అనుష్క చాలాకాలం తర్వాత ఫిమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఘాటి అనే సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటించగా, చైతన్య రావు, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు. క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డి నిర్మాతగా, యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా అనుష్క వైలెంట్ యాంగిల్ చూపిస్తామని ప్రచారం గట్టిగా చేయడంతో, సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తికరంగా ఎదురు చూశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
ఘాటి కథ: కథ అంతా ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో జరుగుతూ ఉంటుంది. అక్కడ తూర్పు కనుమల్లో ఉన్న గంజాయి సాగు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలందరూ గంజాయి సాగు చేసి, వాటిని ఎక్స్‌పోర్ట్ చేయడానికి కాష్టాల నాయుడు (రవీంద్ర విజయ్), కుందుల నాయుడు (చైతన్య రావు) కింద పని చేస్తూ ఉంటారు. అయితే, అలా ఘాటీలుగా పనిచేసే దేశీ రాజు (విక్రమ్ ప్రభు), శీలావతి (అనుష్క) ఆ పని మానేసి వేరే పని చేస్తూ బతుకుతూ ఉంటారు. అయితే, వాళ్లు తిరిగి మళ్లీ గంజాయి స్మగ్లింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్మగ్లింగ్ మళ్లీ ఎందుకు చేయాల్సి వచ్చింది? జనజీవన స్రవంతిలోకి వెళ్లి సాధారణ జీవితం గడుపుతున్న వారు మళ్లీ గంజాయి స్మగ్లింగ్‌లో ఏం చేశారు? ఒక బాధితురాలు క్రిమినల్‌గా ఎలా మారింది? చివరికి లెజెండ్‌గా ఎలా అవతరించింది? అనేది ఈ సినిమా కథ.
విశ్లేషణ: ఈ మధ్యకాలంలో పుష్ప లాంటి స్మగ్లింగ్ ఆధారిత సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఆ సినిమా మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. ఇప్పుడు దాదాపుగా ఈ సినిమా కూడా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలోనే రాసుకున్నాడు దర్శకుడు క్రిష్. తన స్నేహితుడు, సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం మీద చేసిన రీసెర్చ్ ఆధారంగా ఈ కథ రూపుదిద్దుకుంది. అయితే, సినిమా చూసిన తర్వాత నాకు వ్యక్తిగతంగా అనిపించిన భావన ఏమిటంటే, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లింగ్ గ్లోరిఫై చేసి సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటాడు. కానీ ఇక్కడ గంజాయి స్మగ్లింగ్ ద్వారా ఎదురవుతున్న దారుణాలను చూసి, ఆ స్మగ్లింగే ఆపేయాలని ఘాటి వ్యవస్థ స్మగ్లింగ్ చేయడం నిలిపివేస్తే బాగుపడుతుందని ఒక నిర్ణయం తీసుకుంటుంది అనుష్క. అదే ప్రధానమైన తేడా. ఒక బాధితురాలు క్రిమినల్‌గా మారి, తర్వాత ఆ దారిని వదిలేయడమే ఈ ఘాటి ముఖ్య ఉద్దేశం. అయితే, క్రిష్ తీసుకున్న గ్రాండియర్ అయితే చాలా బాగుంది. అనుష్కను ప్రధాన పాత్రలో పెట్టుకుని రాసుకున్న ఈ సినిమా ఆద్యంతం హై ఫీల్ ఇచ్చేలా రాసుకున్నాడు. ముఖ్యంగా అనుష్క ఫ్యాన్స్ అందరూ ఫుల్ మీల్స్ లాగా ఫీల్ అయ్యే ఫైట్ సీన్స్ దానికి అదనంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా జనజీవన స్రవంతిలోకి వచ్చి సాధారణ పనులు చేసుకునే హీరో, హీరోయిన్లు మళ్లీ గంజాయి స్మగ్లింగ్ బారిన ఎందుకు పడ్డారు అనేది ఆసక్తికరంగా చూపించారు. ఆ తర్వాత విలన్ గ్యాంగ్‌తో మొదలైన వైరం ఎలాంటి పరిస్థితులకు దారితీసింది అనేది కూడా ఆసక్తికరంగా రాసుకున్నారు. కథ పెద్దగా లేదు, కానీ కథనంతో నడిపించే ప్రయత్నం చేసి చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అయితే, హై మూమెంట్స్ చాలా ఉన్నా, కొన్ని బాగా వర్కవుట్ అయ్యాయి. కానీ ఇంకా వర్కౌట్ అయి ఉంటే సినిమా లెవెల్ వేరేలా ఉండేది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ మంచి ఫీల్ ఇచ్చినా, సెకండ్ హాఫ్ విషయంలో కొంత డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుంది.
నటీనటులు:
ఈ సినిమా అనుష్క వన్ ఉమెన్ షో. సమర్థవంతమైన శైలిలో స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. డైలాగ్స్‌తోనే కాదు, ఫైట్స్‌తో కూడా అదరగొట్టింది. ఆమె చేస్తున్న ఫైట్స్‌కి థియేటర్లో మంచి అప్లాజ్ లభిస్తుంది. విక్రమ్ ప్రభు పాత్ర బాగుంది. జగపతిబాబు పాత్ర కూడా చాలా అద్భుతంగా రాసుకున్నారు. చైతన్య రావు తనదైన శైలిలో నటించి ఆకట్టుకున్నాడు. రవీంద్ర విజయ్ పాత్రలో మెరిశాడు. మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే, దర్శకుడు క్రిష్ రచయితగా కూడా మరోసారి తనదైన మార్క్ వేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, క్రిష్ గత చిత్రాల కంటే ఇది చాలా భిన్నం. ఎక్కువ కమర్షియల్‌టీ మీద ఫోకస్ చేశారు. సీజీల మీద ఇంకా ఫోకస్ చేసి ఉండొచ్చుం సాయి మాదవ్ డైలాగ్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. సాగర్ సంగీతంతో పాటు నేపథ్య సంగీతం సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఎడిటింగ్ విషయంలో ఇంకా తీరు తీసుకుని ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్- 2.5/5