పర్యాటక ప్రాంతమైన గోవాలో ఘోరం చోటు చేసుకుంది. ఇక్కడి ఒక దేవాలయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఏడుగురు దుర్మణం పాలు కాగా.. యాభై మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా మారింది. ఈ విషాదకర ఉదంతం శిర్గావ్ లోని లైరాయ్ ఆలయంలో చోటు చేసుకుంది. 7 మరణించటంతో పాటు యాభై మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. మృతుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.
గోవాలోని శ్రీలైరాయ్ ఆలయంలో ఈ రోజు నుంచి వార్షిక జాతర మొదలైంది. లైరా దేవి ఆలయంలో ప్రతి ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజున జాతర వైభవంగా జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గోవా నలుమూలల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. ఈ ఆలయంలో దశాబ్దాలుగా ఒక ఆచారం ఉంది. నిప్పుల మీద నడిచే ఈ ఆచారానికి ఈ తెల్లవారుజామున పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. దీంతో.. రద్దీ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. భక్తుల మధ్య చోటు చేసుకున్న తొక్కిసలాటతో గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో.. ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. అత్యవసర సేవల సిబ్బంది.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. జాతర సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారన్న విషయం తెలిసినప్పటికి ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయకపోవటం కూడా ఈ విషాదానికి కారణంగా చెబుతున్నారు.