మళ్లీ వార్తల్లోకి వచ్చారు మాజీ ఎంపీ.. వైసీపీ నేత గోరంట్ల మాధవ్. ఇప్పటివరకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయనకు బెయిల్ రావటంతో జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచే నోటికి పని చెప్పటం షురూ చేశారు. పోలీసు కస్టడీలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ పై దాడి కేసులో అరెస్టు కావటం.. రిమాండ్ ఖైదీగా మాధవ్ జైల్లో ఉండటం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. ఆయనకు తాజాగా బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జైలు నుంచి విడుదలైన గోరంట్ల మాధవ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హత్యా రాజకీయాలు.. అక్రమ అరెస్టులు.. వైసీపీ నేతలను.. వైసీపీ శ్రేణుల పిక్క మీద వెంట్రుక కూడా పెరకలేరని మండిపడ్డారు. తరచూ నోటికి పని చెప్పే నేతగా పేరున్న గోరంట్లలో కించిత్ కూడా మార్పు రాలేదన్న విషయం.. ఆయన భాషలోనే అర్థమవుతుందని చెప్పాలి.
రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. వైసీపీ ఓడేది లేదని.. అదే సమయంలో కూటమి గెలిచేది ఉండదన్న గోరంట్ల.. ప్రతి రోజు ఒక రాజకీయ హత్య.. ఒక అక్రమ అరెస్టుతో రాష్ట్రాన్ని ఉక్కు పిడికిళ్లతో బిగించాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో గోరంట్ల మాధవ్ తో పాటు అరెస్టు అయి.. జైలుకు వెళ్లిన రమేశ్.. దామోదర్ తదితరులు కూడా జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చినంతనే నోటికి పని చెప్పిన గోరంట్ల మాధవ్.. రానున్న రోజుల్లో మరింత చురుగ్గా ఉంటారని చెబుతున్నారు.
సీఎం చంద్రబాబు ఆలోచన విధానాలకు ఇక నూకలు చెల్లాయి. అక్రమ అరెస్టులకు, తప్పుడు కేసులకు ఇకనైనా పుల్‌స్టాప్ పెట్టాలి. కూటమి పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ముందుకు వెళ్లాలి. అక్రమ అరెస్టులు చేయిస్తు్న్న సీఎం చంద్రబాబు నా పిక్క మీద వెంట్రుక కూడా పీకలేరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూటమి గెలిచేది లేదు, వైసీపీ ఓడేది లేదు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. అక్రమ అరెస్టులకు పుల్‌స్టాప్ పెట్టి పథకాల దృష్టి పెడితే మంచిది”- మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్