ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం కేసులో తుది తీర్పుతో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో సాధారణ ఖైదీ జీవితాన్ని గడుపుతున్నారు. గత మంగళవారం మే 6న కోర్టు తుది తీర్పు వెలువరించిన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ జైలుకు చేరుకున్నారు.తాజా పరిణామాల ప్రకారం.. గాలి జనార్దన్ రెడ్డి సాధారణ తెల్లటి జైలు దుస్తుల్లో కన్పిస్తున్నారు. గతంలో 2011లో ఇదే చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు, కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. అయితే ఇప్పుడు దోషిగా శిక్ష పడినందున, ఆయనకు ఎలాంటి ప్రత్యేక వసతులు లేవని, ఇతర ఖైదీల మాదిరిగానే సాధారణ దుస్తులు ధరించి, సాధారణ బ్యారక్‌లో ఉంటున్నారని సమాచారం.
ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలితో పాటు దోషులుగా నిర్ధారించబడిన శ్రీనివాస రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లను కూడా ఆయనతో పాటు అదే బ్యారక్‌లో ఉంచినట్లు తెలుస్తోంది.గురువారం జైలులో జరిగిన ములాఖత్‌లో గాలి జనార్దన్ రెడ్డిని ఆయన భార్య, కూతురు, సోదరుడు కలిశారు. సాధారణ జైలు దుస్తుల్లో ఉన్న ఆయన్ను చూసి భార్య, కూతురు తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
కాగా తనకు విధించిన జైలు శిక్షను తగ్గించాలని గాలి జనార్దన్ రెడ్డి కోర్టును అభ్యర్థించినా, న్యాయమూర్తి అందుకు అంగీకరించలేదని తెలుస్తోంది. 2009లో ప్రారంభమైన ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గతంలోనూ కొంతకాలం జైలు శిక్ష అనుభవించారు. ఈ కేసులో గాలితో పాటు మరో ముగ్గురు కూడా దోషులుగా నిర్ధారించబడ్డారు. తుది తీర్పు వెలువడిన నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి సాధారణ ఖైదీగా చంచల్‌గూడ జైలులో తన శిక్షను అనుభవిస్తున్నారు.ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి, ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపింది. క్రియాశీలక రాజకీయాలకు ఆయన శాశ్వతంగా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది.
మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కర్ణాటక అసెంబ్లీ నుంచి అనర్హత వేటుకు గురయ్యారు. ఓబుళాపురం మైనింగ్ అక్రమ తవ్వకాల కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడిన నేపథ్యంలో, కర్ణాటక అసెంబ్లీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఎంకే విశాలాక్షి ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.ప్రస్తుతం కొప్పళ జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గాలి జనార్ధన్ రెడ్డి, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) తరఫున పోటీ చేసి దాదాపు 8,000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ అన్సారీపై విజయం సాధించారు. గాలి జనార్ధన్ రెడ్డి 2022లో కేఆర్పీపీ పార్టీని స్థాపించి, ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. మైనింగ్ కుంభకోణంలో జైలు శిక్ష అనుభవించడానికి ముందు, ఆయన యడియూరప్ప ప్రభుత్వంలో కర్ణాటక పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 2015 నుండి బెయిల్‌పై ఉన్న ఆయన బీజేపీకి దూరంగా ఉంటూ వచ్చారు.
గంగావతి నియోజకవర్గ ఎమ్మెల్యే జి. జనార్ధన రెడ్డిని అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 191 (1) (ఈ) మరియు 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై ఆరు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేసినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ అనర్హత ఈ నెల 6వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. దీంతో గంగావతి అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.