కర్ణాటకలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందిన ధర్మస్థల ఇప్పుడు జాతీయస్థాయి చర్చకు దారితీసింది. ఇంతవరకు వందలాది మృతదేహాలను తానే ఖననం చేశానని చెబుతూ సంచలనం రేపిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కసారిగా తన వాంగ్మూలాన్ని మార్చాడు. దీంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది.
తాజాగా సిట్ ముందు హాజరైన ఆ వ్యక్తి ఆశ్చర్యకర విషయాలు బయటపెట్టాడు. తాను స్వచ్ఛందంగా కాకుండా కొందరి ఒత్తిడితోనే అలా ప్రకటన చేసినట్లు పేర్కొన్నాడు. 2014లోనే ధర్మస్థలాన్ని వదిలి తమిళనాడుకు వెళ్ళిపోయానని, అప్పటి నుంచి అక్కడే స్థిరపడ్డానని వివరించాడు.
2023లో ఒక గ్యాంగ్ తనను సంప్రదించిందని, బలవంతం చేసి సిట్ ముందు తప్పుడు అంగీకారం చెప్పించిందని వెల్లడించాడు. ఆ గ్యాంగ్ తనకు ఒక అస్థిపంజరం అందించి, దాన్ని ఆధారంగా చూపమని ఒత్తిడి చేసిందని ఆయన తెలిపారు. పోలీసుల ముందు ఏమి చెప్పాలో కూడా వారు నేర్పించారని స్పష్టం చేశాడు. తనపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో తప్పనిసరిగా అలా వ్యవహరించాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
ఫిర్యాదుదారుడి కొత్త వాంగ్మూలంతో సిట్ దర్యాప్తు మరో దిశలో సాగనుంది. ఇప్పటికే అధికారులు అతని పూర్తి వీడియో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కేసు వెనుక ఉన్న గ్యాంగ్, దానిని ప్రోత్సహిస్తున్నవారిని గుర్తించేందుకు సిట్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ ఘటనతో కర్ణాటక రాజకీయాల్లో వాదోపవాదాలు ముదురుతున్నాయి. బిజెపి నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ భక్తులలో భయం సృష్టించారని ఆరోపిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర నేతృత్వంలోని బృందం ఇప్పటికే ధర్మస్థలాన్ని సందర్శించి దేవాలయ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డేతో సమావేశమైంది. అదే సమయంలో, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ ఘటన వెనుక కుట్ర ఉందని పేర్కొన్నారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సిట్ విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.