తల్లితండ్రులు కావాలని ప్రతీ దంపతులకు ఉంటుంది! ఈ క్రమంలో కొంతమందికి మాత్రం ఈ వరం అంత సులువుగా దొరకదు! ఈ క్రమంలో సైన్స్ బాగా అభివృద్ధి చెంది.. దీనికి పలు రకాల ఆప్షన్స్ తెరపైకి వచ్చాయి. అయితే… ఈ విషయంలో దంపతుల బలహీనలను కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ క్యాష్ చేసుకుంటున్నాయని, అక్రమ పనులకు తెరలేపుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్ లో ఓ షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.
అవును… సికింద్రాబాద్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో.. సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు, వైద్యాధికారులు.. ఆ సెంటర్ నుంచి పలు కీలక పత్రాలతో పాటు వీర్య కణాల శాంపిల్స్ ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే… సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారని అంటున్నారు.
ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో అద్దె గర్భాల కోసం అక్రమంగా అండాలను, వీర్యాన్ని సేకరిస్తున్నట్టు దర్యాప్తులో తేలిందని అంటున్నారు. ఈ క్రమంలో.. ఇక్కడ సేకరించిన వీర్యకణాలు, అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్, మొదలైన రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు గుర్తించారని తెలుస్తోంది. అనుమతులు లేకుండానే ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలిందని అంటున్నారు.
ఈ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారం తెరపైకి రావడానికి కారణం… ఓ డీఎన్ఏ టెస్ట్ అని అంటున్నారు. రాజస్థాన్ కు చెందిన దంపతులు సంతానలేమితో మూడేళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ను సంప్రదించారు. దీంతో… సరోగసీ విధానం ద్వారా పిల్లలకు అవకాశం ఉందని డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. దీనికి.. రూ.30 లక్షలు ఖర్చవుతుందని వివరించారు. ఈ సమయంలో… బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ డీఎన్‌ఏ నమూనాలు సేకరించి, పోల్చాలని దంపతులు షరతు విధించారు. ఈ క్రమంలో… గత ఏడాది అగస్టులోనే మొత్తం డబ్బులు చెల్లించారు. ఈ క్రమంలో… ఈ ఏడాది బిడ్డ జన్మించింది. దీంతో… షరతు ప్రకారం డీఎన్‌ఏ పరీక్షలు చేయించాలని భార్యాభర్తలు డాక్టర్ నమ్రతను కోరారు.
అయితే… ఈ విషయంపై కదిలించిన ప్రతీసారీ నమ్రత వాయిదాలు వేస్తూ వస్తున్నారు. దీంతో.. ఆ దంపతులు ఢిల్లీలో డీఎన్‌ఏ పరీక్షలు చేయించుకొన్నారు. అయితే… వారి డీఎన్‌ఏతో బిడ్డ డీఎన్‌ఏ సరిపోలలేదు. ఈ నేపథ్యలో.. నమ్రతను సంప్రదించి, బిడ్డ తమకు జన్మించలేదని, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆ బిడ్డను ఇవ్వాలని చెప్పారు. దీంతో… తప్పును అంగీకరించిన డాక్టర్.. సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని అడిగారు. అయితే… తర్వాత నుంచి ఆచూకీ లేకుండా పోయారని అంటున్నారు. దీంతో… తాము మోసపోయామని భావించిన దంపతులు.. పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా ఆ ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో.. ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థ రీజినల్ మేనేజర్ పంకజ్ సోనీని నిందితుడిగా చేర్చారు. ఈ క్రమంలో… పంకజ్, శ్రీను, జితేందర్, సంపత్, శివ, మణికంఠ, బోరోను పోలీసులు అరెస్టు చేశారు! మరోవైపు… సికింద్రాబాద్ తోపాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఉన్న బ్రాంచీల్లోనూ పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది!