రాజకీయ పార్టీలన్నీ ఒకేలాంటివని చెబుతున్నా.. కొన్ని పార్టీలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటాయని చెబుతారు. అదేం కాదు.. అన్నీ ఒకే తానులోని ముక్కలే అన్నట్లుగా నిరూపించే ఉదంతాలు కొన్ని తెర మీదకు వస్తుంటాయి. ఇందుకు తగ్గట్లే ఢిల్లీ సీఎం తీరు ఉందని చెప్పాలి. మిగిలిన రాజకీయ పార్టీలతో పోలిస్తే.. బీజేపీ కాస్తా భిన్నంగా చెబుతారు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. బీజేపీలో క్రమశిక్షణ ఎక్కువగా చెప్పాలి.
అవినీతి లాంటి వాటికి బీజేపీ ఏమీ మినహాయింపు కానప్పటికీ.. కొన్ని జాడ్యాలు ఆ పార్టీని ఇంకా పట్టుకోలేదన్న మాట ఉండేది. ఢిల్లీసీఎం రేఖా గుప్తా పుణ్యమా అని అది కూడా మారిందని చెప్పాలి. బీజేపీలో కీలక పదవుల్లో ఉండే వారు.. తమ కుటుంబ సభ్యులను సైతం పక్కన పెట్టేస్తుంటారు. అందుకు భిన్నంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాత్రం.. తన వెంట తన భర్తను కూడా తీసుకెళ్లటంతో ఢిల్లీ సీఎం తీరును తప్పు పడుతున్నారు.
అధికారిక కార్యక్రమాల్లోనూ సీఎం.. తన భర్తను తీసుకెళ్లటమేమిటి? అందునా బీజేపీ ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించటమా అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఢిల్లీలోని షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో పలు డెవలప్ మెంట్ ప్రాజెక్టులపై నిర్వహించిన రివ్యూలో అధికారులతో పాటు భర్త మనీష్ గుప్తా కూడా పాల్గొన్నారు. ఈ రివ్యూలో సీెం రేఖా గుప్తాతో పాటు.. పసుపుపచ్చ రంగు షర్టు వేసుకున్న ఆమె భర్త కూడా అధికారులతో పాటు కూర్చోవటం రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ తీరును ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
అధికారిక సమావేశాల్లో సీఎం భర్త ఎలా హాజరయ్యారు? ప్రభుత్వంతో సంబంధం లేని వ్యక్తిని అధికారిక సమావేశాల్లో కూర్చోబెట్టటాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఈ సందర్భంగా పులేరా అనే మాట ఒకటి తెర మీదకు వచ్చింది. ఢిల్లీలో పులేరా ప్రభుత్వం నడుస్తుందా? అని ఆమ్ ఆద్మీ నేతలు విమర్శిస్తున్నారు. పులేరా మాటకు అర్థమేమంటే.. పంచాయత్ అనే వెబ్ సిరీస్ లో ‘పులేరా’ గ్రామానికి సర్పంచ్ మహిళ అయినప్పటికీ అక్కడ ఆమె భర్త పెత్తనం చెలాయిస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు పులేరా సర్కారు అంటూ ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ సీఎం తీరును బీజేపీ నేతలు సమర్థిస్తున్ారు. మనీశ్ కేవలం ముఖ్యమంత్రి రేఖ భర్త మాత్రమే కాదని.. ఆయనో సామాజిక కార్యకర్తగా పేర్కొంటూ.. షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో జరిగే పనుల్ని పర్యవేక్షిస్తుంటారని చెబుతున్నారు. స్థానిక ప్రజల ప్రతినిధిగా ఉన్నారని.. ఆ హోదాలోనే ఆయన మీటింగ్ లో పాల్గొన్నట్లు చెబుతున్నా… ఈ తరహా వైఖరి బీజేపీకి కొత్తగా చెప్పక తప్పదు. మిగిలిన పార్టీలకు తాము భిన్నమైన వాళ్లమని చెప్పే కమలనాథులు.. ఆ ట్యాగ్ ను పోగొట్టుకోకూడదంటే.. ఢిల్లీ సీఎం రేఖ లాంటి వారు వ్యవహరిస్తున్న తీరుకు వెంటనే చెక్ చెప్పాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ వివాదంపై మోడీషాలు ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.