ఈ రోజుల్లో అన్ని వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ రూ.100కు రాని ఈ రోజుల్లో… రూ.100కే ఇల్లు ఇస్తామంటోంది ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రజల కోసం ఈ భారీ చీఫ్ ఆఫర్ ను తెరపైకి తెచ్చింది. అయితే… ఓ చిన్న కండిషన్ మాత్రం పెట్టింది. అందుకు సరేనంటే… రూ.100కే మీకు ఇల్లు సొంతం అయిపోతుందని తెలిపింది.
అవును… జీవితంలో ఎప్పటికైనా సొంతిల్లు కొనుగోలు చేయాలనే ఆశ అందరికీ ఉంటుందనే సంగతి తెలిసిందే! చాలామంది.. ఉద్యోగంలో ఉన్నంత కాలం ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ.. రిటైర్మెంట్ అనంతరం మిగతా జీవితాన్ని సొంత ఇంటిలోనే గడపాలని కలలు కంటారు.. ఆ దిశగా ప్లాన్ చేసుకుంటారు. ఈ క్రమంలో సొంతింటి కల నిజంచేసుకునే అవకాశం ఫ్రాన్స్ తెరపైకి తెచ్చింది.
వివరాళ్లోకి వెళ్తే… ఫ్రాన్స్ లోని పుయ్-డి-డోమ్ ప్రాంతంలో ఉన్న అంబర్ట్ పట్టణంలో రోజురోజుకు జనాభా తగ్గిపోతుందట. దీంతో… తగ్గిపోతున్న జనాభాను పునరుద్ధరించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ వినూత్న ప్రయత్నం చేస్తున్నట్లు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా.. కేవలం ఒక్క యూరో (రూ.100) చెల్లించి.. ఇల్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.
ప్రజలు నగరాల వైపు తరలివెళ్లడంతో 19వ శతాబ్దం నుంచి ఈ ప్రాంతంలో జనాభా తగ్గుతూ వస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పట్టణంలో 6,500 మంది నివసిస్తున్నారట. ఈ క్రమంలో… జనాభాను మరింత పెంచడానికి అక్కడి అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగానే ప్రజలకు రూ.100కే ఇళ్లు కొనుగోలు అవకాశం కల్పిస్తున్నారు.
అంతవరకూ బాగానే ఉంది కానీ… ఇక్కడే ఓ కండిషన్ ఉంది. అదేమిటంటే.. ఇల్లు కొనుగోలుకు కేవలం రూ.100 సరిపోతుంది కానీ… శతాబ్దాల నాటి అక్కడి భవనాలను పునరుద్ధరించడానికి మాత్రం సుమారు రూ.20 నుంచి రూ.50 లక్షలు ఖర్చయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సమయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా… ఇంటిని కొనుగోలు చేసే సమయంలోనే కొనుగోలుదారులు ఆ ఇంటి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటామని తెలియజేస్తూ హామీ ఇవ్వాల్సి ఉంటుందట. ఆ కండిషన్ కు ఓకే అంటే.. వెంటనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసేస్తారన్నమాట. అలా అని ఈ ఆఫర్ కేవలం ఫ్రాన్స్ ప్రజలకే అనుకుంటే పొరపాటే. విదేశీయులు కూడా అంబర్ట్ లో ఇళ్లను కొనుగోలు చేయవచ్చు.సో… మీరు కూడా ఫ్రాన్స్ లో ఇల్లు కొనుగోలుకు ఆసక్తి కలిగి ఉంటే… ఈ ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తున్న అంబర్ట్స్ టౌన్ హాల్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది!