తిరుమల పరకామణిలో రెండున్నరేళ్ల కిందట జరిగిన చోరీ వ్యవహారంలో ఫిర్యాదుదారు, కీలక సాక్షి, గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) సీఐ సతీశ్‌కుమార్ ఈ నెల 13న అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు.అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్‌లో జీఆర్‌పీ సీఐగా ఆయన పనిచేస్తున్నారు.తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఆయన మృతదేహం కనిపించింది.గుత్తి రైల్వే పోలీసులు, తాడిపర్తి పోలీసులు ఈ ఘటన వివరాలను బీబీసీకి వెల్లడించారు.తిరుపతిలో ఈనెల 14న శుక్రవారం జరిగే పరకామణి కేసు విచారణ కోసం సతీశ్ కుమార్ గురువారం రాత్రి గుంతకల్లు నుంచి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. ఏ1 బోగీలో 29వ నెంబర్ బెర్తు ఆయనకు రిజర్వ్ అయింది.
శుక్రవారం ఉదయం తాడిపత్రి – గుత్తి ప్రధాన రైల్వే రహదారిలోని కోమలి – జూటూరు రైల్వేస్టేషన్ల అప్‌డౌన్ ట్రాక్‌ల మధ్య ఆయన మృతదేహం కనిపించింది.అర్ధరాత్రి దాటిన తరువాత (శుక్రవారం తెల్లవారుజామున 1.45 నిమిషాల సమయంలో) రైలు నుంచి కింద పడిపోయినట్టు ప్రాథమికంగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.అయితే, ఇది ప్రమాదమా, హత్యా లేక ఆత్మహత్యా ? అన్న దానిపై విచారణ చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.సతీశ్ కుమార్ సోదరుడు హరి తన అన్నను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారంటూ ఫిర్యాదు ఇవ్వడంతో ఆ దిశగా కూడా విచారిస్తున్నామని గుత్తి రైల్వే పోలీసులు, తాడిపర్తి రూరల్ పోలీసులు తెలిపారు.
శుక్రవారం ఉదయం 9.30కు రైల్వే పాయింట్స్‌మన్‌లు తాడిపత్రి మండలం కోమలి గ్రామ సమీపంలోని రైలు పట్టాల పక్కన సతీశ్‌కుమార్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు.పాకెట్‌లో ఉన్న ఐడెంటిటీ కార్డు ఆధారంగా మృతి చెందింది జీఆర్పీ సీఐ సతీశ్‌కుమార్‌గా గుర్తించామని గుత్తి జీఆర్‌పీ సీఐ అజయ్‌కుమార్ తెలిపారు.డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలను రంగంలోకి దింపి ఆధారాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని చెప్పారు.ఆయన సోదరుడు హరి ఫిర్యాదు మేరకు హత్యగా అనుమానాలు రావడంతో కేసును తాడిపర్తి రూరల్ పోలీసులకు బదిలీ చేశామని అజయ్‌కుమార్ చెప్పారు.2023 ఏప్రిల్ 29న తిరుమలలో పరకామణి (నోట్లు, నాణేల లెక్కింపు) సందర్భంగా విదేశీ కరెన్సీని దొంగతనం చేస్తున్నారంటూ ఉద్యోగి రవికుమార్‌ను అప్పట్లో టీటీడీ అసిస్టెంట్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏవీఎస్ఓ)గా ఉన్న సతీశ్ కుమార్ పట్టుకున్నారు.
విదేశీ కరెన్సీని లెక్కిస్తూ.. అందులో కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న అరల్లో రవికుమార్ దాచుకున్నారని సతీశ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో 2023 మే 30న రవికుమార్‌పై చార్జ్‌షీట్ ఫైల్ అయిందిఅయితే, 2023 సెప్టెంబర్ 9న ఈ కేసు లోక్ అదాలత్‌లో రాజీ అయ్యింది. ఈ రాజీ వ్యవహారంలో సతీశ్ కుమార్ కీలకంగా వ్యహరించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరకామణి కేసుపై మళ్లీ విచారణ చేపట్టింది.కేసు విచారణను సీఐడీకి అప్పగించగా.. సతీశ్ కుమార్‌పైనా కేసు నమోదు చేశారు.ఈ కేసులో ఆయన కీలక సాక్షి కూడా.కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన సతీశ్ కుమార్ తొమ్మిదేళ్ల పాటు టీటీడీ ఏవీఎస్‌వోగా విధులు నిర్వర్తించారు.పరకామణి చోరీ ఘటనలో ఫిర్యాదు తర్వాత ఏవీఎస్‌వో హోదాలోనే 2023 జూన్‌లో తిరుచానూరుకు బదిలీ అయ్యారు.
