సైబర్ మోసాలను అరికట్టేందుకు టెలికాం విభాగం.. ‘ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్’ (ఎఫ్.ఆర్.ఐ)ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు, ఆర్థిక సంస్థలతో అప్పటికే పంచుకున్న సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది. అయితే ఈ వ్యవస్థను గూగుల్ పే ఇంకా దాని ప్లాట్ ఫామ్ లో అనుసంధానించలేదని డాట్ సంచలన వివరాలు వెల్లడించింది!
అవును… గత కొంతకాలంగా భారత్ లో మెజారిటీ చెల్లింపులు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ఫోన్ పే, గూఫుల్ పే, పేటీఎం ల ద్వారా మెజారిటీ యూపీఐ పేమెంట్స్ జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే అందులు మూడోవంతు యూపీఐ చెల్లింపులు అసురక్షితంగానే ఉన్నాయని డాట్ వెల్లడించింది.
ఈ సందర్భంగా స్పందించిన టెలికమ్యూనికేషన్ల విభాగం (డాట్) కార్యదర్శి నీరజ్ మిట్టల్… ఏదైనా మొబైల్ నంబరుకు డిజిటల్ చెల్లింపులను చేసే సమయంలో ఎఫ్.ఆర్.ఐ. టూల్ తనిఖీ చేస్తుందని.. ఆ సమయంలో ఏదైనా మొబైల్ నంబరు వల్ల ఆర్థిక మోసం జరిగేందుకు ఎంత అవకాశం ఉందో ఈ రిస్క్ ఇండికేటర్ పాప్ అప్ లను చూపిస్తూ.. వాటిని మీడియం, హై, వెరీ హై గా వర్గీకరిస్తుందని తెలిపారు.
అయితే ‘గూగుల్ పే’ మాత్రం ఇప్పటివరకు ఈ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ వ్యవస్థలోకి చేరలేదని.. దీంతో ఆ ఫ్లాట్ ఫామ్ నుంచి జరుగుతున్న లావాదేవీలకు ఎలాంటి రక్షణ ఉండటం లేదని నీరజ్ మిట్టల్ వ్యాఖ్యానించారు. ఫలితంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ)ని ఉపయోగించే భారతీయులలో దాదాపు మూడింట ఒక వంతు మంది అసురక్షితంగా ఉన్నారని అంటున్నారు!
వాస్తవానికి ఈ నెల 8న జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో.. ఫోన్ పే, పేటీఎం లతో పాటు డాట్ కు చెందిన బృందం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా… సుమారు రూ.125 కోట్ల ఆర్థిక మోస నష్టాలను నివారించడంలో ఎఫ్.ఆర్.ఐ. సహాయపడిందని ఫోన్ పే పేర్కొనగా… గత రెండు నెలల్లో రూ.68 కోట్లు ఆదా చేయడంలో అది సహాయపడిందని పేటీఎం తెలిపింది.
మరోవైపు గూగుల్ ఇండియా కోర్ లీడ్ ఫర్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పబ్లిక్ పాలసీ రాజేష్ రంజన్ స్పందిస్తూ… కంపెనీ ఇంటిగ్రేషన్ గురించి డాట్ తో చర్చలు జరుపుతోందని ధృవీకరించారు.