హైదరాబాద్ నగరంలో చిరుత కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం సమయంలో గోల్కొండ కోట సమీపంలోని ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతంలో చిరుత సంచరిస్తుండగా స్థానికులు గుర్తించారు. ఆకస్మాత్తుగా ఓ అడవి జంతువు నివాస ప్రాంతానికి వస్తే ఎలా ఉంటుంది.. అచ్చం అలానే ఒక్కసారిగా ఆ పరిసరాలు ఉలిక్కిపడ్డాయి. చిరుతను చూసిన వారు ఆందోళనతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే స్పందించి, అటవీ శాఖ సహకారంతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
చిరుతను అక్కడ కాసేపు చూసిన తర్వాత అది అక్కడినుంచి పారిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దీంతో గోల్కొండ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురైంది. ఇప్పటికే పోలీసులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద జంతువుల కదలికలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
ఇదే తరహా ఘటన నార్సింగి పరిధిలో ఉన్న మంచిరేవుల గ్రామంలోని వ్యాస్ నగర్ క్యాంపస్‌లో కూడా ఇటీవల చోటుచేసుకుంది. అక్కడ సైతం చిరుత కనిపించడంతో అధికారులు సీసీ కెమెరాల సాయంతో జాడను గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల అడవులకు దగ్గర ప్రాంతాల్లో చిరుతల సంచారం పెరుగుతోంది. ఇది కేవలం అడవుల సమస్య మాత్రమే కాదు, నగర శివార్లలో వేగంగా విస్తరిస్తున్న నివాస ప్రాంతాల వల్ల అడవి జంతువులకు మానవుల సమీపానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇటువంటి ఘటనలు నగరవాసుల్లో భయాన్ని కలిగిస్తున్నప్పటికీ, అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటూ నిపుణుల సహకారంతో జంతువుల జాడను పట్టుకోవడంలో నిమగ్నమయ్యారు. చిరుత ఆచూకీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.