ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో షాకింగ్ విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా 2021 నుంచి కనీసం ఆరు నగరాల్లో ఉగ్రదాడులకు సిద్ధమవుతోందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఇందులో ‘మేడమ్ సర్జన్’ పాత్ర కీలకమని చెబుతున్నారు.
అవును… ఢిల్లీ పేలుళ్ల మాడ్యూల్ 2021 నుంచి కనీసం ఆరు భారతీయ నగరాల్లో సమన్వయంతో కూడిన ఉగ్రవాద దాడులకు సిద్ధంవుతోందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో మేడమ్ సర్జన్, డీ-6 వంటి పదాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ చేసిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలతో పాటు చేతితో రాసిన డైరీలు, ప్లానింగ్ నోట్స్ ఈ విషయాన్ని వెల్లడించాయని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 6న (బాబ్రీ మసీదు కూల్చివేత రోజు) దేశవ్యాప్తంగా ఆరు నగరాల్లో దాడికి బ్లూప్రింట్ ను నాలుగు సంవత్సరాల క్రితమే ప్రారంభించినట్లు చూపిస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో.. నిషేధిత జైషే మహ్మద్, అన్సార్ గజ్ వత్ ఉల్ హింద్ ఉగ్ర సంస్థలతో సంబంధమున్న 43 ఏళ్ల ‘మేడమ్ సర్జన్’ షాహిన్ షాహిద్.. ఈ ఉగ్ర నెట్ వర్క్ లో కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఈమెతో పాటు ఎర్రకోట పేలుడు బాంబర్ డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజ్ మల్ షకిల్ లు ఈ మాడ్యూల్ లో భాగమని తెలుస్తోంది. ఈ విచారణలో భాగంగా షాహిన్ బ్యాంక్ అకౌంట్స్ ను ఆడిట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా… ఢిల్లీ, లక్నో, కాన్పూర్ లలో ఉన్న ఏడు బ్యాంక్ అకౌంట్స్ ని పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆమె అనూహ్యంగా మిస్ అయ్యేవరకూ జీ.ఎస్.వీ.ఎం మెడికల్ కాలేజీలోనే పని చేసింది.
ఈ సమయంలో… 2010 రాడికలైజెషన్ నుంచి 2015-16లో జైషే మహమ్మద్ సర్కిలోకి ప్రవేశించడం, 2020 లో నిర్మాణాత్మక ప్రణాళిక, అనంతరం 2025లో తప్పించుకునే ప్రయత్నం వరకూ వివరాలను ముగ్గురు ప్రధాన నిందితుల నుంచి ఏజెన్సీలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది దీర్ఘకాలిక ఉగ్రవాద ప్రాజెక్టులో భాగమని అధికారులు చెబుతున్నారు! వాస్తవానికి ఢిల్లీ పేలుడు తర్వాత షాహీన్ విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నించిందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఇటీవల కొత్త పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుందని.. కానీ, పేలుడు దర్యాప్తు తర్వాత పోలీసు వెరిఫికేషన్ ఆలస్యం అవ్వడంతో ఆమె ప్లాన్ విఫలమైందని అధికారులు తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత ఆమె స్థానిక పరిచయాలను తెంచుకోవడం ప్రారంభించిందని అంటున్నారు.

















