పెళ్లై.. మొగుడు.. పిల్లలు ఉన్నప్పటికి ప్రియుడి కోసం.. అతడితో కొత్త జీవితం కోసం భర్తను చంపేస్తున్న భార్యల ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే తమిళనాడులో చోటు చేసుకుంది. నిజానికి ఇప్పటివరకు భర్తల్ని చంపిన భార్యల జాబితాను చూస్తే.. తమిళనాడులో ఈ తరహా ఘటనలు తక్కువగా కనిపిస్తాయి. ఆ లోటును తీరుస్తూ తాజా ఉదంతం చోటు చేసుకుంది.
వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను తొలగించుకునేందుకు భార్య.. ఆమె ప్రియుడు వేసిన ఎత్తుగడకు అమాయక మొగుడు ప్రాణాలు కోల్పోయాడు. తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామానికి చెందిన 35 ఏళ్ల రసూల్ ఒక ప్రైవేటు కంపెనీలు డ్రైవర్ గా పని చేస్తుంటాడు. అతడికి భార్య (అమ్ముబీ).. ఒక కొడుకు..కుమార్తె ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం రసూల్ వాంతులు చేసుకొని తీవ్ర అనారోగ్యానికి గురి కావటంతో పాటు స్ప్రహ కోల్పోయాడు. దీంతో.. అతడ్ని సేలంలోని ఒక ఆసుపత్రిలో చేర్చారు.అతడి రక్త నమూనాల్ని పరీక్షించిన వైద్యులు అతడి రక్తంలో పురుగుమందు అవశేషాల్ని గుర్తించారు. ఇదే విషయాన్ని రసూల్ కుటుంబ సభ్యులకు వైద్యులు చెప్పారు.
దీంతో.. వారికి రసూల్ భార్యపై సందేహం వచ్చింది. ఆమె సెల్ ఫోన్ లోని వాట్సాప్ చాట్ లను పరిశీలించారు. అందులో లోకల్ గా సెలూన్ నడిపే లోకేశ్వరన్ తో ఆమె చేసిన చాట్ ను గుర్తించారు. తొలుత వీరు విషంతో ఉన్న దానిమ్మ జ్యూస్ లో కలిపి ఇవ్వాలని ప్లాన్ చేశారు. అయితే.. ఆ రోజు రసూల్ దానిమ్మ జ్యూస్ ను తాగలేదు. దీంతో సాంబార్ లో పురుగు మందు కలిపి భర్తకు వడ్డించాలని ప్లాన్ చేశారు.
అనుకున్నట్లే.. భోజనం వేళ సాంబార్ లో పురుగు మందు కలిపి వడ్డించింది. ఇదేమీ తెలీక తిన్న రసూల్.. ఆ వెంటనే తీవ్ర అనారోగ్యానికి గురై స్ప్రహ కోల్పోయాడు. ఈ దారుణ ప్లానింగ్ వివరాల్ని అమ్ముబీ వాట్సాప్ చాట్ లో గుర్తించారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు కేసు నమోదు చేసి.. అమ్ముబీ.. లోకేశ్వరన్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే తప్పు. ఒకవేళ అలాంటి రిలేషన్ లో ఉండి ఉంటే.. నిజాయితీగా ఒప్పుకొని.. భర్త నుంచి విడిపోయి ప్రియుడ్ని పెళ్లి చేసుకుంటే సరిపోతుంది. అందుకు భిన్నంగా మర్డర్ ప్లాన్ చేసి.. అమాయకుడ్ని అంతమొందించటం.. ఆపై అడ్డంగా బుక్ అయి జైలు ఊచలు లెక్కించాల్సిన అవసరం లేదు కదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.