ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీలో చదువుతున్న 21 మంది భారతీయ విద్యార్థులు అకస్మాత్తుగా జరిగిన ఘోర అగ్ని ప్రమాదంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారు ఉంటున్న టల్లహస్సీ అపార్ట్‌మెంట్‌లో సంభవించిన ఈ భారీ ప్రమాదంలో వారి సామాను, ముఖ్యమైన పత్రాలు, రోజువారీ అవసరాల వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు గాయాలపాలవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఈ దుర్ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రమైన కాలిన గాయాలతో గైన్స్‌విల్లేలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అగ్నిప్రమాదం నుండి తప్పించుకునే క్రమంలో మరికొంతమంది విద్యార్థులకు కాళ్లు విరగడం, వెన్ను, మెడకు గాయాలు కావడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. అపార్ట్‌మెంట్ మంటల్లో వారి ముఖ్యమైన పత్రాలు (పాస్‌పోర్ట్‌లు, వీసాలు), ల్యాప్‌టాప్‌లు, దుస్తులు, యూనివర్శిటీకి సంబంధించిన వస్తువులు వంటివి ఏవీ మిగలకుండా పూర్తిగా భస్మమయ్యాయి.
ఈ కఠిన సమయంలో భారతీయ కమ్యూనిటీ అండగా నిలబడింది. ఇండియా అసోసియేషన్ ఆఫ్ టల్లహస్సీ (IATLH), ఇన్ సాట్ (INSAT) సంస్థలు వెంటనే ముందుకు వచ్చి బాధితులైన విద్యార్థులకు సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాయి. విద్యార్థులకు ఆహారం, దుస్తులు, శీతాకాల దుస్తులు, రోజువారీ అవసరాల వస్తువులను అందించేందుకు.. వారి పునరుద్ధరణకు మద్దతుగా విరాళాలు సేకరిస్తున్నాయి. అమెరికాలోని భారతీయులు, స్థానికులు ఈ క్లిష్ట పరిస్థితిలో మన విద్యార్థులకు సహకరించాలని ఈ సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఇటీవలి నెలల్లో అమెరికాలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగులతో సంబంధమైన ప్రమాదాలు, మృతి సంఘటనలు, నేరాల సంఖ్య పెరగడం భారతీయ సమాజాన్ని కలవరపెడుతోంది. ఉన్నత చదువుల కోసం, మంచి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు ఎదుర్కొంటున్న ఇలాంటి విషాదాలపై భారతీయ సమాజం, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిప్రమాదంలో సర్వస్వం కోల్పోయి, శారీరక, మానసిక గాయాలతో సతమతమవుతున్న ఈ 21 మంది విద్యార్థులకు కమ్యూనిటీ సపోర్ట్ అత్యంత కీలకం. వారు తిరిగి తమ జీవితాన్ని సర్దుబాటు చేసుకునేందుకు, ముఖ్యమైన పత్రాలను తిరిగి పొందేందుకు, చదువును కొనసాగించేందుకు ఆర్థిక, మానసిక మద్దతు అత్యవసరం. ప్రభుత్వాలు, సంఘాలు, యూనివర్శిటీ అధికారులు, సహచర విద్యార్థులు అంతా కలిసి ఈ బాధితులకు అండగా నిలవాలని సమాజం కోరుకుంటోంది.