ఈ ఏడాది మే నెలాఖరున చిత్తూరు ఏఆర్‌కు వచ్చారు. మూడు నెలల కిందట డిప్యుటేషన్‌పై గుంతకల్లు రైల్వే సీఐగా బదిలీ అయ్యారు.ఈ నెల 6న సతీశ్ కుమార్ సీఐడీ అధికారుల విచారణకు హాజరయ్యారు.తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో విచారణకు హాజరు కాగా, ఈ నెల 14న మరోసారి విచారణకు రావాలని సీఐడీ అధికారులు ఆదేశించారు.ఈ సమయంలోనే సతీశ్ కుమార్ మృతి కలకలం రేపింది.
సతీశ్ కుమార్ మృతిపై ఎన్నో అనుమానాలు వస్తుండటంతో విచారణలో భాగంగా ఘటనాస్థలంలో రన్నింగ్ రైలు నుంచి బొమ్మలను తోసేసి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నామని గుత్తి సీఐ రామారావు బీబీసీకి తెలిపారు.సతీశ్ బెర్త్ నెం.29 కాగా, 11వ నెంబర్ వద్ద లగేజీ బ్యాగ్ దొరికిందనీ, సతీశ్ బ్యాగ్ అక్కడికి ఎలా చేరిందనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని తాడిపర్తి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి అన్నారు.
రాయలసీమ ఎక్స్‌ప్రెస్ సిబ్బంది, బెడ్‌రోల్ అటెండర్లను కూడా ప్రశ్నిస్తున్నామని తెలిపారు.అలాగే పోస్ట్‌మార్టం రిపోర్ట్, కాల్ డేటా ఆధారంగా విచారణ చేస్తున్నామని చెప్పారు.కాగా, సతీశ్ అనుమానాస్పద మృతి ఘటన రాజకీయ రంగు పులుముకుంది.సతీశ్ మృతి వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించగా, అది ప్రభుత్వ హత్యగా వైసీపీ విమర్శిస్తోంది.’వైసీపీ నేతల హస్తం’సతీశ్‌ది హత్యేనని, దీని వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని శాప్ చైర్మన్, తిరుపతికి చెందిన టీడీపీ నేత రవినాయుడు ఆరోపించారు.వైసీపీ హయాంలో రవికుమార్‌ను కాపాడేందుకు కేసును రాజీ చేసుకోవాలంటూ ఆయనపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని, లేదంటే పరకామణి చోరీ ఘటనలో కోర్టులో రాజీ చేసుకునే సాహసం ఆ స్థాయి అధికారి చేసే అవకాశమే లేదని రవి నాయుడు అన్నారు.
ఇప్పుడు విచారణ జరుగుతోన్న సమయంలో పరకామణి చోరీ కీలక పాత్రధారులు, సూత్రధారులు ఈ కేసు నుండి బయటపడేందుకు కీలక సాక్షిగా ఉన్న సతీశ్ కుమార్‌ను హత్య చేసి, తాడిపత్రిలోని రైల్వే ట్రాక్‌పై మృతదేహాన్ని పడేశారని ఆయన ఆరోపించారు.కచ్చితంగా సతీశ్ కుమార్ మృతిలో కుట్ర ఉందని ఆయన అన్నారు.’అది ప్రభుత్వ హత్య’మరోవైపు సతీశ్ కుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు.ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడి ఉంటారనీ, సతీశ్ కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.సతీశ్ కుమార్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని కరుణాకర్ రెడ్డి అన్నారు.


















