ప్రస్తుతం ఎక్కడ చూసినా దీపావళి పండుగ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సెలబ్రిటీలు ఒకరిని ఒకరు ఆహ్వానిస్తూ ఒకే చోట చేరి ఘనంగా ఈ దీపావళి వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తారలందరినీ ఒకేచోట చూసేసరికి అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా కొంతమంది సినీ తారలతో కలిసి తన ఇంట దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలుస్తోంది.
హీరో విశ్వక్ సేన్ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. అందులో తన చెల్లితో పాటు ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బ, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో పాటు మరికొంతమంది సినీ సెలబ్రిటీలు మెరిశారు. సన్నిహితులు, సెలబ్రిటీల నడుమ దీపావళి వేడుకలు ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు లవ్ ఎమోజిలను షేర్ చేస్తూ తారలందరినీ ఒకే చోట చూసేసరికి సంతోషంగా ఉంది.. పిక్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
హీరో విశ్వక్ సేన్ విషయానికి వస్తే.. సినిమా నటుడిగా, దర్శకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా తనకంటూ ఒక మంచి పేరు దక్కించుకున్నారు. 2017లో వెళ్ళిపోమాకే అనే సినిమాతో నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. 2019లో వచ్చిన ఫలక్ నుమా దాస్ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసి పాపులారిటీ దక్కించుకున్నారు. తర్వాత వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన తాజాగా ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనుదీప్ కె.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కయాదూ లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు. ఇకపోతే చివరిగా ఈయన నటించిన లైలా సినిమా పెద్దగా సక్సెస్ సాధించకపోవడంతో ఇప్పుడు ఫంకీ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి
మొదట నవంబర్ 14న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విడుదల తేదీపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మరొకవైపు ఇదే రోజు రోషన్ మేక నటించిన ఛాంపియన్ చిత్రంతో పాటు అడవి శేషు నటించిన డెకాయిట్ మూవీ కూడా ఇదే తేదీలలో విడుదల కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ డెకాయిట్ సినిమాను పోస్ట్ పోన్ చేసినట్లు సమాచారం. ఇకపోతే డిసెంబర్ 25న ఏ ఏ చిత్రాలు విడుదల కాబోతున్నాయి అనే విషయంపై ఇంకా స్పష్టత లేకపోవడంతో.. డిసెంబర్ 25న ఫంకీ సినిమాను విడుదల చేస్తే హాలిడేస్ కాస్త కలిసొస్తాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. పూర్తి కామెడీ ఎంటర్టైన్మెంట్ తో రాబోతున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అందుకోవాలని అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.