ఐటీకి కేంద్రంగా మరో సిలికాన్ వాలీగా బెంగళూరు ప్రసిద్ధి చెందిన సంగతి విధితమే. మూడు దశాబ్దాలుగా బెంగళూరు ఐటీ వెళ్లూనుకుంది. అతి పెద్ద ఐటీ సెక్టార్ ఇక్కడ నడుస్తోంది. కేంద్రానికి ఐటీ రంగం నుంచి అత్యధిక పన్నులు ఇక్కడ నుంచి వెళ్తున్నాయి. ఒక అంచనా ప్రకారం చూస్తే నలభై శాతం వాటా బెంగళూరు ఐటీ ఫీల్డ్ దే అని చెబుతారు.
ఇక బెంగళూరు ఐటీ సెక్టార్ లో దేశం నలుమూల నుంచి పాతిక లక్షల నుంచి ముప్పయి లక్షల మంది దాకా పనిచేస్తున్నారు. అలాగే విదేశాల నుంచి మరో రెండు నుంచి మూడు లక్షల మంది దాకా పనిచేస్తున్నారు. ఐటీ కేరాఫ్ గా బెంగళూరు నగరం విరాజిల్లుతోంది. సౌత్ ఇండియాలో అయితే బెంగళూరు ని మించిన ఐటీ మేటి నగరం మరొకటి లేదని కూడా ఆయా రంగానికి చెందిన నిపుణులు చెబుతూ ఉంటారు.
ఇక దేశంలోకి ఏ ఐటీ పరిశ్రమ వచ్చినా దక్షిణాదిన అయితే బెంగళూరు ని దాటిపోయిన దాఖలాలు అయితే లేవు. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇతర అవకాశాలు వాతావరణం కానీ ఇవన్నీ ఐటీ పరిశ్రమ స్థాపకులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూంటాయి. అలాంటిది అతి పెద్ద ఐటీ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ డేటా సెంటర్ ఏపీకి అందులోనూ విశాఖకు వచ్చేసింది అంటే దాని మీద ఇపుడు బెంగళూరు లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. బెంగళూరు ని దాటుకుని మరీ విశాఖకు ఏ విధంగా ఇంత పెద్ద సంస్థ వెళ్ళిపోయింది అన్నది బిగ్ డిబేట్ గా మారింది.
బెంగళూరు కి పోటీగా విశాఖ మారుతోందని విపక్షాలు అంటున్నారు. సౌత్ ఇండియా సిలికాన్ వాలీగా పేరు గడించిన బెంగళూరు కి అదంతా గత వైభవం అని కూడా విమర్శిస్తున్నారు. పాడైన రోడ్లు, గుంతల దారులు హెవీ ట్రాఫిక్ వాతావరణం లో మారిన నేపధ్యం, కాంగ్రెస్ ప్రభుత్వం తీరు తెన్నులూ వారి ఐటీ పాలసీల విధానాలు ఇవన్నీ కూడా ఐటీ పరిశ్రామలు బెంగళూరు కి దక్కకుండా చేస్తున్నాయని బీజేపీ సహా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఏకంగా లక్షలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందుతాయని అలాగే లక్షా 30 వేల కోట్ల భారీ పెట్టుబడులతో వచ్చిన గూగుల్ డేటా సెంటర్ విశాఖకు వెళ్ళిపోయిందని అంటున్నరు. ఎంతో మంచి అవకాశాన్ని ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాడు చేసుకుందని కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.
అత్త మీద కోపం దుత్త మీద అన్నట్లుగా గూగుల్ డేటా సెంటర్ తమకు దక్కకుండా పోయింది అన్నది ఒకటి అయితే విపక్షం ఏకి పారేస్తోంది అన్నది మరోటిగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు ఉందని అంటున్నారు. దాంతో వారు తమ బాధను కక్కలేక మింగలేక అన్నట్లుగా వ్యక్తం చేయలేకపోతున్నారు అని అంటున్నారు నారా లోకేష్ తాజాగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రానున్న రోజులలో బెంగళూరు లోని ఐటీ కంపెనీలలో కొన్ని ఏపీకి వస్తాయని వ్యాఖ్యానించారు. దాని మీద కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ అలాంటిదేమీ ఉండదని సమర్ధించుకున్నారు. అంతే కాదు తమ వద్దకే అన్ని ఐటీ పరిశ్రమలు వస్తాయని బెంగళూరు ని దాటి ఎవరూ పోరని నిబ్బరం ప్రదర్శించారు. ఇక మరో మంత్రి ప్రియాంక్ ఖర్గె అయితే ఏపీ ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయలు భారీ రాయితీలు ఇచ్చి గూగుల్ ని తెచ్చుకుందని తాము అన్ని భారీ రాయితీలు ఇస్తే తమ ఖజానా దివాళా తీసిందని ప్రతిపక్షాలు అంటాయని హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి విశాఖ గూగుల్ డేటా సెంటర్ కాదు కానీ బెంగళూరు కి ఆ సెగ తాకుతోంది అని అంటున్నారు.