వివాదాలతో ప్రచారం కొట్టేయడం కొందరి స్టైల్. బో*ల్డ్ కంటెంట్ తో ప్రజలను ఆకర్షిస్తూ నిరంతరం వార్తల్లో నిలిచే మహిళా నిర్మాత ఏక్తాకపూర్ వివాదం లేనిదే జీవించరన్న సంగతి తెలిసిందే. ఆల్ట్ బాలాజీలో సినిమాలు టీవీ సీరియళ్లు, ఓటీటీ సిరీస్ లు వివాదం కేంద్రంగానే నిర్మితమవుతున్నాయి. ఇవన్నీ వివాదాలతో ప్రచారం అందుకుంటున్నాయి.
అయితే ఏం చేసినా అన్నీ తెలిసే చేసే ఆల్ట్ బాలాజీ అధినేత్రి ఏక్తాకపూర్ ఇప్పుడు కోర్టు నుంచి తాఖీదులు అందుకుంది. నిర్మాత ఏక్తా కపూర్‌పై దాఖలైన ఫిర్యాదులో విచారణ రిపోర్ట్‌ను సమర్పించనందుకు ముంబై కోర్టు నగర పోలీసులకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ కేసులో పోలీసు అధికారులు మే 9 లోగా రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంది. అయితే వారు గడువు ముగిసినా ఇంకా ఎలాంటి రిపోర్ట్‌ను సమర్పించలేదు. దీని కారణంగా ముంబై పోలీసులను సమాధానం కోరుతూ మేజిస్ట్రేట్ కోర్టు నోటీసు జారీ చేసింది.
ఆల్ట్ బాలాజీ నిర్మించిన ఒక వెబ్ షోలో భారతీయ సైనికులను అవమానిస్తూ సన్నివేశాన్ని చూపించారు. సైనిక దుస్తులు ధరించిన ఓ యువకుడు తప్పుడు విధానంలో లైంగికంగా ఇంటిమేట్ అయ్యే సన్నివేశాన్ని చూపించారు. అయితే దీనిని ఖండిస్తూ ఏక్తాకపూర్, ఆమె తల్లిదండ్రులు శోభా- జీతేంద్ర కపూర్ లపైనా హిందూస్తానీ భావు అనే ప్రముఖుడు ఫిర్యాదు చేసారు. నిందితులు తక్కువ స్థాయికి దిగజారి, సిగ్గులేకుండా భారత సైన్యం సైనిక యూనిఫామ్‌ను జాతీయ చిహ్నంతో తెరకెక్కించి మన దేశ గౌరవం, గర్వాన్ని టార్గెట్ చేసారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరిలో బాంద్రాలోని మేజిస్ట్రేట్ కోర్టు తమకు అందిన ఫిర్యాదు మేరకు..క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 202 కింద విచారణ జరపాలని ఖార్ పోలీసులను ఆదేశించింది. ఇక ఏక్తాకు వివాదాలు ఇప్పుడే కొత్త కాదు. గతంలో నిర్మించిన గాంధీ బాత్ సిరీస్ కూ వివాదాస్పదమైంది. పిల్లలపై బోల్డ్ కంటెంట్ తెరకెక్కించారని వివాదం చెలరేగింది. అప్పట్లో ఏక్తాపై ఎఫ్.ఐ.ఆర్ నమోదైంది.