మోడీ మాష్టారు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పదకొండేళ్లు దాటేసింది. అయినప్పటికీ.. దేశ ప్రజలందరికి ఇచ్చే వరాల మూట వెనుక ఏదో ఒక హిడెన్ ఎజెండా ఒకటి ఉంటుంది. వరాల మూట విప్పినట్లుగా చెప్పినా.. ఏదో ఒక ట్విస్టు ఉంటుందే తప్పించి.. సూటిగా.. సుత్తి లేకుండా భారీ ఆఫర్లను ప్రకటించింది లేదు. ఇందుకు భిన్నంగా తాజాగా జీఎస్టీ అమలుకు సంబంధించి విప్లవాత్మక నిర్ణయాల్ని తీసుకున్నట్లుగా చెప్పాలి.
ఇప్పటివరకు ఉన్న జీఎస్టీ శ్లాబుల్ని రెండింటికే పరిమితం చేయటం.. లగ్జరీ వస్తువుల విషయంలో ఇస్పెషల్ బాదుడ్ని పక్కన పెడితే.. అత్యధికం ప్రజల మీద పడే ధరాభారాన్ని తగ్గించేలా ఉండటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. నిత్యవసర వస్తువుల మీద విధించే జీఎస్టీని పూర్తిగా తొలగించటం ద్వారా సామాన్య ప్రజలకు భారీ ఊరట ఇచ్చారని చెప్పాలి.
బ్రాండెడ్ బ్రెడ్.. బ్రెడ్ ఉత్పత్తులపై కనిష్ఠంగా 5 శాతం, గరిష్ఠంగా 18 శాతం మేర జీఎస్టీ అమల్లో ఉండగా అదిప్పుడు జీరో అయ్యింది. అంతేకాదు పరాఠాపై 18 శాతం.. చపాతీ.. యూహెచ్ టీ పాల మీద 5 శాతం జీఎస్టీని ఎత్తేయనున్నారు. నిద్ర లేచింది మొదలు అందరూ వాడే పలు వస్తువులు (టూత్ పేస్ట్ .. టూత్ బ్రష్ లు.. టాల్కమ్ పౌడర్లు.. షాంపూలు.. సబ్బులు.. హెయిర్ ఆయిల్.. వెన్న.. నెయ్యి.. మాంసం.. బిస్కెట్లు.. షుగర్ కన్ఫెక్షనరీ.. జామ్.. ఫ్రూట్ జెల్లీలు.. డ్రైనట్స్.. ఐస్ క్రీమ్.. పండ్ల రసాలు.. కార్న్ ఫ్లేక్స్ తదితర వస్తువులపై ఇప్పటివరకు ఉన్న 18 శాతం జీఎస్టీ కాస్తా 5 శాతానికి తగ్గించేశారు.
ఇదే కాదు ప్రీ ప్యాకేజ్డ్ నమ్ కీన్స్.. భుజియా.. మిక్చర్ లాంటి చిరుతిళ్ల మీద ఇప్పటివరకు 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా ఇప్పుడు అది కాస్తా ఐదు శాతానికి తగ్గిపోయింది. పిల్లల పాల బాటిల్స్.. పిల్లల నాప్కిన్స్.. క్లినికల్ డైపర్స్ మీదా 12 శాతం ఉన్న జీఎస్టీ ఇప్పుడు ఐదు శాతానికి తగ్గింది.కుట్టుమెసీన్లు.. విడిభాగాల మీదా 12 శాతం జీఎస్టీకి బదులుగా 5 శాతం వసూలు చేయనున్నారు. వెన్నె.. నెయ్యి.. చీజ్.. డెయిరీ స్ప్రెడ్స్ లాంటి వాటిపై 12 శాతం ఉన్న జీఎస్టీకి బదులుగా ఇప్పుడు 5 శాతానికి తగ్గించారు.
అదే సమయంలో ఆరోగ్యానికి హాని చేసే వస్తువుల విషయంలో కఠినంగా వ్యవహరించిన మోడీ సర్కారు ఏకంగా 40 శాతం జీఎస్టీ వసూలు చేసేలా ప్లాన్ చేశారు. ఇందులో సిగరెట్లు.. గుట్కాలు.. పాన్ మసాలా.. జర్దా లాంటి పొగాకు ఉత్పత్తులపై 40 శాతం పన్ను రేటును ప్రతిపాదించారు. ఇప్పటివరకు వీటిపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. వీటితో పాటు కూల్ డ్రింక్స్ మీదా 40 శాతం పన్ను వసూలు చేసేలా ప్రతిపాదించారు. ఈ దీపావళి కానుకను దాని కంటే ముందే వచ్చే దసరాకే ప్రజలకు అందటం ఆసక్తికరంగా చెప్పాలి.
