టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఓజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన ఆ సినిమా.. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25వ తేదీన విడుదలైంది. ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఓజీ.. మిగతా మూవీ లవర్స్ ను మోస్తరుగా మెప్పించింది.
ముఖ్యంగా పవన్ ను సుజీత్ చూపించిన తీరు పట్ల అభిమానులు ఫిదా అయ్యారు. పవర్ స్టార్ స్వాగ్, స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ ను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అదే సమయంలో మరిన్ని సినిమాలు కూడా చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఎందుకంటే రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. నిర్మాతగా కొనసాగుతానని ఇటీవల తెలిపారు.
హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఆ విషయాన్ని చెప్పారు. రీసెంట్ గా ఓజీ మెగా స్క్రీనింగ్ సమయంలో మాత్రం ఓజీ యూనివర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో పవన్ సినిమాలను కంటిన్యూ చేస్తారని అంతా ఆశిస్తున్నారు. ఇప్పుడు ఓజీ సక్సెస్ మీట్ లో ఏడాదికో సినిమా చేయాలని పవన్ ను దిల్ రాజు కోరారు.
తాజాగా ఆ కార్యక్రమం జరగ్గా.. దిల్ రాజు సహా పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆ సమయంలో దిల్ రాజు మాట్లాడుతూ.. ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పడేలా సుజీత్ చేశారని తెలిపారు. ముఖ్యంగా పవన్ ఫస్ట్ లుక్ విడుదలైన నుంచి తెలుగు ప్రేక్షకులంతా ఆత్రుతగా ఎదురు చూశారని తెలిపారు.
అయితే సెప్టెంబర్ 24 రాత్రి సుదర్శన్ థియేటర్ లోనే తాను సినిమా చూశానని, పవర్ స్టార్ క్రేజ్ ఎలా ఉంటుందో తొలిప్రేమ సినిమా నుంచి తెలుసని అన్నారు. ఓజీకి గాను పవన్ ను ఒప్పించినందుకు సుజీత్ కు చాలా థాంక్స్ అని చెప్పారు. ఒక బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చినందుకు తమన్ కు కూడా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.
అదే సమయంలో తనకు ఎప్పుడైనా అపజయం వచ్చినప్పుడు, విజయం వచ్చే వరకు పవన్ కళ్యాణ్ ఆదర్శమని తెలిపారు. అందుకే తమ అందరిదీ ఒకటే రిక్వెస్ట్ అని.. ఎంత బిజీగా ఉన్నా.. సంవత్సరానికి ఒక సినిమా చేయాలని కోరారు. అది విన్న పవన్.. చిన్న చిరునవ్వు చిందించారు. మొత్తానికి ఫ్యాన్స్ కోరికను బహిరంగంగా పవన్ ఎదుట వెలిబుచ్చారు దిల్ రాజు.