భారీ ఎత్తున పేలుడు పదార్థాల్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంచటం ఎంతవరకు సబబు? అన్నది ఒక ప్రశ్న. ప్రమాదకర రసాయనాల్ని పరిశీలించే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో చోటు చేసుకున్న అశ్రద్ధ పేలుడుకు కారణమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను ఒక పోలీస్ స్టేషన్ లో ఉంచే కన్నా.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జమ్ముకశ్మీర్ లోని నౌగామ్ పోలీస్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు జరిగిన పేలుడులో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది మరణించిన సంగతి తెలిసిందే.
ఇది పేలుడా? ఉగ్రచర్య? అన్న సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ఇది పేలుడే తప్పించి మరే కారణం లేదని స్పష్టం చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీస్తుండగా విస్ఫోటనం జరిగినట్లుగా అధికారులు ఇప్పటికే స్పష్టం చేయటం తెలిసిందే. శాంపిల్స్ సేకరించే సమయంలో ఫెరెన్సిక్ టీం అధిక లైటింగ్ ను ఉపయోగించటం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లుగా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అదెలా? అన్న ప్రశ్నకు వారు వివరణ ఇస్తున్నారు. ‘‘సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ.. నేషనల్ గార్డ్స్ నిపుణులు నౌగామ్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఫరీదాబాద్ నుంచి తీసుకొచ్చిన పేలుడు పదార్థాల పెట్టెల్లో ద్రవరూపంలో కెమికల్స్ ఉన్నాయి. వాటిని నిశితంగా పరిశీలించేందుకు లైటింగ్ ను పెంచారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. లైటింగ్ ను పెంచటం ద్వారా పెరిగిన వేడి.. సల్య్ఫూరిక్ యాసిడ్ నుంచి వచ్చిన పొగలు.. ఆ రసాయన మిశ్రమంతో కలిసి విస్ఫోటానికి దారి తీసి ఉండొచ్చు’’ అని చెబుతున్నారు.
పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్నది ఉగ్రకుట్ర కాదని.. ప్రమాదకరమేనని జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్.. కశ్మీర్ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే ఇప్పటికే స్పష్టం చేయగా.. పేలుడు పదార్థాలు సున్నితంగా ఉన్న నేపథ్యంలో పేలుడు చోటు చేసుకోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని మీదా అధికారులు స్పందిస్తూ.. పోరెన్సిక్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉన్నప్పటికి.. పేలుడు చోటు చేసుకుందని చెబుతున్నారు. పేలుడు సందర్భంగా శరీర భాగాలు 300 మీటర్ల దూరంలో పడటం చూస్తే.. పేలుడు పదార్థాలు ఎంత ప్రమాదకరమైనదో ఇట్టే తెలుస్తుంది.


















