*‘హంద్రీనీవా సుజల స్రవంతి’ పూర్తికి సీఎం చంద్రబాబు సంకల్పం*
*ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ మేర కాలువ పనులకు రూ.3,873 కోట్లు కేటాయింపు*
*కాలువ వెడల్పుతో 3,850 క్యూసెక్కులకు పెరగనున్న నీటి సామర్థ్యం*
*5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు..వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం*
*గత టీడీపీ హాయంలో హంద్రీనీవా ప్రాజెక్టు పై రూ.4 వేల కోట్లు పైగా ఖర్చు…కూటమి ప్రభుత్వంలో మళ్లీ శరవేగంగా పనులు*
*అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం, చాయాపురంలో రేపు ప్రాజెక్టు పనుల పరిశీలించనున్న సీఎం చంద్రబాబు*
*అమరావతి, మే 8 :-* రాయలసీమ జీవనాడి హంద్రీనీవా సుజల స్రవంతి నిర్మాణం పనులు వేగవంతం చేసి… త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు నిర్మాణం పనులను స్వయంగా పర్యవేక్షించేందుకు ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ పనులను పరిశీలించి… అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.
2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో వేగంగా పనులు చేపట్టినా… 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ప్రాజెక్టుపై తీవ్ర నిర్లక్ష్యం చూపించింది. గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నాశనం చేసినట్టుగానే HNSSను కూడా పక్కన పెట్టేసింది. కాలువ విస్తరణ, లైనింగ్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేయలేదు. రాయలసీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు ఎంత ప్రయోజనమో తెలిసి కూడా పట్టించుకోలేదు. 2024లో HNSSకు పట్టిన గ్రహణం తొలిగిపోయింది. కూటమి విజయంతో ఈ ప్రాజెక్టు పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. దశాబ్దాల ఆకాంక్ష త్వరలోనే సాకారం కానుంది. కూటమి ప్రభుత్వం రాగానే HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ – వెడల్పు పనులకు ముఖ్యమంత్రి పరిపాలనా అనుమతులిచ్చి పట్టాలెక్కించారు. 2025 జూన్ నాటికి ఫేజ్-I పూర్తయ్యేలా ముఖ్యమంత్రి అధికారులకు ఇప్పటికే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనిలో భాగంగా కొద్దినెలలుగా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి.
*2014 – 2019 మధ్య కాలంలో :*
2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల పాటు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. ప్రాజెక్టు సామర్ధ్యానికి తగ్గట్టు కాలువలు లేకపోవడంతో డిజైన్‌లో మార్పు చేసి HNSS మెయిన్ కాలువను వెడల్పు చేయాలని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించారు. కాలువను వెడల్పు చేసే పనులు ఏప్రిల్ 2017లో చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్, మడకశిర బ్రాంచ్ కాలువ పనులు 2016-17లో పూర్తయ్యాయి. కియా పరిశ్రమలకు నాడు గొల్లపల్లి రిజర్వాయర్ నుంచే నీరివ్వడం జరిగింది. చెర్లోపల్లి, మారాల రిజర్వాయర్లు 2018-19లో పూర్తయ్యాయి. 2019లో మొదటిసారిగా MBC, PBCకి నీరు విడుదల చేశారు.
*ఈ 5 నెలల్లో పనుల్లో పురోగతి :*
HNSS మెయిన్ కాలువ, పుంగనూరు బ్రాంచ్ కాలువ లైనింగ్ పనులకు పరిపాలనా అనుమతులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంజూరు చేసింది. మొదట కాలువలకు లైనింగ్ లేకుండా నిర్మించడంతో గరిష్ట ప్రవాహం కేవలం 2,200 క్యూసెక్కులు మాత్రమే ఉండేది. 3850 క్యూసెక్కుల సామర్థ్యం కలిగేలా… కాలువలను విస్తరించి, లైనింగ్ పనులు చేపట్టారు. 5 నెలల కాలంలో లక్ష్యం మేర పనులు జరిగాయి. వచ్చే నెలకల్లా మొదటి దశ పనులు పూర్తి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. ఫేజ్-II కాలువల (పుంగనూరు,కుప్పం బ్రాంచ్‌లు) పనులు వేగంగా జరుగుతున్నాయి. పాడెర, మడకశిర, కుప్పం వంటి ప్రాంతాలకు నీరు చేరేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారు.
*మొత్తం రూ.3,873 కోట్లతో పనులు :*
హంద్రీనీవా ప్రాజెక్టులో ఫేజ్ – 1, 2 కింద 554 కి.మీ. మేర కాలువ లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఫేజ్-1 కింద రూ.696 కోట్లతోనూ, ఫేజ్-2 కింద రూ.1,256 కోట్లతో HNSS ప్రధాన కాలువ (Km 216 – Km 400), పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 0.00 – Km 75) పనులు చేపట్టారు. పుంగనూరు బ్రాంచ్ కాలువ (Km 75 – Km 207) పనులను రూ.480 కోట్లతో ఈ ఏడాది జనవరిలో ప్రారంభించారు. ఇప్పటివరకు 15 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. రూ.197 కోట్లతో కుప్పం బ్రాంచ్ కాలువ పనులు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించగా, ఇప్పటివరకు 40 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 2 పూర్తయితే మెయిన్ కెనాల్ నుంచి 2,520 క్యూసెక్కులు, PBC నుంచి 840 క్యూసెక్కులు నీటి సరఫరాకు వీలవుతుంది. HNSS మెయిన్ కాలువకు సంబంధించి రూ.590 కోట్లతో 400 కి.మీ నుంచి 490 కి.మీ వరకు లైనింగ్ పనులకు, అలాగే రూ.291 కోట్లతో 490 కి.మీ నుంచి 554 కి.మీ వరకు లైనింగ్ పనులకు, నీవా కాలువకు సంబంధించి రూ.362 కోట్లతో 0 కి.మీ నుంచి 123 కి.మీ వరకు పనులు చేపట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
*HNSS ప్రాజెక్టు లక్ష్యం :*
ప్రాజెక్టు పూర్తయితే Phase-I కింద కర్నూలు జిల్లాలో 77,094, నంద్యాల జిల్లాలో 2,906, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాలు… మొత్తం 1,98,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. Phase-II కింద అనంతపురం జిల్లాలో 33,617, సత్యసాయి జిల్లాలో 1,93,383, కడప జిల్లాలో 37,500, చిత్తూరు జిల్లాలో 1,40,000 ఎకరాలు కలిపి మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. మొత్తం 81 మండలాల్లో 33 లక్షల మందికి త్రాగు నీటి సరఫరాకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టు పనుల రేపు స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.