టీమిండియా ట్యాలెంటెడ్ క్రికెటర్ హార్థిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన తర్వాత అతడి ఎఫైర్ల జాబితా అంతకంతకు పెద్దదవుతోంది. ఇంతకుముందు విదేశీ మోడల్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారమైంది. ఈ ఇద్దరూ సోషల్ మీడియాల్లో ఒకరినొకరు అనుసరించడం దీనికి ఆజ్యం పోసింది. ఆ తర్వాత జాస్మిన్ వాలియా అతడి నుంచి బ్రేకప్ అయింది. ఇటీవల హార్దిక్ పాండ్యా నటి కం మోడల్ మహికా శర్మతో సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నాడంటూ ప్రచారం సాగుతోంది. పలుమార్లు ఈ జోడీ పబ్లిక్ అప్పియరెన్సులు పుకార్లకు ఊతమిచ్చాయి. ఇటీవల మహీకను ఓ జిమ్ లో ఎత్తుకుని వెళుతున్న హార్థిక్ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లోకి దూసుకొచ్చాయి. ఆ ఇద్దరి మధ్యా చనువు మితిమీరిందంటూ గుసగుసలు వినించాయి.
ఇంతలోనే ఇప్పుడు ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని సోషల్ మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. ఆ ఇద్దరి నుంచి ఇటీవలి కొన్ని సోషల్ మీడియా పోస్టులు ఈ తరహా చర్చకు దారితీసాయి. మహీక ఉంగరపు వేలుపై మెరిసే పెద్ద ఉంగరాన్ని ఫ్యాన్స్ గమనించిన తర్వాత పాండ్యాతో రహస్యంగా నిశ్చితార్థం అయిందని ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ నిశ్చితార్థపు ఉంగరం తాలూకా స్క్రీన్‌షాట్లు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. మహీకశర్మ ధరించిన ఆభరణాలలో ఈ అంగుళీకం ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. వజ్రాల ఉంగరం తళతళల గురించి ముచ్చట్లు మొదలయ్యాయి. అయితే ఆ ఇద్దరూ నిశ్చితార్థాన్ని నిర్ధారిస్తూ ఎటువంటి బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతానికి ఇవన్నీ ఊహాగానాలుగానే భావించాలి.
జూలై 2024లో హార్థిక్- నటాషా జంట విడిపోతున్న విషయం బహిర్గతమైంది. ఆ తర్వాత విడాకులను అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అగస్త్యకు ఏ లోటు రానివ్వకుండా సహతల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. పాండ్యా – మహికా జంటపై ఇటీవలే రూమర్లు మొదలయ్యాయి. 2025 అక్టోబర్‌లో ముంబై విమానాశ్రయంలో ఈ జంట బహిరంగంగా కనిపించక ముందు సామాజిక మాధ్యమాలలో ఒకరికొకరు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కనిపించారు. ఇప్పుడు వ్యవహారం రహస్య నిశ్చితార్థం వరకూ వెళ్లిందన్న ప్రచారం సాగుతోంది.
















