ఏపీని అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో పెట్టాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… టూరిజంలోనూ ఏపీని దేశంలోనే టాప్ ప్లేస్ లో చూడాలని తపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల విజయవాడలో టూరిజం కాన్ క్లేవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ పర్యాటకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు సిద్ధం ఆని బాబా రాందేవ్ కీలక హామీలిచ్చారు.
ఈ సందర్భంగా.. శుక్రవారం కడప జిల్లా, జమ్మలమడుగు ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు… ‘ఎక్స్’ లో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టి, పలు ఫోటోలు షేర్ చేశారు. ఇందులో భాగంగా… “అద్భుతమైన దృశ్యం, కాదా? ఇది ఎక్కడ ఉందో మీరు ఊహించగలరా? ఇక్కడ ఒక సూచన ఉంది: దీనిని ‘గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు” అని రాస్తూ.. కొన్ని ఫోటోలు షేర్ చేశారు.
అవును… కడప జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు కొన్ని ఆసక్తికర ఫోటోలు షేర్ చేశారు. అవి ఎక్కడివో గుర్తించమని చెబుతూ.. దీన్ని గ్రాండ్ కేనియన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని హింట్ ఇచ్చారు. అది మరేదో కాదు.. గండికోట అద్భుత దృశ్యం! ఇది జమ్మలమడుగు నుండి 15 కి.మీ దూరంలో ఉండి.. ఎంతో చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ సందర్భంగా.. గండికోటను అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు తయారు చేసినట్లు చంద్రబాబు వివరించారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులకు ప్రత్యేక సహాయం (సాస్కీ) కింద రూ.78 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఈజ్ మై ట్రిప్, హిల్టన్ హోటల్స్ సహా వివిధ సంస్థలు ఏపీ టూరిజం కార్పొరేషన్ తో రూ.500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి.
ఇందులో… గండికోట, శ్రీశైలం, మంత్రాలయం, తిరుపతి తదితర ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణం, సాహస క్రీడలు, హైరోప్, కయాకింగ్, జెట్ స్కీయింగ్ వంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గండికోటను సందర్శించారు.. అక్కడున్న పర్యాటకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఇప్పుడవీ వైరల్ గా మారాయి. మరోవైపు పారిశ్రామికంగా సీమ అభివృద్ధికి పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రస్తుతం సీమలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ గా మార్చడానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ క్రమంలో… అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయాన్ని శనివారం చెల్లిస్తామని, కేంద్రం ఇచ్చే రూ.2 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 వేలు కలిపి జమ చేస్తామని తెలిపారు.