భారత క్రికెట్ లో స్టయిల్ ఐకాన్స్ అంటే… మొన్నటివరకు మాజీ కెప్టెన్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లిలే..! జులపాల జుట్టుతో టీమ్ ఇండియాలోకి వచ్చిన ధోనీ… ఆపై తన హెయిర్ స్టయిల్ ను వివిధ రూపాల్లోకి మార్చాడు.. ఏం చేసినా అతడిది ఒక స్టయిల్ గా మారింది. ధోనీ హెయిర్ కటింగ్ రూ.లక్షన్నర అనే ప్రచారం ఉంది.. ఇక ధోనీ స్థాయిలో పొడవాటి జుట్టు కాకపోయినా, తన జుట్టంటే కోహ్లికి చాలా ఇష్టం. ఇదే మాటను అతడు పలుసార్లు చెప్పాడు కూడా. ఆ జుట్టును రకరకాలుగా కటింగ్ చేయించేవాడు కోహ్లి. కొన్నాళ్లు దానికి సెపరేట్ కలర్ కూడా వేయించాడు.
క్రికెట్ లో ముఖ్యంగా కరీబియన్లు స్టయిల్ ను ఫాలో అవుతుంటారు. యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. మరో క్రికెటర్ నికొలస్ పూరన్ పొట్టి జుట్టును పలు విధాలుగా ట్రిమ్ చేయిస్తుంటాడు. ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కూడా టాటూలతో స్టయిల్ స్టయిల్ గా కనిపిస్తుంటాడు. గతంలో ఏమో కానీ.. ధోనీ వచ్చాక భారత క్రికెట్ కూ ఫ్యాషన్ అలవాటైంది. అతడి బాటలోనే కోహ్లి ప్రయాణం సాగించాడు. మరి ఈ తరానికి ఎవరు?
ధోనీ, కోహ్లిలను మించి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా డిఫరెంట్ లుక్ కోసం ప్రయత్నిస్తుంటాడు. టోర్నమెంట్ టోర్నమెంట్ కు అతడు తన స్టయిల్ మార్చేస్తుంటాడు. ఒంటిమీద టాటూలే కాదు.. హెయిర్ స్టయిల్ లోనూ కొత్తగా కనిపిస్తుంటాడు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఆసియా కప్ కోసం హార్దిక్ దుబాయ్ చేరుకున్నాడు. ఇప్పుడు అతడి హెయిర్ స్టయిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడు షేర్ చేసిన ఫొటోల్లో… జుట్టు పూర్తిగా కలర్ మారి తెల్ల రంగులో కనిపిస్తోంది. సైడ్స్ ట్రిమ్ చేయించాడు. చెవి కిందన మెడ మీద పూల గుర్తుతో టాటూలు వేయించాడు. వీటికి ఇప్పుడు అభిమానులు ఫిదా అయ్యారు. పూరన్, బెన్ స్టోక్స్ ను చూసినట్లుందని కామెంట్లు చేస్తున్నారు.