ఈ కొత్త జీఎస్టీ వసూళ్లను సెప్టెంబరు 22 నుంచి అమల్లోకి తీసుకొస్తారు. కేంద్రం ప్రతిపాదనల్ని అన్ని రాష్ట్రాలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇప్పటివరకు ఉన్న శ్లాబుల్ని తగ్గించేసి 5, 18గా మాత్రం ఉంచారు. ఆరోగ్యానికి హాని కలిగించే సిగరెట్లు.. కూల్ డ్రింక్ లు తదితరాలపై మాత్రం 40 శాతం పన్ను వసూలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో సామాన్యులకు రోజువారీ వస్తు వినియోగం ద్వారా భారీగా పన్ను భారం తగ్గిందనే చెప్పాలి. తాజా మార్పుల నేపథ్యంలో జీఎస్టీ ఆదాయం రూ.48 వేల కోట్లు తగ్గుతుందని చెబుతున్నారు. ద్రవ్యపరంగా దీన్ని ఎదుర్కోగలమని కేంద్రం చెబుతోంది. అయితే.. ఈ తగ్గించిన జీఎస్టీ కారణంగా.. ఇంతకాలం నెంబరు 2లో బిజినెస్ చేసే వారంతా ఇకపై మరో మాటకు తావు లేకుండా చట్టబద్ధంగా బిజినెస్ చేసే వీలుంది. దీంతో.. ఇప్పుడు చెబుతున్న ఆదాయంలో కోత అన్న మాటే ఉండదని చెబుతున్నారు. ప్రస్తుత అంచనాలు లోటులో చూపిస్తున్నప్పటికి వాస్తవంలో మాత్రం అందుకు భిన్నంగా జీఎస్టీ ఆదాయం రానున్న మూడు నాలుగు నెలల్లో మరింత పెరగటం ఖాయమంటున్నారు.
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జీఎస్టీ కొత్త శ్లాబుల్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బుధవారం రాత్రి వేళ.. కాస్త ఆలస్యంగా కొత్త జీఎస్టీ శ్లాబుల మీద క్లారిటీ ఇస్తూ ప్రకటన చేశారు. నిత్యవసర వస్తువులు మొదలు ఒక పరిమితి వరకు ఇప్పటివరకు లగ్జరీగా భావిస్తున్న వస్తువులు.. వస్తుసేవలు సైతం చౌకగా మారనున్నాయి. ఇంటి నిర్మాణంలో అత్యంత కీలమైన సిమెంట్ మీదా ఇప్పటివరకు ఉన్న 28 శాతం పన్ను కాస్తా 18 శాతానికి తగ్గిపోవటం భారీ ఉపశమనంగా మారనుంది.
అంతేకాదు.. ఎలక్ట్ట్రానిక్ వస్తువుల మీదా పన్ను భారాన్ని తగ్గించటం ఆసక్తికర అంశంగా చెప్పాలి. ఉదాహరణకు 32 ఇంచ్ ల కంటే ఎక్కువ ఉండే టీవీల మీద ఇప్పటివరకు పన్ను భారం 28 శాతం కాగా.. అదిప్పుడు 18 శాతానికి తగ్గిపోయింది. ఇవే కాదు.. మోటారు వాహనాలు.. ఏసీలు.. డిష్ వాషర్లు.. ఇతర ఎలక్ట్రానిక్స్ వస్తువుల మీద ధరల భారం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిపోనుంది. ఉదాహరణకు ఒక్కో ఏసీ మీద తక్కువంటే రూ.4 వేల వరకు ధరాభారం తగ్గనుంది.
ఇదంతా ఓకే మోటారు వాహనాలు.. కార్ల సంగతేంటి? అన్న దానిపై ప్రతి ఒక్కరికి ఆసక్తి నెలకొంది. ఎందుకుంటే..తాజాగా తగ్గిస్తారని భావించిన పన్ను తగ్గింపు కార్ల యజమానులు ఏ స్థాయి వారికి ప్రయోజనాన్ని కలిగిస్తుందన్న విషయానికి వస్తే.. టూవీలర్ల విషయానికి వస్తే 350 సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న వాటి వరకు ఇప్పటివరకు ఉన్న పన్ను 12 శాతానికి తగ్గిపోనుంది. కార్ల విషయానికి వస్తే 1200 సీసీకి మించని పెట్రోల్.. ఎల్ పీజీ.. సీఎన్ జీ వాహనాలకు ఇకపై జీఎస్టీ 18 శాతమే ఉండనుంది. అంటే.. ఇప్పుడు అమలైన దానితో పోలిస్తే పది శాతం తగ్గనుంది. అదే సమయంలో 1500 సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాల మీదా పన్ను భారం 18 శాతానికి తగ్గనుంది.
1200 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటారు వాహనాలు.. 3500 సీసీకి మించి సామర్త్యం ఉన్న టూవీలర్లు.. వ్యక్తిగత వినియోగానికి వాడే ఎయిర్ క్రాఫ్ట్ లు.. రేసింగ్ కార్లు.. క్యాసినోలు.. గ్యాంబ్లింగ్.. గుర్రపు పందాలు.. లాటరీలపై 40 శాతం పన్ను రేటు అమల్లోకి రానుంది. ఇక.. అందరూ ఎంతో ఆసక్తిగా చూసిన ఎలక్ట్రిక్ కార్ల మీద ఇప్పటివరకు అమలవుతున్న 5 శాతం జీఎస్టీని కంటిన్యూ చేస్తారు. అంటే.. ఎలక్ట్రిక్ వాహనాల్ని మినహాయిస్తే.. మిగిలిన కార్లు (లగ్జరీ).. టూ వీలర్ల మీద పన్ను భారం పది శాతం తగ్గిపోయింది. అంటే.. 12 లక్షల రూపాయిలు ఉండే కార్ల మీద ఏకంగా రూ.లక్ష పైనే పన్ను భారం తగ్గిపోవటం గమనార్హం. ఇది ఆర్థిక రంగానికి మరింత ఊతమిచ్చేలా చేస్తుందని చెబుతున్నారు.ఏమైనా.. తగ్గిన పన్నుల భారం ప్రజలకు ఉపశమనాన్ని కలిగించటమే కాదు.. వ్యాపారులు సైతం తాము చేసే వ్యాపారాల్ని చట్టబద్ధంగా చేసేందుకు వీలుగా ప్రోత్సహించేలా తాజా నిర్ణయాలు ఉన్నాయని చెప్పాలి.