ఈ దసరా సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు రెండు బడా సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ, రెండోది కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారా: చాప్టర్ 1. ఈ రెండు చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అయితే అనూహ్యంగా, ప్రమోషన్లు తక్కువగా నిర్వహిస్తూ సినిమాలపై సస్పెన్స్ కొనసాగించే కొత్త ట్రెండ్ ను మేకర్స్ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
ఓజీ సినిమా విడుదలకు కేవలం వారం రోజులే మిగిలి ఉంది. ఇప్పటికీ ఇంకా ట్రైలర్ విడుదల కాలేదు. ట్రైలర్ ఫైనల్ ఎడిటింగ్ లో ఉందని సమాచారం. సినిమా రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఓజీ ప్రమోషన్‌లో పాల్గొననున్నారు. ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. ఇక ప్రీ- రిలీజ్ బుకింగ్స్ అద్భుతంగా కొనసాగుతున్నాయి.
ఈ సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ పై ఆధారపడి ఉంది. ఆయన స్టైలిష్ లుక్, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ కానున్నాయి. ఓజీ థియేట్రికల్ రైట్స్ దేశంలోని ఏ ప్రాంతీయ సినిమాకైనా లభించిన అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకూ ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని రికార్డులు ఓజీ క్రాస్ చేసింది.
ఈ కారణంగానే మేకర్స్ ప్రమోషన్లను తగ్గించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా, ఇమ్రాన్ హాష్మి ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా, ప్రకాశ్ రాజ్, శ్రేయా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన పాటలు ఫుల్ వైబ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇక కాంతారా: చాప్టర్ 1 సినిమాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. 2022లో అన్ని భాషల్లో ఘన విజయం సాధించిన కాంతారాకు సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. కానీ ఇప్పటివరకు ట్రైలర్ గానీ, ప్రమోషన్లపై గానీ ఎలాంటి అప్డేట్ లేదు. హోంబలే ఫిల్మ్స్ ట్రైలర్ మాత్రమే విడుదల చేసి, మినిమమ్ ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకు సాగనుంది. మొత్తంగా చూస్తే, ఈ దసరా సీజన్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న ఓజీ, కాంతారా సినిమాలు ప్రమోషన్స్ కంటే స్టార్ పవర్ పైనే ఎక్కువగా ఆధారపడనున్నాయని తెలుస్తోంది.