ప్రఖ్యాత శైవ క్షేత్రం.. వేలాది భక్తులు సందర్శించే ప్రాంతం.. అలాంటి ప్రదేశంపై ఓ సాధారణ శానిటరీ వర్కర్ ఆరోపణలు చేశాడు.. ఏమో..? అందులో నిజం ఉందని… లేదని చెప్పలేం కదా..?! శానిటరీ వర్కర్ ముసుగు ధరించి మరీ ఆరోపణలు చేయడంతో నెల రోజులకు పైగా రాద్ధాంతం..! చివరకు ప్రభుత్వమే కదిలి విచారణకు ఆదేశించింది. అతడు చెప్పినది వాస్తవమే అయితే ఎంత గగ్గోలు రేగేదో…?
కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రఖ్యాత శైవ క్షేత్రం ధర్మస్థల. గతంలో ఇక్కడ శానిటరీ వర్కర్ గా పనిచేసి వెళ్లిపోయాడు భీమా. 1998-2014 మధ్య తాను అనేకమంది మహిళలు, యువతులు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను పూడ్చిపెట్టానంటూ అతడు ఆరోపణలు చేశాడు. వీరంతా లైంగిక దాడి బాధితులను కూడా అనుమానం వ్యక్తం చేశాడు. ఈ వ్యాఖ్యలు కర్ణాటకలోనే కాక దేశమంతా సంచలనం రేపాయి. మరి ఇన్నాళ్ల తర్వాత ఎందుకు బయట పెట్టావని ప్రశ్నించగా.. 2014 డిసెంబరులో తమ కుటుంబంలోని యువతిని కొందరు లైంగికంగా వేధిస్తుండడంతో అండర్ గ్రౌండ్ కు వెళ్లినట్లు చెప్పాడు. ఇప్పుడు పశ్చాత్తాపంతో బయటకు వచ్చానని తెలిపాడు. ముసుగు వేసుకుని ఆరోపణలు చేయడంతో అతడిని ముసుగు వ్యక్తిగా పిలవసాగారు.
ధర్మస్థల కేసు ఇప్పుడు వేరొక మలుపు తిరిగింది… ఆరోపణలు చేసిన భీమాని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో తాను చాలా మృతదేహాలను పూడ్చి పెట్టానంటూ ఆరోపణలు చేసిన భీమా ప్రజలను తప్పుదోవ పట్టించాడంటూ తేలింది. తొలుత వందకు పైగా మృతదేహాలను తానే ఖననం చేశానని చెప్పిన భీమా తర్వాత మాట మార్చాడు. తప్పుడు సమాచారంతో ప్రభుత్వం, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు అతడిని అరెస్టు చేశారు.
భీమాను సిట్ అధికారి ప్రణబ్ మొహంతీ శుక్రవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విచారించారు. అతడు కట్టుకథలు అల్లి అందరినీ మోసిగించాడని సిట్ తేల్చింది. శనివారం అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఇక ధర్మస్థల కేసులో బెంగళూరుకు చెందిన సుజాత భట్ కూడా తప్పుడు ఆరోపణలు చేసింది. మెడిసిన్ చదువుతున్న తన కుమార్తె 2003లో ధర్మస్థలకు వెళ్లి తిరిగిరాలేదంటూ సుజాత చెప్పినందంతా కట్టుకథేనని తేలింది. తాను చెప్పినది అంతా తప్పని సుజాత ఒప్పుకొంది. దీంతో ఈమెనూ అరెస్టు చేశారని సమాచారం. భీమా ముసుగు తొలగించిన పోలీసులు అతడి పేరు సీఎన్ అలియాస్ చిన్నా అని రివీల్ చేశారు. చిన్నా ఫొటోను కూడా విడుదల చేశారు.
కర్ణాటకలోని ప్రముఖ యాత్రాక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. గతంలో కీలక వ్యక్తి వాంగ్మూలం మార్చడంతో సంచలనం రేపిన ఈ వ్యవహారంలో తాజాగా మరో ట్విస్టు బయటపడింది. తన కుమార్తె అదృశ్యమైందంటూ ఆరోపణలు చేసిన సుజాత భట్ అనే మహిళ, ఇప్పుడు ఆ కథ అంతా కల్పితం అని ఒప్పుకున్నారు.“ధర్మస్థల ఘటన పెద్ద ఎత్తున చర్చకు రావడంతో, సుజాత భట్ 2003లో తన కుమార్తె అనన్య భట్ స్నేహితులతో అక్కడికి వెళ్లి తిరిగి రాలేదని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.” అప్పట్లో తమను పోలీసులు పట్టించుకోలేదని, బెదిరించి మౌనం పాటింపజేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ఈ వ్యవహారాన్ని ధర్మస్థల కేసుతో కలిపి విచారణ ప్రారంభించారు.
సుజాత మీడియా ముందు అసలు నిజాన్ని బయటపెట్టారు. ‘‘నాకు అనన్య భట్ అనే కుమార్తె లేరు. ఆ కథ మొత్తాన్ని కొంతమంది ప్రభావశీలులు చెప్పించారు. అదృశ్యమైంది అంటూ ప్రచారంలోకి వచ్చిన ఫొటోలు కూడా నకిలీవే. మా కుటుంబానికి చెందిన భూమిని ఆలయ అధికారులు బలవంతంగా తీసుకున్నందుకు, ఆ ఆస్తి వివాదం పరిష్కారం కోసం నేను వారి సూచనల మేరకు ఈ కథ చెప్పాను’’ అని స్పష్టం చేశారు. తాను డబ్బులు తీసుకోలేదని, కానీ తప్పుడు ఆరోపణలు చేసినందుకు పశ్చాత్తాపం ఉందని తెలిపారు. ప్రజలు, భక్తులు తనను క్షమించాలని వేడుకున్నారు. అతనూ మాటమార్చాడా? గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతంలో ధర్మస్థలలో వందల మృతదేహాలను ఖననం చేశానని మాజీ పారిశుద్ధ్య కార్మికుడు భీమా సంచలన ఆరోపణలు చేశాడు. అతడి సూచనల మేరకు తవ్వకాలు జరపగా మృతదేహ అవశేషాలు లభించాయి. కానీ తరువాత అతడూ మాట మార్చి కొత్త వాదన చేశాడు. దీంతో మొత్తం కేసు మిస్టరీగా మారింది.