సెలబ్రిటీ ప్రపంచంలో రోజుకో కల్లోలం బయటపడుతోంది. అప్పటివరకూ బాగానే ఉన్నా.. అప్పటికప్పుడే కలతలు గొడవలతో భార్యాభర్తలు బయటపడిపోతుండడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది ఇప్పుడే మొదలైన పుకార్ కాదు కానీ.. బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా నుంచి భార్య సునీత అహూజా విడాకులు కోరతున్నారని పుకార్లు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ జంట గొడవ రచ్చకెక్కిందని కథనాలొస్తున్నాయి.
గోవిందా- సునీత దంపతుల గొడవ ఏడాది కాలంగా కోర్టు పరిధిలో ఉందని కథనాలొస్తున్నాయి. భార్య అతడి నుంచి విడాకులు కోరుతోందని జాతీయ మీడియా `లైవ్ మింట్` తన అధికారిక కథనంలో పేర్కొంది. కోర్టు పత్రాల ప్రకారం.. సునీత తన భర్త గోవిందాపై తీవ్రంగా ఆరోపించారు. పిటిషన్ లో వ్యభిచారం, క్రూరత్వం, విడిచిపెట్టడం వంటి ఆరోపణలు చేసారని తెలుస్తోంది.
దాదాపు 38 సంవత్సరాల దాంపత్యంలో ఈ జంట వైవాహిక బంధంలో ఇబ్బందులు ఉన్నాయని జాతీయ మీడియాలో చాలా స్పష్ఠమైన కథనాలొచ్చాయి. అయితే సునీతా అహుజా గత ఏడాది డిసెంబర్ 5 బాంద్రా ఫ్యామిలీ కోర్టులో హిందూ వివాహ చట్టం 1955లోని సెక్షన్ ల ప్రకారం విడాకుల కోసం దాఖలు చేయడంతో ఇరువురి మధ్యా పరిస్థితి మరింత దిగజారిందని లైవ్ మింట్ తన కథనంలో పేర్కొంది. అతడు క్రూరంగా మానసికంగా హింసిస్తున్నాడని సునీత తన పిటిషన్ లో పేర్కొన్నారు. 2025 మేలో గోవిందా కోర్ట్ సెషన్ కి డుమ్మా కొట్టారు. అనంతరం భార్యాభర్తలకు కోర్టు ఆదేశానుసారం కౌన్సెలింగ్ సెషన్‌లు ప్రారంభమయ్యాయి. ఈ సెషన్లకు సునీత హాజరవుతున్నారు. కానీ గోవింద వర్చువల్‌గా చేరారా లేదా అనే దానిపై స్పష్ఠత లేదు. అయితే సునీత ఇంతకుముందు ఓ సందర్భంలో తమ మధ్య గొడవల గురించి ప్రస్థావిస్తూ, దీనిని కొట్టి పారేసారు. గోవిందా టీమ్ గతంలో రాజీపడి తాము సమస్యను పరిష్కరించుకుంటున్నామని ప్రకటించడంతో ఈ గొడవ కొత్త మలుపు తిరిగింది. ఇది అందరినీ గందరగోళంలో పడేసిందని కూడా లైవ్ మింట్ కథనంలో పేర్కొంది.
గోవింద తనకంటే చాలా చిన్న వయసున్న మరాఠీ నటితో సన్నిహితంగా ఉంటున్నారనే కథనాలు కూడా ఇటీవల వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ప్రస్తుతానికి విడాకుల ప్రక్రియ గురించి గోవిందా కానీ, సునీత తరపున కానీ ఎవరూ స్పందించలేదని లైవ్ మింట్ తన కథనంలో పేర్కొంది. కోర్టు పత్రాల ఆధారంగా ఈ కథనం ప్రచురించినట్టు లైవ్ మింట్ పేర్కొంటోంది. హౌటర్‌ఫ్లై వివరాల ప్రకారం ఈ కేసు సీరియస్ గా కొనసాగుతోంది.