గడిచిన వారంలో ఏపీలో సంచలనంగా మారిన నకిలీ మద్యం ఉదంతానికి సంబంధించిన టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ నిర్ణయాన్ని తీసుకున్నారు. భారీ ఎత్తున మెషినరీలు ఏర్పాటు చేసి.. పేరున్న వివిధ బ్రాండ్ల ప్యాకింగ్ పోలిన నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేస్తున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహరం వెలుగు చూడటం.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అన్నింటికి మించి కూటమి సర్కారుకు ఒక తలపోటుగా మారింది. తప్పుడు పనులు చేసే వారు ఎవరైనా సరే.. ఉపేక్షించేది లేదని.. వారిపై చర్యలు పక్కా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటాయి. నకిలీ మద్యం ఎపిసోడ లోనూ ఆయన చర్యలు తీసుకున్నా.. మరింత వేగాన్ని ప్రదర్శిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకూ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఈ ఇద్దరు తెలుగు తమ్ముళ్లు ఏ స్థాయి నేతలు అన్నది చూస్తే.. ఒకరు తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి కాగా.. మరొకరు టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు.
వీరిద్దరు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీకి బలమైన నేతలుగా పేరుంది. వీరెంత భారీగా నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తున్నరన్న అంశంపై జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అధికార తెలుగుదేశంలోనూ సంచలన చర్చగా మారింది. నకిలీ మద్యం తయారీకి భారీ ఎత్తున ప్లాన్ చేసిన వైనం చూసిన వారంతా అవాక్కు అవుతున్నారు.భారీ యంత్రాలతో పలు జిల్లాలకు ఈ నకిలీ మద్యాన్ని సరపరా చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. నకిలీ మద్యానికి సంబంధించిన అంశం కూటమి ప్రభుత్వానికి చికాకు తెచ్చేలా చేసింది. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ గా ఉండటమే కాదు.. ఈ అంశంపై తీసుకునే చర్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు.. క్యాడర్ కు ఒకసీరియస్ సందేశాన్ని ఇచ్చేలా ఉండాలని భావించినట్లు తెలుస్తోంది. పార్టీకి చెందిన ముఖ్యనేతల తీరుకు సంబంధించిన వివరాల్ని తెప్పించుకున్న చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు వీలుగా.. నిర్ణయం తీసుకున్నారు.
నకిలీ మద్యం కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎక్సైజ్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయటమే కాదు.. మలకల చెరువు కేసుపై అధికారులను వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వైనం గురించి చూస్తే.. ఈ మద్యన కొందరు నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడ్డారు. విచారణలో వారంతా కదిరి నత్తునకోటలో నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి సమాచారం అందుకున్న అధికారులు ఆ కేంద్రంపై దాడులు చేశారు.
అక్కడ భారీ యంత్రాలతో మద్యం తయారు చేస్తున్న వైనం చూసి అవాక్కైన పరిస్థితి అధికారులది. ఈ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున రావటం.. ఈ తయారీ కేంద్రంలో అధికార టీడీపీకి చెందిన కొందరు నేతలు ఉండటంతో.. ప్రతిపక్షాలు దీన్నో అస్త్రంగా మలుచుకున్న పరిస్థితి. ఇలాంటివేళ.. తప్పుడు పనులు చేసినోళ్లు ఎవరైనా.. ఏ స్థాయిలో ఉన్నా చర్యలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు.
ఈ కేసులో పలువురును అరెస్టు చేయగా.. కొందరు పరారీలో ఉన్నారు. పోలీసులకు చిక్కని నిందితుల్లో జనార్దనరావును ఏ1, కొట్టా రాజు(ఏ2).. రాజేశ్ (ఏ5), కె.శ్రీనివాసరావు (12) అరెస్టు కావాల్సి ఉంది.విజయవాడలోని ఒక బార్ కు లైసెన్సు ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు ఈ మొత్తం ఎపిసోడ్ కు కర్త.. కర్మ.. క్రియగా చెబుతున్నారు.వీరికి తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి దాసరిపల్లి జయచంద్రారెడ్డి.. టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయించింది. దీంతో.. తప్పుడు పనులు చేసే వారిని పార్టీలో కొనసాగించే ప్రసక్తే లేదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లైంది.