అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆబ్కారీ సీఐ హసీనాబాను ఆఫీసుబాయ్‌ను చెప్పుతో కొట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. “మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి నీవు డబ్బులు వసూలు చేసుకొని నాపై చెబుతావా… నాపై లేనిపోని ఆరోపణలు చేస్తావా” అంటూ ఆఫీస్ బాయ్‌ను సీఐ చెప్పుతో కొట్టడం వీడియోలో ఉంది. ఈ వీడియో శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కల్యాణదుర్గం సర్కిల్ పరిధిలో కర్ణాటక మద్యం ఏరులై పారుతుండటం వెనక అధికారుల అక్రమ వసూళ్లే కారణమన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో ఆబ్కారీ కార్యాలయం పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి నుంచి సీఐ ప్రతి నెలా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయమై ఆఫీస్ బాయ్ నాని ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
దీంతో ఇటీవల ఆబ్కారీ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు సీఐతో మాట్లాడేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆఫీస్ బాయ్‌ను పిలిచిన సీఐ… తన పేరు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నావంటూ అతడిని సీఐ నిలదీయడమేగాక… చెప్పుతో కొట్టారు.