వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి పులివెందులకు ఫార్చునర్ వాహనంలో తరలిస్తున్న రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సేల్స్ టాక్స్ అధికారులు సీజ్ చేశారు. అర్ధరాత్రి హైదరాబాదు నుంచి బిల్లులు లేకుండా బంగారం తరలిస్తున్నారనే సమాచారంతో అధికారులు కాపు కాసి బంగారాన్ని పట్టుకున్నారు.
బంగారు ఆభరణాలకు సంబంధించి ఎలాంటి బిల్లులూ చూపకపోవటంతో సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె వద్ద వాహనాన్ని ఆపగా, 6 సూట్ కేసుల్లో రెండు కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు వెల్లడించారు.
పులివెందులకు చెందిన జగదీశ్ అనే వ్యక్తి వీటిని తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులివెందులలోని బంగారు దుకాణాలకు వీటిని తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. వీటికి సంబంధించిన బిల్లులు వేరేచోట ఉన్నాయని నిందితులు చెప్పడంతో సీజ్ చేసిన బంగారాన్ని ఐటీ శాఖ అధికారులకు అప్పగించనున్నారు.