ప్రపంచ కుబేరుడు, స్పెస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కంపెనీ ‘ఎక్స్ఏఐ’ దాని చాట్ బాట్ గ్రోక్ ద్వారా వికీపీడియాకు పోటీగా సరికొత్త ఆన్ లైన్ ఎన్ సైక్లోపీడియాను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గ్రోకిపీడియా’ అని నామకరణం చేశారు. ఈ విషయాలను మస్క్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
అవును… ఎలాన్ మస్క్ కు చెందిన ఏఐ సంస్థ ‘ఎక్స్ఏఐ’.. వికీపీడియాకు పోటీగా గ్రోకిపీడియాను తీసుకురానుంది. ఈ కొత్త వేదిక వికీపీడియా కంటే మెరుగైన, ఓపెన్ సోర్స్ నాలెడ్జ్ రిపోజిటరీగా ఉంటుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ఇది అందరికీ అందుబాటులో ఉంటుందని, వినియోగంపై ఎలాంటి లిమిట్స్ ఉండవని తెలిపారు.
కాగా… మస్క్ తరచు వికీపీడియాను విమర్శిస్తూ.. రాజకీయ పక్షపాతం, పారదర్శకత లేకపోవడం గురించి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అక్టోబర్ 2023లో వికీమీడియా ఫౌండేషన్ కు మస్క్ $1 బిలియన్ ఆఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వికీపీడియా కంటెంట్ తటస్థతను కూడా పదే పదే ప్రశ్నించారు మస్క్.
ఈ క్రమంలో నెట్టింట హాట్ టాపిక్ గా మారిన ఈ గ్రోకిపీడియాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. వీటిలో కొంతమంది వినియోగదారులు కొత్త జ్ఞాన వేదిక ఆలోచనను స్వాగతించగా.. మరికొంతమంది విభిన్నంగా స్పందించారు. ఇందులో భాగంగా… ‘ఎన్ సైక్లోపీడియా గెలాక్టికా చాలా మంచి పేరు’ అని ఒకరు సూచించారు.
ఇదే సమయంలో ‘వికీపీడియాను కొనుగోలు చేసి దాన్ని ఎందుకు సరిచేయకూడదు?’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు కూడా జ్ఞానాన్ని నియంత్రించడం మంచి ఆలోచనేనా?’ అని ఇంకొకరు ప్రశ్నించారు. మరొక వినియోగదారుడు కాస్త వ్యంగ్యంగా.. దీని తర్వాత రెడ్డిట్ ను కొనుగోలు చేసి దానికి గ్రోకిట్ అని పేరు మార్చండి అని వ్యాఖ్యానించాడు.