గోదావరి పుష్కరాల కోసం కసరత్తు మొదలైంది. పెద్ద సంఖ్యలో వచ్చే యాత్రికులకు అనుగుణంగా ఏర్పాట్ల పైన ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తోంది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాధమిక నివేదికలు రెడీ అయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందు కోసం అంతర్జాతీయ కన్సెల్టెన్సీ సంస్థకు బాధ్యతలు అప్పగించనున్నారు.
2027 లో గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. పుష్కరాలకు వచ్చే లక్షలాది యాత్రికులను దృష్టిలో పెట్టుకొని కల్పించాల్సిన సౌకర్యాలపై కసరత్తు చేస్తున్నారు. భక్తులు వచ్చే రహదారి మార్గాలు, విడిది సౌకర్యాలు, సేద తీరేందుకు ప్రత్యేక శిబిరాలు, రవాణా సౌకర్యం, పార్కింగ్ వ్యవస్థ, స్నానఘట్టాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఏర్పాట్లు, రద్దీ నియంత్రణపై దృష్టి సారిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో మాదిరిగానే ఇక్కడ కూడా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. కుంభమేళా ఏర్పాట్ల బాధ్యత అంతర్జాతీయ సంస్థ అయిన ఈవై(ఎర్నెస్ట్ అండ్ యంగ్) సంస్థ కుంభమేళాలో భక్తుల రద్దీ నియంత్రణపై ప్రణాళికలు రూపొందించింది. ఈ సంస్థ ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తారు. సంస్థ ప్రతినిధులు పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రణాళిక రూపొందించారు.
గోదావరి పుష్కరాల కోసం యాత్రికులు నగరానికి వచ్చే మార్గాలు, అక్కడ నుంచి ఘాట్‌ల వద్దకు రావడం, స్నానాలు, తిరిగి వెళ్లే వరకు అడుగడుగునా పూర్తి భద్రతతో తీసుకొనే చర్యలపై ప్రతిపాదనలు సమర్పించనుంది. అందులో భాగంగా పోలీసులు, రెవెన్యూ, ర.భ, వైద్య, ఆరోగ్య, జలవనరుల శాఖలు, మున్సిపల్ పరిధిలో చేపట్టాల్సిన విధులపై ముందుగానే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఇప్పటికే ప్రభుత్వం 2027లో గోదావరి పుష్కరాల కు రూ.904 కోట్లతో ఘాట్‌ల విస్తరణ చేపట్టనున్నారు. పుష్కరాలు జరిగే ఐదు జిల్లాల్లో ఆలయాల మరమ్మతుల కోసం నిధులు కేటాయించారు. పుష్కరాలు ఏపీలో అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల పరిధిలో ప్రవహిస్తుంది. గత పుష్కరాల్లో 202 ఘాట్లు ఏర్పాట్లు చేశారు. ఇందులో కుడివైపు 127, ఎడమవైపు 75 ఘాట్లు ఉన్నాయి. ఈసారి మరిన్ని ఘాట్లు పెంచేందుకు కసరత్తు జరుగుతోంది.