండియాలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏ సినిమాకు అయినా యూఎస్‌లో చాలా ముందు అడ్వాన్స్ బుకింగ్ మొదలు అవుతుంది. స్టార్ హీరోల సినిమాల యొక్క ముందస్తు బుకింగ్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. అక్కడి ఫ్యాన్స్ ఎంత పెద్ద మొత్తంలో అయినా టికెట్ల రేట్లు పెట్టేందుకు గాను ముందుకు వస్తారు. అందుకే ఈ మధ్య కాలంలో యూఎస్ బాక్సాఫీస్ టాలీవుడ్‌తో పాటు ఇండియన్ సినిమాకు చాలా కీలకంగా మారింది.
హరిహర వీరమల్లు సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ను జులై 10 నుంచి ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఆయా వెబ్ సైట్‌లో టికెట్ బుకింగ్స్‌కు సంబంధించిన ప్రకటనలు చేశారు. సినిమా రన్ టైమ్ ను ఆయా వెబ్ సైట్స్ లో 2 గంటల 40 నిమిషాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కాని ఈ సినిమా రన్ టైమ్‌ను అందులో పేర్కొన్నారు అంటే అదే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా ఇలాంటి భారీ సినిమాలకు మూడు గంటల రన్ టైమ్‌ను ప్లాన్ చేస్తారు. కానీ మేకర్స్ తెలివిగా 20 నిమిషాలు తగ్గించారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిడివి తక్కువ ఉంటే రిస్క్ తక్కువ ఉంటుంది అనేది టాక్.
పవన్ కళ్యాణ్ ను చాలా కాలం తర్వాత వెండి తెరపై చూడబోతున్న అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు కీరవాణి అందించిన సంగీతం ప్రేక్షకులను మెప్పిస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఇక ఈ సినిమాను క్రిష్ మొదలు పెట్టినా కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో ఆ స్థానంను నిర్మాత ఏ ఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ భర్తీ చేశాడు. సినిమాను క్రిష్ కు ఏమాత్రం తగ్గకుండా జ్యోతి కృష్ణ పూర్తి చేశాడని అంటున్నారు. సినిమా ఫైనల్ ఔట్ పుట్ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ చాలా సంతోషించి జ్యోతికృష్ణను అభినందించాడట. సినిమాకు చాలా ఎక్కువ సమయం పట్టిన కారణంగా బడ్జెట్ విపరీతంగా పెరిగింది.
సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఆ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల వచ్చిన వీరమల్లు ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలు పెంచింది. ట్రైలర్ విడుదల తర్వాత అడ్వాన్స్ బుకింగ్ కోసం ఎదురు చూపులు మరింతగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా యొక్క టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు అడుగుతున్నారు. త్వరలోనే ఆ అనుమతులు రావడం, సెన్సార్ పూర్తి కావడం జరుగుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సినిమాను వాయిదా వేసేది లేదు అంటూ దర్శకుడు జ్యోతి కృష్ణ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా సినిమా ప్రమోషన్ హడావిడి మొదలైంది. లిమిటెడ్ రన్ టైం తో రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ పాజిటివ్ బజ్ కలిగి ఉన్న కారణంగా ఓపెనింగ్స్ సాలిడ్‌గా ఉండే అవకాశాలు ఉన్నాయి.