నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు తాజాగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది కేవలం అక్రమ వ్యాపారం కాదని, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ప్రభుత్వంపై బురద జల్లేందుకు జోగి రమేష్ చేసిన రాజకీయ కుట్ర అని నిందితుడు ఆరోపించాడు.
జనార్ధన్ రావు వెల్లడించిన కీలక వివరాలు ఈ కేసును పూర్తిగా రాజకీయ కోణం వైపు మలుపు తిప్పాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, దానిపై చెడ్డపేరు తెచ్చేందుకే జోగి రమేష్ తనను సంప్రదించి, నకిలీ మద్యం తయారీని మళ్లీ ప్రారంభించాలని ఒత్తిడి చేశారని జనార్ధన్ రావు ఆరోపించాడు. ఈ తయారీ మొదట తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రారంభమైందని, దానికి కావలసిన యంత్రాలు, అద్దె గదుల ఏర్పాటు అంతా జోగి రమేష్ సూచనల మేరకే జరిగిందని తెలిపాడు.
తయారీని ప్రభుత్వం మీదే రుద్దుదాం అని జోగి రమేష్ హామీ ఇచ్చారని, తన ఆర్థిక ఇబ్బందులు తీరుస్తానని నమ్మించారని జనార్ధన్ రావు పేర్కొన్నాడు. తయారీ పూర్తయిన తర్వాత తనను ఆఫ్రికాకు పంపించి, అక్కడి నుంచే జోగి రమేష్ తన సిబ్బంది ద్వారా డిపార్ట్‌మెంట్‌కి లీక్ ఇచ్చి, ప్లాన్ ప్రకారమే రైడ్ చేయించారని ఆరోపించాడు. ఈ రైడ్‌కు సాక్షి మీడియాను కూడా ముందుగానే తీసుకెళ్లారని, తద్వారా చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడమే ఉద్దేశమని జనార్ధన్ రావు స్పష్టం చేశాడు. రైడ్ తర్వాత జోగి రమేష్ తనను మోసం చేశారని, కనీసం బెయిల్ కూడా ఇప్పించలేదని నిందితుడు వాపోయాడు. ఈ కేసులో తన తమ్ముడిని, ఆఫ్రికాలో వ్యాపారాలు చేస్తున్న జై చంద్రారెడ్డిని కూడా ఇరికించారని ఆయన వెల్లడించాడు.
ఈ నకిలీ మద్యం కేసు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్టు చేయగా, మొత్తం 23 మంది నిందితులను గుర్తించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ కుంభకోణంలో టీడీపీ నేతల ప్రమేయం ఉండటంతో, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
https://www.facebook.com/share/v/1BXEEoBkfJ/