అదనపు కట్నం కోసం ఆరాచకంగా వ్యవహరించిన ఉదంతాల గురించి విని ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు మీరు చదువుతున్న దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగు చూడటంతో.. డబ్బుల కోసం ఎంతటి దారుణానికైనా తెగిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. కట్న పిశాచికి బలైన ఒక మహిళ తీరుకు మనసు రగిలిపోవటమే కాదు.. దేవుడా.. ఈ నరరూప రాక్షసుడికి కఠిన శిక్ష విధించు అని కోరుకోకుండా ఉండలేని పరిస్థితి. యూపీలోని గ్రేటర్ నోయిడా పరిధిలోని సిర్సా గ్రామంలో చోటు చేసుకున్న దారుణ ఘటనకు సంబంధించిన వీడియో వెలుగు చూసి వైరల్ గా మారింది.
ఇప్పటికే ఇచ్చిన లక్షలాది రూపాయిల కట్నం సరిపోదని.. మరింత కావాలని హింసిస్తూ.. అక్కడితో ఆగకుండా..యాసిడ్ పోసి దారుణంగా సజీవ దహనం చేసిన వైనం చూసినప్పుడు రక్తం సలసలా మరిగిపోవటం ఖాయం. ఈ వీడియో బయటకు రావటంతో ఈ కట్నపిశాచి.. అతడికి అండగా నిలిచిన తల్లి కూడా అరెస్టు అయ్యారు. అసలేం జరిగిందంటే.. సిర్సా వాసి సత్యవీర్ రెండో కొడుకు విపిన్. ఇతనికి 2016లో ఇరవై ఆరేళ్ల నిక్కీతో వివాహమైంది. పెళ్లి వేళలో లక్షలాది రూపాయిల్ని కట్నం రూపంలో ఇవ్వటంతో పాటు.. స్కార్పియో కారును.. విలువైన వస్తువుల్ని బహుమతిగా ఇచ్చారు. ఇటీవల తండ్రి బెంజ్ కారు కొన్నాడు తనకు అలాంటి మరో కారు కానీ.. లేదంటే అదనంగా రూ.36 లక్షలు కట్నాన్ని తీసుకురావాలంటూ భార్యను హింసించటం షురూ చేశాడు.
కొడుకు మాటలకు అడ్డు చెప్పని అతడి తల్లి.. కొడుకు అరాచకాలకు వంత పాడేది. డబ్బుల కోసం భార్యను విపరీతంగా వేధిస్తూ.. ఆమెపై భౌతికదాడులకు పాల్పడేవాడు. తాజాగా ఆమెను ఇష్టారాజ్యంగా కొట్టటమే కాదు.. యాసిడ్ పోసి నిప్పు అంటించిన వైనానికి సంబంధించిన వీడియో వెలుగు చూసింది. ఈ వీడియోలో మంటల్లో తగలబడుతూ.. మెట్ల మీద నుంచి పడిపోతున్న వీడియో వైరల్ గా మారింది. భర్త.. అత్త కలిసి ఆమెను జుట్టుపట్టి కొడుతున్న వీడియో వెలుగు చూసింది.
తన సోదరిని కొట్టొద్దంటూ నిక్కీ అక్క కంచన్ అడ్డుకున్న వేళ.. ఆమెను కొట్టారు. ఇదే విషయాన్ని ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిక్కీని దారుణంగా హింసించి.. యాసిడ్ పోసి తగలబెట్టిన అరాచక ఘటనలో ఆమె భర్తను.. అత్తను అదుపులోకి తీసుకొని అరెస్టుచేశారు. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా తీసుకెళుతున్న వేళ.. పారిపోయే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో బుల్లెట్ గాయంతో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియోను చూసినోళ్లంతా విపిన్ ను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.