ఉమ్మడి శ్రీకాకుళం రాజకీయాల్లో మరోసారి సామాజిక ఆధిపత్యం వర్సెస్ రాజకీయ ఆధిపత్యం అన్నట్లుగా భీకర పోరుకు రంగం సిద్ధం అవుతోంది. ఈ జిల్లాలో రాజకీయ పెత్తనం అంతా బీసీలదే. అయితే ఇందులో కూడా బలమైన సామాజిక వర్గాల మధ్య పోరాటం అలా సాగుతూనే ఉంటుంది. పార్టీలు వేరు అయినా సామాజిక వర్గాల దగ్గరకు వచ్చేసరికి వాటికి అతీతంగా కలసి ముందుకు సాగడం ఈ జిల్లా ప్రత్యేకత. ఇది బహిరంగ రహస్యమే. ఎవరు ఏ పార్టీలో ఉన్నా తమ వారు గెలవాలని ఆరాటపడతారు అంటారు. ఈ సంగతి ఆయా పార్టీల అధినాయకత్వాలకు సైతం తెలుసు. అయినా ఇక్కడ అంతలా రాజకీయాల్లో పెనవేసుకుని పోయిన సామాజిక ఆధిపత్యాన్ని ఎవరూ వేరు చేసి చూడలేని పరిస్థితి ఏర్పడింది.
వైసీపీలో ఎంతో కీలకంగా వ్యవహరించి దువ్వాడ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చి జగన్ గౌరవించారు. అయితే ఆయన రెండవ పెళ్ళి వ్యవహారం మీడియాలో సంచలనం కావడంతో దాని మీద పార్టీ ఇబ్బందులు పడుతుందని భావించి కొంతకాలం క్రితం ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. నాటి నుంచి రాజకీయ ఊసు తగ్గించి తన సొంత వ్యాపారాల మీదనే దువ్వాడ దృష్టి సారించారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ లో ఒక చీరల వ్యాపారం కూడా ప్రారంభించారు. అయితే లేటెస్ట్ గా ఆయన శ్రీకాకుళం రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చారు. చీరలు మడతేసుకోవడం కాదు అవసరం అయితే శ్రీకాకుళం జిల్లా రాజకీయాలను కూడా మడతేస్తానని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కి దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా మద్దతు ఇచ్చారు. కూన ఇటీవల ఒక వివాదంలో ఇరుక్కున్నారు అయితే దాని వెనక టీడీపీలో మంత్రి అచ్చెన్నాయుడు, వైసీపీలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఉన్నారని కొత్త విషయం చెప్పారు దువ్వాడ శ్రీనివాస్. ఈ ఇద్దరూ కలిసి కూన రవికుమార్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు అని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కూన ఒంటరి వారు కాదని తాను ఆయనకు అండగా ఉంటాను అని ఫుల్ సపోర్ట్ ప్రకటించారు.
ఈ అచ్చెన్న ధర్మాన ఒకే సామాజిక వర్గం. ఇక్కడ కూన రవికుమార్ దువ్వాడ ఒక సామాజిక వర్గం. మరి రాజకీయంగా పార్టీలు వేరు అయినా ఈ పొత్తు ఏమిటి అంటే మా సిక్కోలులో ఇలాగే ఉంటుంది అని అంటారు. దువ్వాడ శ్రీనివాస్ విషయం తీసుకుంటే ఆయన అనుకున్నది చేసే విషయంలో ఎందాకైనా వెళ్తారు అని చెబుతారు. ఆయనది అంతా ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్. ఆయన నిత్య పోరాట యోధుడు. రెండు దశాబ్దాలుగా ఆయన రాజకీయ జీవితం అలాగే సాగుతోంది. ఇక ఆయన ఇపుడు స్వతంత్రుడు. అందుకే వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ ఇపుడు ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో హైలెట్ కావాలని చూస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసకు చెందిన కూన రవికుమార్ కి మంత్రి పదవి తొందరలో వస్తుందని దువ్వాడ శ్రీనివాస్ చెబుతున్నారు. అందువల్లనే ఆయన చుట్టూ రాజకీయం సాగుతోంది అని ఆయన ఆరోపిస్తున్నారు. ఇక దువ్వాడ విషయం తీసుకుంటే అయితే జనసేన లేకపోతే టీడీపీలో చేరుతారు అని గతంలో ప్రచారం సాగింది. ఇపుడు ఆయన కూనకు మద్దతుగా రావడంతో టీడీపీ వైపు ఆయన చూపు ఉందని అంటున్నారు. ఒక వేళ ఆయన చెబుతున్నట్లుగా కూన రవికుమార్ మంత్రి అయితే దువ్వాడ కచ్చితంగా టీడీపీలో చేరుతారు అని అంటున్నారు. మొత్తానికి తన రాజకీయ జీవిత పర్యంతం తీవ్రంగా వ్యతిరేకించే దువ్వాడ శ్రీనివాస్ ఇపుడు కూన విషయంలో అచ్చెన్నాయుడునే గట్టిగా టార్గెట్ చేస్తున్నారు అలాగే వైసీపీలో తనకు పడని ధర్మాన ఫ్యామిలీని ముందుకు తెస్తున్నారు అని అంటున్నారు. మరి దువ్వాడ శ్రీనివాస్ సిక్కోలు రాజకీయాల్లో లెక్కలు తేలుస్తారా అన్నదే ఇపుడు చర్చగా ఉంది.